తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావు జీవిత విశేషాలు

  • Published By: madhu ,Published On : February 25, 2019 / 05:49 AM IST
తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావు జీవిత విశేషాలు

తెలంగాణ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా తిగుళ్ల పద్మారావు గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఫిబ్రవరి 25వ తేదీ సోమవారం ప్రారంభమైన సమావేశాల్లో డిప్యూటీ స్పీకర్‌గా పద్మారావు ఎన్నికైనట్లు స్పీకర్ ప్రకటించారు. సీఎం కేసీఆర్, ప్రతిపక్షాల నేతలు అభినందనలు తెలిపారు. 

తిగుళ్ల పద్మారావుగౌడ్‌ జీవిత విశేషాల విషయానికి వస్తే….టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుండి ఆయన పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. 2004, 2014, 2018 ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2008 సికింద్రాబాద్‌ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఓటమి చెందారు. అలాగే 2009 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో సనత్ నగర్‌ నుండి కాంగ్రెస్ అభ్యర్థి మర్రి శశిధర్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో మళ్లీ టీఆర్‌ఎస్ పార్టీ తరపున సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2014 నుంచి 2018 వరకు కేసీఆర్‌ ప్రభుత్వంలో 
ఎక్సైజ్, యువజన సర్వీసులు, క్రీడల మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2018 ముందస్తు ఎన్నికల్లో మరలా సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పద్మారావు గెలుపొందారు. ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్‌గా పద్మారావు గౌడ్ ఎన్నికయ్యారు. ఈయనకు స్వరూప రాణితో వివాహం జరిగింది. వీరికి నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.