అమీర్‌పేట్ స్టేషన్‌లో నిలిచిపోయిన మెట్రో రైలు, భయాందోళనలో ప్రయాణికులు

  • Published By: veegamteam ,Published On : November 19, 2019 / 02:11 PM IST
అమీర్‌పేట్ స్టేషన్‌లో నిలిచిపోయిన మెట్రో రైలు, భయాందోళనలో ప్రయాణికులు

హైదరాబాద్ మెట్రో ట్రైన్‌ మరోసారి నిలిచిపోయింది. అమీర్ పేట్ స్టేషన్ లో పెద్ద శబ్దంతో మెట్రో రైలు ఆగింది. ఏం జరిగిందో తెలియక ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రంగంలోకి దిగిన సిబ్బంది పట్టాల మీదుగా ప్రయాణికులను స్టేషన్ లోకి పంపారు. రైలు ఆగడంతో అమీర్ పేట్-హైటెక్ సిటీ రూట్ లో మెట్రో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అమీర్ పేట్ మెట్రో స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. 

బేగంపేట నుంచి అమీర్‌పేట్ కు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని ప్రయాణికులు చెబుతున్నారు. అరగంట పాటు ట్రైన్ నిలిచిపోయిందన్నారు. దీనిపై మెట్రో అధికారులు స్పందించారు. సాంకేతిక సమస్యతో రైలు నిలిచిందన్నారు. మిగతా సర్వీసులకు కూడా అంతరాయం ఏర్పడిందన్నారు.

బేగంపేట-అమీర్ పేట్ స్టేషన్ల మధ్య విద్యుత్ లైన్ లో సాంకేతిక సమస్యతో మెట్రో సేవలకు అంతరాయం కలిగిందని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వివరించారు. సమస్యను పరిష్కరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతానికి సింగిల్ లైన్ విధానంలో రైళ్లను నడుపుతున్నారని చెప్పారు. ఈ సమస్య వల్ల రైళ్ల రాకపోకలు కొంత ఆలస్యమవుతాయన్నారు. మరమ్మత్తులు చేసిన వెంటనే యథావిథిగా సర్వీసులు నడుపుతామన్నారు. కాగా, సడెన్ గా రైలు ఆగిపోవడంతో ప్రయాణికులు కొంత ఆందోళనకు గురయ్యారు.