Sri Lanka crisis : ప్రపంచానికి సరికొత్త పాఠం నేర్పిన శ్రీలంక..ఈ ప్రభావం మిగతా దేశాలపై పడనుందా ?

శ్రీలంక చరిత్రలో తొలిసారిగా దేశాధ్యక్షుడి భవనాన్ని నిరసనకారులు ముట్టడించి అందులోకి ప్రవేశించారు. కానీ ఏ ఒక్కరు గీత దాటలేదు. విధ్వంసం సృష్టించలేదు. విప్లవం అంటే నిరసన మాత్రమే.. విధ్వంసం కాదు అని నిరసనకారులు ప్రూవ్ చేశారు లంకేయులు.

Sri Lanka crisis : ప్రపంచానికి సరికొత్త పాఠం నేర్పిన శ్రీలంక..ఈ ప్రభావం మిగతా దేశాలపై పడనుందా ?

Sri Lanka Crisis (2)

Sri Lanka crisis : జనంతో నిండిపోయిన వీధులు.. నినాదాలతో ప్రతిధ్వనిస్తున్నాయ్. ఎప్పుడూ చూడని సంక్షోభం శ్రీలంకను చుట్టుముట్టింది. ఆకలితో కన్నీళ్లు మింగిన బతికిన జనాల కళ్లు ఇప్పుడు ఎరుపెక్కాయ్. యుద్ధం మొదలుపెడితే ఆ ప్రభావం ఎలా ఉంటుందో.. ప్రపంచానికి తెలిసి వచ్చేలా చేశారు అక్కడి జనం. అధ్యక్షుడు పరారయ్యాడు.. ప్రధాని పీఠం దిగుతానంటున్నారు. మరి ఇప్పుడు శ్రీలంక పరిస్థితి ఏంటి.. ఆ ద్వీపదేశ భవిష్యత్ ఎలా ఉండబోతోంది.. సంక్షోభం నుంచి కోలుకోవాలంటే.. శ్రీలంక ముందు ఉన్న మార్గం ఏంటి..

ఈ దృశ్యాలు చూస్తుంటే.. అఫ్ఘానిస్తాన్‌ పరిణామాలు గుర్తొస్తున్నాయ్ కదా! సీన్ అలానే కనిపించొచ్చు.. కంటెంట్ మాత్రం తేడా ! అది అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్ల అరాచకం అయితే.. ఇది లంకలో జనాలు కడుపు మండి చేసిన పోరాటం. జనాలను ఓటర్లుగా మాత్రమే చూసే పాలకులకు.. పాఠం నేర్పిన పరిణామాలు ఇవి ! జనాలు కన్నెర్ర చేస్తే ఏం జరుగుతుందో చూపించి, గొప్ప పాఠం నేర్పించిన పోరాటం, విప్లవం ఇది !

శ్రీలంక చరిత్రలో తొలిసారిగా దేశాధ్యక్షుడి భవనాన్ని నిరసనకారులు ముట్టి.. అందులోకి ప్రవేశించారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే ఆ భవనంలోని గదులన్నీ నిరసనకారులతో నిండిపోయాయ్. అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన జనాలు.. ఒక్కసారిగా లోపలికి దూసుకుపోయారు. లోపలికి ప్రవేశించిన నిరసనకారులు.. చిన్న వస్తువును కూడా ధ్వంసం చేయలేదు. పైగా అధ్యక్ష భవనాన్ని మరింత శుభ్రం చేసుకున్నారు. కొందరు స్విమ్మింగ్‌ పూల్‌లో ఈతలు కొడితే.. మరికొందరు అక్కడి గదుల్లో సేద తీరారు. అంతేతప్ప.. గీత దాటలేదు. విధ్వంసం సృష్టించలేదు. విప్లవం అంటే నిరసన మాత్రమే.. విధ్వంసం కాదు అని నిరసనకారులు ప్రూవ్ చేశారు.

Also read : Sri Lanka crisis: మరోమార్గం లేదు..! 13న అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమైన గొటబయ..

జనాల ఆందోళనలతో దేశ అధ్యక్షుడు గొటబయ పరారయ్యారు. అధ్యక్ష భవనంలో ఓ సొరంగం బయటపడగా.. దాన్నుంచే ఆయనను తీసుకెళ్లినట్లుగా చర్చ జరుగుతోంది. చాలా దేశాల్లో చాలాసార్లు ప్రభుత్వాలు కూలిపోయాయ్. ఐతే ఇలాంటి పరిణామం మాత్రం ఎప్పుడూ ఏ దేశంలోనూ కనిపించలేదు. అధికారం కట్టబెట్టిన జనాలను మర్చిపోతే.. నియంతలుగా విర్రవీగితే.. జనాల కోపం చూడాల్సి వస్తే.. ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయే.. శ్రీలంక పరిణామాలు కళ్లకు కట్టాయ్.

