మన ఓట్లు చీల్చాలని, చంద్రబాబును గెలిపించాలని కాంగ్రెస్ కుట్ర- కడపలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

నన్ను 16 నెలలు అన్యాయంగా జైల్లో పెట్టారు. నేను కోల్పోయిన 16 నెలల కాలాన్ని ఎవరు తిరిగిస్తారు?

మన ఓట్లు చీల్చాలని, చంద్రబాబును గెలిపించాలని కాంగ్రెస్ కుట్ర- కడపలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

CM Jagan : కడప ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మైనార్టీలకు 4శాతం రిజర్వేషన్లు ఉండాల్సిందేనన్న జగన్.. మోదీ సభలో చంద్రబాబు ఇలా చెప్పగలరా? అని నిలదీశారు. మైనార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకం అని బీజేపీ చెబుతున్నా.. చంద్రబాబు ఎందుకు కూటమిలో కొనసాగుతున్నారని ప్రశ్నించారు. కడపలో రాజకీయ చైతన్యం ఉంటుందన్న జగన్.. ఇండిపెండెంట్ ఎంపీగా పోటీ చేస్తే 5లక్షల 45వేల ఓట్ల మెజార్టీతో గెలిపించారని తెలిపారు. నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన వారితో కలిసిపోయిన వారా వైఎస్ఆర్ వారసులా? అని మండిపడ్డారు సీఎం జగన్.

వైఎస్ఆర్ పేరును ఛార్జ్ షీటులో పెట్టిన పార్టీ, నన్ను అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టిన పార్టీ కాంగ్రెస్ అని ధ్వజమెత్తారు సీఎం జగన్. ఆ కాలాన్ని నాకు ఎవరు తిరిగిస్తారని జగన్ నిలదీశారు. ఎన్నికల కోసం నాన్న సమాధి దగ్గరకు ఢిల్లీ నుంచి వస్తారట అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే మన కళ్లను మనం పొడుచుకున్నట్లే, కాంగ్రెస్ కు ఓటు వేస్తే మన ఓటును మనం చీల్చుకుని ఎన్డీయేను గెలిపించినట్లే అని ముఖ్యమంత్రి జగన్ అన్నారు.

”చంద్రబాబును గెలిపించేందుకు ఏపీలో కాంగ్రెస్ రంగప్రవేశం చేసింది. కాంగ్రెస్ కి ఓటు వేస్తే మన ఓట్లను చీల్చి ఎన్డీయేను గెలిపించడం కాదా? చంద్రబాబు పగలు బీజేపీతో రాత్రి కాంగ్రెస్ తో కాపురం చేస్తారు. రాజకీయాలు ఎంతగానో దిగజారిపోయాయి. ఎంపీ అవినాశ్ జీవితాన్ని నాశనం చేసేందుకు చంద్రబాబుతో కలిసి కాంగ్రెస్ కుట్ర చేస్తోంది” అని ఆరోపించారు సీఎం జగన్.

”మరో మూడు రోజుల్లో బ్యాలెట్ బద్దలు కొట్టడానికి సిద్ధమా? జగన్ కు ఓటువేస్తేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయి. చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ముగింపే. రాష్ట్ర రాజకీయాలను మారుస్తూ విశ్వసనీయతకు అర్థం చెప్పేలా పాలన కొనసాగించాం. మ్యానిఫెస్టోలో చెప్పిన అంశాల్లో 99శాతం అమలు చేశాం. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా 2.31లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. రూ.2.70లక్షల కోట్లు నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశా. గతంలో ఎప్పుడైనా ఇలాంటి సంక్షేమం జరిగిందా?

వైఎస్ఆర్ మరణం తర్వాత కాంగ్రెస్ నన్ను ఇబ్బంది పెట్టింది. నన్ను 16 నెలలు అన్యాయంగా జైల్లో పెట్టారు. నేను కోల్పోయిన 16 నెలల కాలాన్ని ఎవరు తిరిగిస్తారు? వైఎస్ఆర్ పేరు కనపడకూడదని కుట్రలు చేశారు. టీడీపీతో కలిసి పని చేస్తున్న వాళ్లు వైఎస్ఆర్ వారసులా? ఇన్నేళ్ల తర్వాత నాన్న సమాధి దగ్గరకు వెళ్తారట. చంద్రబాబును గెలిపించాలని, మన ఓట్లు చీల్చాలని కాంగ్రెస్ కుట్ర. అవినాశ్ ఎలాంటి వాడో నాకు, మీకు అందరికీ తెలుసు. అవినాశ్ పై నాకు నమ్మకం ఉంది.

రాజకీయాలు దిగజారిపోయాయి. కాంగ్రెస్ కు ఓటు వేయడం అంటే మన ఓట్లను మనమే చీల్చుకుని ఎన్డీయే గెలుపు కోసం పని చేయడమే. కాంగ్రెస్ కు ఏపీ ప్రజలు ఎప్పుడో సమాధి కట్టారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా? మ్యానిఫెస్టోలో ఇచ్చిన ఒక్క హామీ అయినా చంద్రబాబు నెరవేర్చారా? సూపర్ సిక్స్ పేరుతో మళ్లీ మోసం చేయడానికి వస్తున్నారు” అని సీఎం జగన్ అన్నారు.

Also Read : ఏపీ రాజకీయాలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు.. పిఠాపురంలో ప్రచారంపై క్లారిటీ