ఏపీ Vs తెలంగాణ : కరెంట్ బాకీల విషయంలో రగడ

  • Published By: veegamteam ,Published On : March 9, 2019 / 03:58 AM IST
ఏపీ Vs తెలంగాణ : కరెంట్ బాకీల విషయంలో రగడ

తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం కాకరేపుతోంది. తెలంగాణ విద్యుత్‌ సంస్థల అధికారుల మధ్య ఆరోపణలు..ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి.. రూ.5వేల 600 కోట్లు ఇవ్వాలంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందనీ.. నిజానికి ఏపీనే తెలంగాణకు బాకీ ఉందంటూ లెక్కలు వెల్లడించారు తెలంగాణ విద్యుత్ శాఖ అధికారులు. ఇవ్వాల్సింది ఇచ్చి.. తీసుకోవాల్సింది ఉంటే తీసుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా ఏపీ నుంచి స్పందన లేదని తెలంగాణ ట్రాన్స్‌కో-జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు వివరించారు.

తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ చెప్పిన అంశాలు వాస్తవ విరుద్ధమని ఏపీ జెన్‌కో ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. విద్యుత్తు వినియోగించుకున్న పుస్తకాల్లోని గణాంకాల ఆధారంగా లెక్కించినా తెలంగాణ నుంచి ఏపీ జెన్‌కోకు ఇంకా రూ.11వేల 728 కోట్లు రావాల్సి ఉందని ప్రకటించింది ఏపీ జెన్ కో. తెలంగాణ రాష్ట్ర దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల ఖాతా పుస్తకాల్లో స్పష్టంగా రూ.8వేల 274 కోట్లు ఏపీ జెన్‌కోకు చెల్లించాల్సి ఉందన్న విషయాన్ని ప్రస్తావించింది. మిగిలిన మొత్తం తెలంగాణ ఉత్తరప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల నుంచి రావాల్సిన బకాయిగా ఏపీ జెన్‌కో వివరించింది.

విభజన తర్వాత కూడా తెలంగాణ డిస్కంలకు కరెంట్ సరఫరా జరిగిందని.. ఇందుకు రూ.5వేల 732.40 కోట్లు రావాల్సి ఉందని ఏపీ జెన్ కో స్పష్టం చేసింది. ఈ బకాయిలు రాబట్టుకోవడానికి ఎప్పటికప్పుడు జెన్‌కో ప్రయత్నిస్తోందని వెల్లడించారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశంలోనూ ఈ అంశం చర్చకు వచ్చిన విషయాన్ని ప్రస్తావించింది ఏపీ.

ప్రతి నెలా విద్యుత్ బిల్లులతో పాటు రూ.150 కోట్ల చొప్పున తీర్చేస్తామని తెలంగాణ హామీ ఇచ్చిందని వెల్లడించింది ఏపీ.  ఇంతవరకు ఆ మాట నెరవేర్చలేదని ఏపీ జెన్‌కో స్పష్టం చేసింది. నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యుూనల్‌ ముందు తెలంగాణ విద్యుత్ సంస్థలపై ఇన్‌సాల్వెన్సీ చట్టం కింద పిటిషన్‌ దాఖలు చేయడం తప్ప ఏపీ జెన్‌కోకు మరో మార్గం లేదని ఏపీ జెన్ కో ప్రకటించింది.