Sri Lanka Crisis: శ్రీలంకను సర్వనాశనం చేసిన ‘ఆ నలుగురు’..నెత్తికెక్కిన అధికారాన్ని కాలరాసిన లంకేయులు

రాజపక్సె కుటుంబంపై జనాలు భగ్గుమంటున్నారు. నిజానికి కరోనా పరిస్థితులు... రష్యా, యుక్రెయిన్ యుద్ధమే ఆ దేశ సంక్షోభానికి కారణమని కొందరు అభిప్రాయపడుతున్నా.. కుటుంబ పెత్తనమే ఆ చిన్న దేశం కొంప ముంచింది..రాజపక్సె కుటుంబంలోని నలుగురు.. శ్రీలంకను సర్వనాశనం చేశారు.

Sri Lanka Crisis: శ్రీలంకను సర్వనాశనం చేసిన ‘ఆ నలుగురు’..నెత్తికెక్కిన అధికారాన్ని కాలరాసిన లంకేయులు

Sri Lanka Crisis (3)

Sri Lanka Crisis: LTTEపై పోరాటంలో రాజపక్సె కుటుంబాన్ని నెత్తినపెట్టుకున్న శ్రీలంక జనం.. ఇప్పుడు ఆ ఫ్యామిలీ పేరు చెప్తేనే భగ్గుమంటున్నారు. అసలు లంక ప్రస్తుత పరిస్థితికి ఆ కుటుంబం ఎలా కారణంగా మారింది ? జనాలకు ఇంత ఆగ్రహం ఎందుకు.. అధికారం ఉందని విర్రవీగితే.. తీవ్ర పరిణామాలు తప్పవా.. శ్రీలంక నేర్పిస్తున్న మరో పాఠం ఇదేనా ?

జనాలు కన్నెర్ర చేస్తే.. ప్రభుత్వాలు, సైన్యాలు కూడా అడ్డుకోలేవ్‌.. అడ్డుకునే శక్తి లేదు. శ్రీలంక పరిణామాలు చెప్తోంది అదే ! శ్రీలంకలో గొటబాయ ఒక్కరిపైనే కాదు.. మొత్తం ఆ రాజపక్స కుటుంబంపైనే జనాల్లో వ్యతిరేకత వచ్చింది. నాటి రాజుల పాలన నుంచి నేటి రాజకీయ నాయకుల పాలన వరకు… జనాల ఆగ్రహంతో కూలిన అధికారాలు, నివాసభవనాలు ఎన్నో ఉన్నాయ్. ఇరాక్, లెబనాన్, సుడాన్, గాంబియాలాంటి దేశాల్లో… జనాల ఆగ్రహంతో.. పాలకులు అధికారం నుంచి దిగాల్సి వచ్చింది. పాలకులు కావొచ్చు.. పాలనలో అహంకారం కావొచ్చు.. అవినీతి, అసమర్ధత.. కారణం ఏదైనా కొవచ్చు.. అతిగా ప్రవర్తిస్తే.. వ్యతిరేకతలు రకరకాల రూపాల్లో కనిపిస్తాయ్. శ్రీలంకలో అదే జరుగుతోంది. రాజపక్సె కుటుంబంపై జనాలు భగ్గుమంటున్నారు. నిజానికి కరోనా పరిస్థితులు… రష్యా, యుక్రెయిన్ యుద్ధమే ఆ దేశ సంక్షోభానికి కారణమని కొందరు అభిప్రాయపడుతున్నా.. కుటుంబ పెత్తనమే ఆ చిన్న దేశం కొంప ముంచింది..

Also read : Sri Lanka Crisis : సామాన్యులకు ‘పిక్నిక్‌ స్పాట్‌’గా మారిన శ్రీలంక అధ్యక్షుడి ప్యాలెస్..!

రాజపక్సె కుటుంబంలోని నలుగురు.. శ్రీలంకను నలిపేశారు. జనాల జీవితాలను చిదిమేశారు. మహిందా, గొటబయ, చమల్, బసిల్.. ఈ నలుగురి పేర్లు చెప్తేనే ఇప్పుడు సింహళ జాతి మొత్తం భగ్గుమంటోంది. రాజపక్సె కుటుంబంలోని నలుగురిలో ఒకరు దేశ అధ్యక్షుడిగా.. మరొకరు ప్రధానమంత్రిగా, ఇంకో ఇద్దరు మంత్రులుగా… వాళ్ల కొడుకులిద్దరు కూడా మంత్రులుగా.. మరో వ్యక్తి ప్రధాని స్టాఫ్‌కి ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించారు. ప్రభుత్వంలో ముఖ్య శాఖలన్నీ ఆ కుటుంబం గుప్పట్లోనే ఉండేవి. కుటుంబపాలన కారణంగా కుంభకోణాలు బయటికి వచ్చేవి కాదు. సైన్యం కూడా ఈ సోదరుల చెప్పుచేతల్లోనే ఉండేది. దీంతో రాజపక్సె సోదరుల అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. తమ పాలనపై జనాల్లో అసంతృప్తి రేగకుండా ఉండేందుకు ఉచితపథకాలు ప్రవేశపెట్టారు. ఇబ్బడిముబ్బడిగా డబ్బు పంచారు. ఆర్థిక వ్యవస్థపై పట్టుతప్పింది. సాగుపై ముందుచూపు లోపించింది. ఫలితం.. దేశాన్ని సంక్షోభం చుట్టుముట్టింది.

