China Rocket: చైనా రాకెట్ కూలింది.. పెను ప్రమాదమే తప్పింది

ప్రపంచాన్ని కలవరపెట్టిన చైనా రాకెట్‌ ‘లాంగ్‌ మార్చ్‌ 5బి’ విడిభాగాలు ఎట్టకేలకు హిందూ మహాసముద్రంలో కులాయి. భూమిపై పడతాయేమోనన్న భయానికి తెరపడింది.

China Rocket: చైనా రాకెట్ కూలింది.. పెను ప్రమాదమే తప్పింది

China Rocket

China Rocket: చైనా రాకెట్‌ ఎప్పుడు కూలిపడుతుందో.. ఎక్కడ నష్టం తీసుకొస్తుందో అని భయపడ్డాం. ఇప్పుడు ఆ ఉపద్రవం తప్పింది. కొన్ని రోజులుగా యావత్ ప్రపంచాన్ని కలవరపెట్టిన చైనా రాకెట్‌ ‘లాంగ్‌ మార్చ్‌ 5బి’ విడిభాగాలు ఎట్టకేలకు హిందూ మహాసముద్రంలో కులాయి. భూమిపై పడతాయేమోనన్న భయానికి తెరపడింది.

భూ వాతావరణంలోకి రాగానే చాలా వరకు దాదాపు భస్మమయ్యాయి. కేవలం కొన్ని చిన్న చిన్న భాగాలు మాత్రమే సముద్రంలో పడ్డాయి. ఆదివారం ఉదయం భూవాతావరణంలోకి ప్రవేశించిన శకలాల దశను చైనా మ్యాన్‌డ్‌ స్పేస్‌ ఇంజినీరింగ్‌ ఆఫీస్‌ ఎప్పటికప్పుడు పరిశీలించింది.

హిందూ మహా సముద్రంపై రాకెట్‌ భాగాలు విచ్ఛిన్నమవుతాయని ముందుగానే తెలిపింది. 72.47 డిగ్రీల తూర్పు రేఖాంశం, 2.65 డిగ్రీల ఉత్తర అక్షాంశం కలిసే ప్రాంతంలో శకలాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.

అంతరిక్ష కేంద్ర నిర్మాణ పనుల్లో భాగంగా చైనా గతవారం ‘లాంగ్‌మార్చ్‌ 5బి’ అనే భారీ రాకెట్‌ను ప్రయోగించింది. అంతరిక్ష కేంద్ర కోర్‌ మాడ్యూల్‌ను అది విజయవంతంగా మోసుకెళ్లింది. ఆ రాకెట్‌ నియంత్రణ కోల్పోయిందని, దాని శకలాలు సముద్ర జలాల్లో కాకుండా సాధారణ భూభాగంపై పడిపోయే ముప్పుందని అంతరిక్ష రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు దాని ప్రయాణ మార్గాన్ని అంతరిక్ష సంస్థలు ఎప్పటికప్పుడు గమనిస్తూ వచ్చాయి.

‘లాంగ్‌మార్చ్‌ 5బి’ పరిమాణం (22 టన్నులు) మరీ ఎక్కువగా ఉండటంతో.. దాని అతిపెద్ద విడిభాగాలు భూమిపై అలాగే పడిపోయే ముప్పుందని తొలుత కొందరు నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. శకలాలు భూమిని తాకినప్పుడు.. చిన్నపాటి విమానం కూలిపోయినట్లు ఉంటుందని అంచనా వేశారు.

అంతర్జాతీయ సముద్ర జలాల్లో పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని, జనావాసాలపై కూలే ముప్పు అత్యల్పమని కొంత మంది ఖగోళ నిపుణులు చెప్పినట్లుగానే జరిగింది. గతేడాది చైనా తొలిసారి ‘లాంగ్‌మార్చ్‌ 5బి’ని ప్రయోగించినప్పుడు దాని శకలాలు దక్షిణాఫ్రికాలోని ఐవరీ కోస్ట్‌పై పడి పలు గ్రామాల్లోని ఇళ్లు ధ్వంసం అయ్యాయి.