కాబుల్ లో ఉగ్రవాదుల దాడి : 19 మంది మృతి

  • Published By: murthy ,Published On : November 2, 2020 / 08:28 PM IST
కాబుల్ లో ఉగ్రవాదుల దాడి : 19 మంది మృతి

Suicide Bomb Attack at kabul university : ఆఫ్ఘనిస్తాన్ లోని కాబూల్ లో సోమవారం ఉగ్రవాదులు దారుణానికి తెగబడ్డారు. కాబూల్‌ యూనివర్సిటీ సమీపంలో ఉగ్రవాదులు గ్రనేడ్ లు, తుపాకులతో దాడికి పాల్పడ్డారు. పేలుళ్లు, కాల్పుల శబ్దాలతో యూనివర్శిటీ ప్రాంగణం రక్తసిక్తమయ్యింది. ఈ దాడిలో 19 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మరో 22మంది గాయపడ్డారు.

యూనివర్సిటీలో జరగబోయే ఇరానియన్ బుక్ ఫెయిర్ ను ప్రారంభించటానికి వస్తున్న అధికారులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రదాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడిని ఆప్ఘన్‌ ప్రభుత్వం కూడా ధ్రువీకరించింది.  కాగా… ఈ దాడిలో మొత్తం ముగ్గురు ఉగ్రవాదులు పాల్గొన్నట్లు అఫ్ఘనిస్తాన్ హోం శాఖ మంత్రి తారీఖ్ ఆరియన్ ప్రకటించారు.


దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను భద్రతా దళాలు తుదముట్టించాయి. మొదట ఒక ఉగ్రవాది తనను తాను పేల్చుకున్నాడు. అనంతరం మిగిలిన ఇద్దరు ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.  దీంతో రంగంలోకి దిగిన భద్రతా దళాలు కొద్ది సేపట్లోనే ఇద్దరు ఉగ్రవాదులను అంతమొందించారు.

మృతుల్లో ఎక్కువమంది విద్యార్థులే. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఈ ఉగ్రదాడితో తమకేమీ సంబంధం లేదని తాలిబన్ లు ప్రకటించారు.