కరోనా తగ్గుతుందా.. ఇమ్యూనిటీ పెరుగుతుందా?

కరోనా తగ్గుతుందా.. ఇమ్యూనిటీ పెరుగుతుందా?

Herd Immunity: కరోనా వైరస్‌ తీవ్రత ఎక్కువ ఉన్న దేశాల్లో భారత్‌ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. కొద్ది రోజులుగా కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గినా అదే పరిస్థితి. ఈ వైరస్‌ తీవ్రత తగ్గడం నిజమేనని శాస్త్రవేత్తలు కూడా కన్ఫామ్ చేస్తున్నారు. వ్యాప్తి తగ్గడానికి అసలైన కారణం స్థానిక హెర్డ్‌ ఇమ్యూనిటీతో పాటు దేశంలో యూత్ ఎక్కువగా ఉండటం దోహదం చేసినట్లు పేర్కొంటున్నారు.

లక్షకు చేరువవుతోన్న రోజువారీ కేసులు:
కరోనా తీవ్రత ఎక్కువగా సమయంలో రోజువారీ కేసుల సంఖ్య లక్షకు చేరువైంది. ఏకంగా సెప్టెంబర్‌ 16న గరిష్ఠంగా 97వేల 894 కేసులు రికార్డు అయ్యాయి. అలాంటిది ప్రస్తుతం రోజువారీ కేసుల సంఖ్య 20వేలకు పడిపోయింది. జనవరి 4న కేవలం 16వేల 504 కేసులు మాత్రమే బయటపడ్డాయి. ఈ లెక్కన బట్టి కరోనా తీవ్రత గణనీయంగా తగ్గినట్లేనని నిపుణులు భావిస్తున్నారు. అశోక యూనిర్సిటీలోని త్రివేదీ స్కూల్‌ ఆఫ్‌ బయో సైన్సెస్‌ డివిజనల్ ఆఫీసర్ షాహిద్‌ జమీల్‌ పేర్కొన్నారు. మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ప్రతి ఒక్కరినీ పరీక్షించడమనేది అసాధ్యమైన విషయాన్ని బయటపెట్టారు. సెప్టెంబర్‌ మధ్య నుంచి కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం మొదలైందని వెల్లడించారు.

హెర్డ్‌ ఇమ్యూనిటీ:
దేశంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న సిటీల్లో ఢిల్లీ ఒకటి. నిత్యం 6 వేలకు పైగా కేసులు, మరణాలతో ఢిల్లీ వణికిపోయింది. అలాంటి ఢిల్లీలో కేవలం 384 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇది ఏడు నెలల్లోనే కనిష్ఠం కావడం విశేషం. ఇంతటి మెరుగైన పరిస్థితి రావడానికి హెర్డ్‌ ఇమ్యూనిటీ వచ్చి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

‘దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో తీవ్రత ఎక్కువగా ఉన్న పరిస్థితిని గమనించాం. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలు, రద్దీ ప్రదేశాల్లో వైరస్‌ విస్తృతి విపరీతంగా ఉంది. అనంతరం గరిష్ఠ స్థాయికి చేరుకుని ఒకరకమైన ‘స్థానిక హెర్డ్‌ ఇమ్యూనిటీ’ వచ్చిఉంటుంది’ అని జాతీయ ఇమ్యూనాలజీ కేంద్రం నిపుణులు డాక్టర్‌ సత్యజీత్‌ రథ్‌ పేర్కొన్నారు.

యువ జనాభా..
భారత్‌లో వైరస్‌ తీవ్రత తగ్గడానికి యూత్ కూడా కారణంగా నిపుణులు భావిస్తున్నారు. దేశ జనాభాలో 65శాతం మంది దాదాపు 35ఏళ్ల వయసువారే. వైరస్‌ వ్యాప్తి తగ్గడానికి ఇది కూడా కారణం అయి ఉండొచ్చని ప్రముఖ ఎకనమిస్ట్, ఎపిడమాలజిస్ట్‌ రామనన్‌ లక్ష్మీనారాయణ్‌ అభిప్రాయపడ్డారు. హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించడానికి కొలమానం లేనప్పటికీ దాదాపు 60శాతం మందిలో రోగనిరోధకత ద్వారా దీన్ని సాధించొచ్చని నిపుణులు భావిస్తున్నారు. దీన్ని నేరుగా వైరస్‌ వ్యాప్తి వల్ల కాకుండా టీకా ద్వారా సాధించాలని నిపుణులు సూచిస్తున్నారు.