Somireddy: టీడీపీ ఆఫీస్‌పై దాడికి సంబంధించిన ఆధారాలివే.. పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు..?

ఆంధ్ర రాష్ట్రంలో పోలీసుల తీరు.. దిగజారిందని టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Somireddy: టీడీపీ ఆఫీస్‌పై దాడికి సంబంధించిన ఆధారాలివే.. పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు..?

Somireddy

ఆంధ్ర రాష్ట్రంలో పోలీసుల తీరు.. దిగజారిందని టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఆఫీస్ పై ఇటీవల జరిగిన దాడికి సంబంధించిన ఆధారాలు ఇవే అంటూ.. ఆయన మీడియాకు కొన్ని ఫొటోలు, వీడియోలు చూపించారు. పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ కు.. సీఎం లక్షణాలు లేవని మండిపడ్డారు. ప్రజలు తిరగబడే పరిస్థితి వచ్చిందని.. పోలీసులు స్పందించకుంటే.. తామే స్పందించాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.

మంగళగిరిలో టీడీపీ కార్యాలయంపై దాడి జరిగినప్పుడు.. వైసీపీ నాయకుడు లేళ్ల అప్పిరెడ్డి కారు ఉందని.. ఇటీవల గాంధీ కో ఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ గా నియమితులైన జోగిరాజు అక్కడే ఉన్నారని సోమిరెడ్డి చెప్పారు. అలాగే.. విజయవాడ 18వ డివిజన్ కార్పొరేటర్ సత్యంతో పాటు.. అప్పిరెడ్డి అనుచరులు చైతన్య, రోషన్ కూడా ఉన్నారని కొన్ని ఫొటోలను మీడియాకు సోమిరెడ్డి చూపించారు. ఆ సమయంలో అక్కడ ఉన్న డీఎస్పీ సైతం.. వైసీపీ నాయకులను పెళ్లికొడుకుల్లా దగ్గరుండి కారు ఎక్కించి పంపించారంటూ సోమిరెడ్డి ఆగ్రహించారు.

రాష్ట్రం ఎటు పోతోందని సోమిరెడ్డి ఆవేదన చెందారు. ముఖ్యమంత్రి, ఆయన పక్కనున్నవాళ్లు బాగుంటే సరిపోతుందా.. అని ప్రశ్నించారు. ప్రజలు తిరగబడే రోజు వచ్చిందన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో పోలీసులు.. వ్యవస్థ ప్రతిష్ట దిగజార్చారని.. వారు ప్రజల జీతగాళ్లన్న విషయం పోలీసులు గుర్తుంచుకోవాలని కామెంట్ చేశారు. బీహార్, పశ్చిమ బెంగాల్ లో పోలీసులు సమర్థంగా ఉన్నారని అన్నారు. టీడీపీ ఆఫీస్ పై దాడి చేసిన వారిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదో పోలీసులు చెప్పాలని డిమాండ్ చేశారు.

దాడులపై ఫిర్యాదులు చేస్తే.. తిరిగి తమ పార్టీ నేతలపైనే కేసులు నమోదు చేస్తున్నారని పోలీసుల తీరును సోమిరెడ్డి తప్పుబట్టారు. రాజశేఖరరెడ్డి హయాంలో కూడా ఇంతటి దారుణ పరిస్థితి లేదని అన్నారు. ముఖ్యమంత్రి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదని చెప్పారు.