ఇన్ఫోసిస్ లో అనైతిక చర్యలు…CEO,CFOలపై తీవ్ర ఆరోపణలు

  • Published By: venkaiahnaidu ,Published On : October 21, 2019 / 09:31 AM IST
ఇన్ఫోసిస్ లో అనైతిక చర్యలు…CEO,CFOలపై తీవ్ర ఆరోపణలు

దేశీయ రెండవ అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కొత్త వివాదంలో ఇరుక్కుంది. ఇన్ఫోసిస్ CEO సలీల్ పరేఖ్, CFO నిలంజన్ రాయ్ లపై ఆ కంపెనీకి చెందిన కొందరు ఉద్యోగులు(విజిల్ బ్లోయర్స్) తీవ్ర ఆరోపణలు చేశారు. చాలా క్వార్టర్స్ నుంచి తక్కువసమయంలో ఆదాయం,లాభాల కోసం కంపెనీ అనైతిక విధానాలను ఆచరిస్తుందని ఆరోపించారు. విజిల్‌బ్లోయర్ ఫిర్యాదును కంపెనీ విధానం ప్రకారం ఆడిట్ కమిటీ ముందు ఉంచబడిందని, విజిల్‌బ్లోయర్స్ పాలసీకి అనుగుణంగా ఇది డీల్ చేయబడుతుందని అని ఇన్ఫోసిస్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇన్ఫోసిస్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్,అదేవిధంగా యూఎస్ సెక్యూరిటీ అండ్ ఎక్సేంజ్ కమిషన్(SEC)కి విజిలిబ్లోయర్స్ లేఖ రాశారు. తామ ఆరోపణలు నిజం అని నిరూపించే ఈమెయిల్స్, వాయిస్ రికార్డింగ్‌లు ఉన్నాయని ఆ లేఖలో వారు తెలిపారు. ఈ క్వార్టర్(త్రైమాసికం)లో ఎఫ్‌డిఆర్ కాంట్రాక్టులో 50 మిలియన్ డాలర్ల ముందస్తు చెల్లింపు రివర్సల్‌లను గుర్తించవద్దని చాలా ఒత్తిడి తెచ్చారని, ఇది అకౌంటింగ్ ప్రాక్టీస్‌కు విరుద్ధమని, ఇది త్రైమాసికంలో లాభాలను తగ్గిస్తుందని, స్టాక్ ధరకు ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఇన్ఫోసిస్ సీఈవో,సీఎఫ్ వో ఒత్తిడి చేస్తున్నారని సెప్టెంబర్-20,2019న బోర్డుకి రాసిన లేఖలో వారు ఆరోపించారు. అదేవిధంగా ఆడిటర్లు,బోర్డ్ ఆఫ్ డైరక్టర్ల నుంచి కూడా క్లిష్టమైన సమాచారం దాచబడిందని లేఖలో తెలిపారు.

వెరిజోన్, ఇంటెల్,ఏబిన్ అమ్రో వంటి పెద్ద కాంట్రాక్టులలో ఆదాయ గుర్తింపు విషయాలు అకౌంటింగ్ ప్రమాణాల ప్రకారం లేవని,దీనికి సంబంధించిన ఈమెయిల్స్,వాయిస్ రికార్డింగ్స్ తమ దగ్గర ఉన్నాయని,విచారణఅధికారులు తమను అడిగినప్పుడు వీటిని సమర్పిస్తామని విజిల్ బ్లోయర్స్ తెలిపారు. ఆడిటర్స్ కి పెద్ద డీల్ సమాచారం  తెలియజేయవద్దని తమను అడిగినట్లు వారు ఆ లేఖలో తెలిపారు.