ఆకాశంలో అద్భుతం..రెండు రోజులూ ఉల్కాపాతాల వర్షం

  • Published By: madhu ,Published On : December 12, 2020 / 09:59 AM IST
ఆకాశంలో అద్భుతం..రెండు రోజులూ ఉల్కాపాతాల వర్షం

meteor showers : ఆకాశం అనంతమైనది..విశ్వం చిత్ర విచిత్రమైనది. దాని గురించి ఆలోచించని వరకు అది మన తలపైన కనిపించే ఆకాశం, మన కాళ్ల కింద ఉన్న నేల మాత్రమే. దాని గురించి తెలుసుకోవటానికి మొదలు పెడితే మాత్రం ఎన్నో వింతలు, విశేషాలు, గమ్మత్తులు, అంతు చిక్కని విషయాలు అడుగడుగునా పలుకరిస్తాయి. గ్రహాలు, ఉప గ్రహాలు, నక్షత్రాలు, పాల పుంతలు, గేలాక్సీలు, ఉల్కలు.. అబ్బో! ఇలా లెక్క పెట్టుకుంటూ పోతే ఊహకు అందని విచిత్రాల చిట్టా తయారవుతుంది. ఇంత పెద్ద విశ్వంలో ఏదో ఒక చోట నిరంతరం ఖగోళ అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి.

అలాంటి ఒక అద్భుతాన్ని కనులారా చూసి తరించే అవకాశం వచ్చే రెండు రోజులు పాటు ప్రపంచానికి దక్కనుంది. 2020, డిసెంబర్ 13వ తేదీ ఆదివారం, డిసెంబర్ 14వ తేదీ సోమవారం ఉల్కాపాతాల వర్షం కురవనుంది. అది ప్రపంచమంతటా కనిపించనుంది. కళ్లు తిప్పుకోనివ్వని ఉల్కాపాతాల వర్షాన్ని చూసేందుకు ప్రపంచం రెడీ అయింది. తోకచుక్కల నుంచి వేరుపడిన ఉల్కలు… గురుత్వాకర్షణ శక్తి కారణంగా కొన్నిసార్లు భూమివైపుగా వస్తాయి. దీంతో మనకు ఉల్కాపాతాలు కనిపిస్తాయి. ప్రతి సంవత్సరం ఇదే సమయంలో మన భూమి ‘3200 ఫేటాన్‌’గా పిలిచే ఓ గ్రహశకాలనికి దగ్గరగా వెళ్తుంది. డిసెంబరు 13, 14 తేదీల్లో ఇది జరుగుతుంది.

జెమినిడ్స్‌గా పిలిచే ఈ ఉల్కాపాతం రేపు, ఎల్లుండి పతాకస్థాయికి చేరుతుంది. ఆ సమయంలో మనకు గంటకు 150 వరకు ఉల్కలు కనిపిస్తాయి. ఈ ఉల్కలు సెకనుకు 35 కిలోమీటర్ల వేగంతో భూమివైపు దూసుకువస్తాయి. అంటే గంటకు ఒక లక్ష 30 వేల కిలోమీటర్లు. ఇవి సాధారణంగా పసుపు రంగులో కనిపిస్తాయి. కొన్నిసార్లు నీలం, ఆకుపచ్చ రంగుల్లోనూ దర్శనమిస్తాయి. ఆకాశం ఎంత చీకటిగా ఉంటే ఇవి అంత అందంగా, అంత ప్రకాశవంతంగా కనిపిస్తాయి. గతేడాది పౌర్ణమి సమయంలో ఈ ఉల్కాపాతం సంభవించింది. కానీ ఈ సారి అమావాస్య సమయంలో ఇది జరగబోతోంది. దీంతో ఉల్కాపాతాలు మరింత స్పష్టంగా కనిపించనున్నాయి. ఉల్కాపాతల వర్షం చూసేందుకు అటు ఖగోళ ప్రేమికులతో పాటు ఇటు సామాన్య ప్రజలు సైతం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.