శ్రీలంకలో జనాలు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కడుపు నింపుకునే దారి లేక, తెలియక.. అర్ధాకలితో బతుకు వెళ్లదీస్తున్న వాళ్లు ఎందరో ! ఈ పరిణామాలకు రాజపక్సె కుటుంబమే కారణం అనడంలో ఎలాంటి అనుమానం లేదు. దేశంలో వ్యవసాయదారులు చితికిపోయారు.. చాలా పరిశ్రమలు మూతపడడంతో.. ఎంతోమంది నిరుద్యోగులుగా మిగిలారు. దేశంలో మూడొంతుల కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయ్. మెడిసిన్స్‌, ఇతర వైద్యసామాగ్రి కొరతతో హాస్పిటల్స్ క్లోజ్ అవుతున్నాయ్. చమురు, నిత్యావసరాల కోసం బారులు తీరుతున్న సామాన్యుల ప్రాణాలు ఆ క్యూలైన్లలోనే ముగిసిపోతున్నాయ్. విద్యాసంస్థల మూసివేతతో.. నెక్ట్స్‌ జనరేషన్‌ భవిష్యత్‌ కూడా అగమ్యగోచరంగా మారింది. బతికలేక కొందరు.. బతుకు ఎలానో తెలియక మరికొందరు.. దేశంలో ఆత్మహత్యలు, నేరాలు పెరిగిపోతున్నాయ్. ఇలాంటి పరిణామాల మధ్య జనం కడుపు మండింది.. ఎదురు తిరిగేలా చేసింది.. జనం ఎదురు తిరిగితే ఏం జరుగుతుందో ప్రపంచం తెలుసుకునేలా చేసింది.

Also read : Sri Lanka Crisis : సామాన్యులకు ‘పిక్నిక్‌ స్పాట్‌’గా మారిన శ్రీలంక అధ్యక్షుడి ప్యాలెస్..!

అసమర్థ, అవివేక విధానాలతో ఆర్థికంగా దివాళా తీసిన శ్రీలంక… భారీ సంక్షోభంలో చిక్కుకుని విలవిల్లాడుతోంది. సమస్యల నుంచి దేశాన్ని బయటపడేయగలరని భావించిన.. రణిల్‌ విక్రమ సింఘె కూడా చివరికి చేతులెత్తేశారు. పదవి నుంచి దిగిపోతానని ప్రకటించారు. ఆకలి మంటలే జ్వాలలుగా ఎగిసిపడ్డాయ్‌. అధ్యక్షుడు పరుగులు పెట్టే స్థాయికి చేరాయ్‌. నిజానికి LTTEని క్లోజ్ చేయడంలో కీలక పాత్ర పోషించిన రాజపక్సె కుటుంబాన్ని.. శ్రీలంక సమాజం నెత్తినపెట్టుకుంది. అలాంటి జనాలే ఇప్పుడు ఆ కుటుంబాన్ని ఛీ అంటున్నారు. బంధుప్రీతి, అవినీతితో సొంత ఆస్తులు పెంచుకుంటూ… దేశాన్ని కనీవినీ ఎరగని సంక్షోభంలోకి నెట్టేసిన ఆ కుటుంబం అధికారంలోంచి తప్పుకోవడమే కాదు… తప్పులకు తగిన శిక్ష అనుభవించాలని జనాలు నినదిస్తున్నారు.

Sri Lanka Crisis: గొటబాయ విదేశాలకు పారిపోయాడా? అధ్యక్ష పదవి ఖాళీగా ఉంటే ఆ దేశ రాజ్యాంగం ఏం చెబుతుంది!

శ్రీలంకలో ప్రస్తుతం ఎక్కడ చూసినా హింసాత్మక పరిస్థితులే కనిపిస్తున్నాయ్. తుపాకీ తూటాల శబ్దంతో.. కొలంబో ప్రతిధ్వనిస్తోంది. జనాల కోపంలో, ఆందోళనల్లో న్యాయం ఉన్నా..
ఈ ఆందోళనలతో పరిస్థితులు ఇంకా దిగజారే ప్రమాదం కనిపిస్తోంది. ప్రస్తుతం ఏర్పడిన గండం నుంచి శ్రీలంక బయటపడాలంటే.. దేశంలో శాంతి స్థాపన జరగాల్సిన అవసరం ఉంది. శ్రీలంక బతుకు ఇప్పుడు మళ్లీ జీరో నుంచి మొదలుపెట్టాల్సిన పరిస్థితి. ఇలాంటి సమయంలో రాజకీయాలు అంటూ పాత దారే వెతుక్కుంటే.. మళ్లీ పరిస్థితులు మొదటికి వచ్చే అవకాశం ఉంది.. రాజకీయాలకు అతీతంగా అఖిలపక్షాలు, జనాలను ఏకతాటిపైకి వచ్చి- దేశ పునర్‌ నిర్మాణానికి అంకితం కావాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.