పిల్లలు పుడతారనే ఆశతో ఆలయాల్లో విగ్రహాలు చోరీ చేసిన దంపతులు

పిల్లలు పుడతారనే ఆశతో ఆలయాల్లో విగ్రహాలు చోరీ చేసిన దంపతులు

stole idols of deities from for wife to conceive : పిల్లులు పుట్టని దంపతులు గుళ్లూ గోపురాలు తిరుగుతారు.పుణ్యక్షేత్రాలకు తిరుగుతారు. నాగదోషం ఉందని తెలిస్తే నాగదేవతలకు పరిహార పూజలు చేస్తారు. కొంతమంది రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారు. హోమాలు చేస్తుంటారు. ఎన్నో మొక్కులు మొక్కుకుంటారు. ముడుపులు కడతారు. దేవాలయాల్లో చెట్లకు ఉయ్యాలలు కడతారు. కానీ హైదరాబాద్ కు చెందిన ఈ ఈ భార్యాభర్తలు అదోరకం..!

పెళ్లయి ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టడం లేదని ఏకంగా దేవాలయాల్లో దేవుడి విగ్రహాలు చోరీ చేసేస్తున్నారు. చోరీలు చేసిన విగ్రహాలకు పూజలు చేస్తున్నవైనం లంగర్‌హౌజ్, కుల్సుంపురా పీఎస్‌ల పరిధిలో వెలుగులోకొచ్చింది.

ఫిలింనగర్‌కు చెందిన సంతవరపు సిద్దేశ్ అనే 27 భర్తా, అతని భార్య 27 ఏళ్ల సుజాతలకు కొన్నేళ్ల క్రితం పెళ్లయింది. కానీ ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టలేదు. దీంతో పిల్లలు లేరనే బెంగ వారిని బాధపెడుతోంది. ఎక్కడికెళ్లినా ఏంటీ మీకింకా పిల్లలు పుట్టలేదా? అంటూ జాలి చూపించటం..ఎవరికి తోచినట్లుగా వాళ్లు సలహాలు ఇచ్చేయటం పరిపాటిగా మారింది. దీంతో ఏ శుభకార్యాలకు వెళ్లాలన్నా సిద్ధేశ్ కు సుజాతలకు పెద్ద ఇబ్బందిగా మారేది. దీంతో పెద్దగా ఎక్కడికీ వెళ్లేవారు కాదు.

ఈక్రమంలో నాగదేవత, కట్ట మైసమ్మ, లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహాలను ఇంటికి తీసుకొచ్చి పూజలు చేస్తే.. ఇంట్లో ఉన్న పీడ తొలగిపోయి సంతాన ప్రాప్తి పొందొచ్చని సిద్దేశ్ స్నేహితుడు ఒకరు సలహా ఇచ్చాడు. పిల్లలు పుడతారనే ఆశతో సిద్ధేశ్ ఏమాత్రం ఆలోచించలేదు. స్నేహితుడు ఇచ్చిన సలహాను తూచాతప్పకుండా పాటించారు సిద్దేశ్, అతని భార్య సుజాత. దీంట్లో భాగంగా.. కుల్సుంపురా పీఎస్ పరిధిలోని నాగదేవత ఆలయంలో, లంగర్‌హౌజ్ పీఎస్ పరిధిలోని లక్ష్మీ నరసింహ స్వామి మందిరంలో విగ్రహాలను చోరీ చేశారు.

విగ్రహాలు కనిపించడం లేదని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా..అసలు విషయం బయటపడింది. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు సిద్దేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. భర్తను పోలీసులు తీసుకుపోవటంతో భయపడిపోయిన సుజాత పరారైపోయింది. దీంతో పరారీలో ఉన్న సుజాత కోసం గాలిస్తున్నారు.

సిద్దేశ్ విచారించగా..అసలు విషయం చెప్పాడు. పిల్లలు పుడతారనే ఆశతోనే ఇలా చేశామని వేరే ఉద్ధేశం లేదని చెప్పాడు. అలా సిద్ధేశ్ వద్ద నుంచి ఇత్తడితో తయారుచేసిన విగ్రహంతో పాటు మరికొన్ని లోహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న భార్యాభర్తలిద్దరూ ఎవరో ఏదో చెప్పారని మరో ఆలోచన లేకుండా.. స్నేహితుడి సలహాను పాటించి నేరంలో చిక్కుకున్న ఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది.