మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్లకు నేడే ఆఖరు

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఇవాళ్టితో పూర్తికానుంది. సాయంత్రం 5 గంటలతో నామినేషన్ల గడువు ముగియనుంది.

  • Published By: veegamteam ,Published On : January 10, 2020 / 04:02 AM IST
మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్లకు నేడే ఆఖరు

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఇవాళ్టితో పూర్తికానుంది. సాయంత్రం 5 గంటలతో నామినేషన్ల గడువు ముగియనుంది.

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఇవాళ్టితో పూర్తికానుంది. సాయంత్రం 5 గంటలతో నామినేషన్ల గడువు ముగియనుంది. రాష్ట్రవ్యాప్తంగా 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో నామినేషన్ల దాఖలు ప్రక్రియ కొనసాగుతోంది. నిన్నటివరకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కాకపోవడంతో చాలావరకు నామినేషన్లు దాఖలు కాలేదు. రెండు రోజుల్లో మొత్తం 5వేల 689 నామినేషన్లు దాఖలయ్యాయి. తొలి రోజు 967 నామినేషన్లు మాత్రమే దాఖలు కాగా,  రెండోరోజు ఏకంగా 4వేల 772 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో ఇవాళ చివరి రోజున కూడా వేల సంఖ్యలో నామినేషన్లు దాఖలుకానున్నాయి.

టీఆర్‌ఎస్‌ ఇప్పటికే  అభ్యర్థులకు బీ ఫామ్స్‌ అందించింది. దీంతో ఆ పార్టీ అభ్యర్థులందరూ ఇవాళ నామినేషన్లు వేయనున్నారు. అభ్యర్థులపై ఎంపికను ఇంకా కొలిక్కితేని కాంగ్రెస్… ఇవాళ వారిని ఖరారు చేయడంతోపాటు నామినేషన్లు వేయించనుంది. ఇక.. ఇతర పార్టీలు, స్వతంత్రులు కూడా చివరి రోజే నామినేషన్లు వేయనున్నారు. పార్టీల నుంచి టికెట్లు దక్కని వారు సైతం స్వతంత్రులుగా బరిలోకి దిగే అవకాశం ఉంది. దీంతో ఇవాళ వేలాది నామినేషన్లు దాఖలయ్యే చాన్సుంది.

రెబెల్స్‌కు అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు చివరి నిమిషం వరకు టికెట్లను ప్రకటించకుండా సస్పెన్స్‌గా ఉంచాలనే ఉద్దేశంతో ప్రధానపార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. దీని వల్ల అసంతృప్తులు బరిలోకి దిగకుండా ఉండటంతోపాటు పార్టీ మారకుండా ఉండేందుకు చెక్ పెట్టవచ్చని భావిస్తున్నారు. అయితే… పార్టీ బీ-ఫామ్స్‌ అందని వారు సైతం ఇప్పటికే నామినేషన్లు వేశారు. ఇలా ఒకేపార్టీ నుంచి ఐదారుగురు నామినేషన్లు వేస్తుండటంతో ఎవరికి టికెట్ దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు… తమ పార్టీ నుంచి టికెట్ దక్కకుంటే… వెంటనే ప్రత్యర్థి పార్టీల తరపున బీ-ఫామ్స్‌ పొందేందుకు కొందరు నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.