శ్రీలంకలో జనాల జీవితాలు ఎటు చూసినా.. చీకటిగానే మారాయ్‌. రాజపక్సె సోదరులు మాత్రం కోట్లకు పడగలెత్తారు. అధికారం, విందు విలాసాలతో కులాసాలు చేసుకున్నారు. అదే వారిని కాటేసే పరిస్థితికి తీసుకువచ్చాయ్. ఇళ్లు వదిలి పారిపోయేంత వరకు తెచ్చింది. శ్రీలంక రాజకీయాల్లో రాజపక్సె కుటుంబానికి కీలక స్థానం. జనాల మద్దతుతో అధికార పగ్గాలు అందుకున్నారు. అన్నాదమ్ములంతా కీలక పదవుల్లో తిష్ట వేశారు. చైనాతో కుమ్మక్కు అయ్యారు. హంబన్‌టోటాలో శ్రీలంక ప్రభుత్వం భారీ నౌకశ్రాయాన్ని నిర్మించింది. చైనా దానికి ఆర్ధిక హస్తం అందించింది. ఆ తర్వాత చెల్లింపులు సక్రమంగా చేయలేని పరిస్థితిలోకి లంక వచ్చేసింది.. అలా వచ్చిందా.. తీసుకువచ్చారా అన్నది తర్వాత రాబోయే రోజుల్లో తేలే అవకాశం ఉంది.

Also read : Sri Lanka crisis: మరోమార్గం లేదు..! 13న అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమైన గొటబయ..

తెలివి తక్కువ ఆలోచనలు.. అర్థం లేని నిర్ణయాలు.. దీంతో దేశంలోని అన్ని రంగాలు కుదేలయ్యాయ్. దీంతో జనాల్లో అశాంతి కట్టలు తెంచుకుంది జనాగ్రహం సునామీలా ఎగసి పడింది. చివరకు అధ్యక్ష భవనాన్నే చుట్టుముట్టేంత సంక్షోభం వచ్చింది. అధ్యక్షుడు పారిపోయాడు.. ప్రస్తుతం ప్రధానిగా ఉన్న రణిల్ విక్రమ సింఘెకు పాలనాపరమైన అనుభవం ఉంది. ఐతే నేటి పరిస్థితుల్లో ఆ దేశాన్ని నడిపించడం అంత ఈజీ కాదు.. గొటబయ నియమించిన అతను కూడా పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఐనా ఆయన నివాసానికి కూడా జనాలు నిప్పుపెట్టారు. దీంతో లంక రావణకాష్టంలా రగులుతూనే ఉంది. దేశం ఇంతలా రగులుతున్నా. తమ పాలను అర్ధాంతరంగా ముగించం అంటూ.. గొటబయ నుంచి వస్తున్న ప్రకటనలు.. వారి అధికార దాహానికి అద్దం పడుతున్నాయ్.

Also read : Sri Lanka crisis : ప్రపంచానికి సరికొత్త పాఠం నేర్పిన శ్రీలంక..ఈ ప్రభావం మిగతా దేశాలపై పడనుందా ?

జనాల శాంతించి మద్దతు తెలిపితే.. సైన్యం, పోలీసుల సహకారంతో రాజకీయ సంక్షోభానికి ముగింపు పలుకుతామని దేశ అర్మీ చీఫ్ అంటున్నా.. ఇప్పటికిప్పుడు ఆ దిశగా అడుగులు పడే అవకాశం కనిపించడం లేదు. శ్రీలంక సంక్షోభం నుంచి ప్రపంచదేశాలు ఎన్నో పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. జనాలకు, ఓటర్లకు కూడా లంక సంక్షోభం పెద్ద గుణపాఠం. అధికార యావతో దేశభక్తిని పక్కనపెట్టేవారిని.. అవినీతిపరులను.. అందలం ఎక్కకుండా చూడాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. ఇక అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లే చేస్తామన్నా.. నిర్ణయాలు తీసుకుంటామన్నా.. ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో.. ఎంతటి దారుణాలకు దారి తీస్తాయో.. శ్రీలంక పరిణామాలు కళ్లకు కట్టినట్లు చెప్తున్నాయ్.