పోలీసుల నిర్బంధం కేసు : కాంగ్రెస్ నేత కొండాకి బెయిల్

  • Published By: veegamteam ,Published On : April 29, 2019 / 10:07 AM IST
పోలీసుల నిర్బంధం కేసు : కాంగ్రెస్ నేత కొండాకి బెయిల్

పోలీసులను నిర్బంధించిన కేసులో కాంగ్రెస్ నేత, చేవేళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డికి హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. రూ.25వేలు విలువైన రెండు పూచీకత్తులు సమర్పించాలని కొండాకు హైకోర్టు ఆదేశించింది. 41 A సీఆర్పీసీ ప్రకారం నోటీసులు అందుకున్న తర్వాత పోలీసుల విచారణకు సహకరించాలని కొండాకి హైకోర్టు సూచించింది.

ఎన్నికల సమయంలో పోలీసుల తనిఖీల్లో కొండా విశ్వేశ్వరరెడ్డి బంధువు కొండా సందీప్ రెడ్డి దగ్గర రూ.10లక్షలు దొరికాయి. దీనిపై వివరణ కోరేందుకు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు తీసుకుని బంజారాహిల్స్ లోని కొండా ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో కొండా విశ్వేశ్వరరెడ్డి, ఆయన అనుచరులు తమతో దురుసుగా ప్రవర్తించారని, గదిలో నిర్బంధించి చిత్రహింసలు పెట్టారని.. ఎస్ఐ, కానిస్టేబుల్.. బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బంజారాహిల్స్ పోలీసులు కొండాపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణకు హాజరవకుండా కొండా తప్పించుకుని తిరుగుతున్నారని పోలీసులు ఆరోపించారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చెయ్యాలని కొండా విశ్వేశ్వర రెడ్డి నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ ను విచారించిన కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో కొండా హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టులో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.

2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున చేవేళ్ల ఎంపీగా విజయం సాధించిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి… తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఆయన చేవేళ్ల ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు.