హైదరాబాద్‌లో ప్రధాని మోదీ సభ.. ఎమ్మెల్యే రాజాసింగ్‌కు అనుమతి నిరాకరణ

తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ చివరి ఎన్నికల ప్రచార సభలో పాల్గొనేందుకు వచ్చిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు చేదు అనుభవం ఎదురైంది.

హైదరాబాద్‌లో ప్రధాని మోదీ సభ.. ఎమ్మెల్యే రాజాసింగ్‌కు అనుమతి నిరాకరణ

Updated On : May 10, 2024 / 6:50 PM IST

BJP MLA Raja Singh: లోక్‌స‌భ‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బీజేపీ భాగ్యనగర్ జనసభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటున్నారు. సభలో పాల్గొనేందుకు శుక్రవారం సాయంత్రం ఎల్బీ స్టేడియానికి వచ్చిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు చేదు అనుభవం ఎదురైంది. స్టేజీపైకి వెళ్లేందుకు ఆయనకు ఎస్పీజీ సిబ్బంది అనుమతి నిరాకరించారు. నిర్దేశించిన సమయాని కన్నా లేటుగా రావడంతో ఆయనను సభా వేదికపైకి అనుమతించలేదు. సభా వేదికపైకి అనుమతి ఇవ్వకపోవడంతో ప్రజల మధ్యలోనే రాజాసింగ్‌ కూర్చోవలసి వచ్చింది. పిలిచి అవమానించారని పోలీసులపై రాజాసింగ్ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కిషన్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్, బూర నర్సయ్య గౌడ్, మాధవీలత, సీనియర్ నాయకుడు డాక్టర్ కె.లక్ష్మణ్ తదితరులు సభావేదికపై ఆశీనులయ్యారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య సాధారణ ప్రజలతో కలిసి మోదీ సభ చేసేందుకు వచ్చారు.

Also Read: షాద్‌న‌గ‌ర్‌ పీఎస్‌లో బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్‌పై కేసు నమోదు.. ఎందుకంటే?

ప్రధాని మోదీ తెలంగాణలో ఇప్పటి వరకు 7 బహిరంగ సభలు, ఒక రోడ్డు షో నిర్వహించారు. ఈరోజు సభతో తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని ఆయన ముగించనున్నారు. సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల, భువనగిరి, హైదరాబాద్ లోక్‌స‌భ‌ అభ్యర్థులకు మద్దతుగా భాగ్యనగర్ జనసభలో ప్రధాని పాల్గొన్నారు. తెలంగాణలో ప్రధాని చివరి ఎన్నికల ప్రచార సభ కావడంతో కమలనాథులు భారీ సంఖ్యలో జన సమీకరణ చేశారు. దీంతో ఎల్బీ స్టేడియం కాషాయ జెండాల మయం అయింది.

Also Read: ఏడాదిలోపు తెలంగాణలో మళ్లీ ఎన్నికలు.. సీఎం రేవంత్ రెడ్డి నా శిష్యుడే: ఎర్రబెల్లి