వైరల్ వీడియో: కారు నడిపిన ఐదేళ్ల బాలుడు.. తల్లిదండ్రులకు బాధ్యత లేదా?

వైరల్ వీడియో: కారు నడిపిన ఐదేళ్ల బాలుడు.. తల్లిదండ్రులకు బాధ్యత లేదా?

కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు విషయంలో బాధ్యత లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. అటువంటి బాధ్యత లేని తల్లిదండ్రుల కారణంగా పిల్లలు, వారికారణంగా మరికొందరు కచ్చితంగా ప్రమాదంలో పడే అవకాశం ఉంటోంది. ఇప్పటికే ఎన్నో సంఘటనలు ఇటువంటివి విన్నాం.. చూస్తున్నాం కూడా.. అటువంటి ఘటనే పాకిస్తాన్‌లోని అతిపెద్ద నగరాల్లో ఒకటైన ముల్తాన్‌ రహదారిలో చోటుచేసుకోగా.. ఈ ఘటనపై నెటిజన్లు ఇప్పుడు మండిపడుతున్నారు.

ఎల్‌కేజీ, యూకేజీ చదివే వయస్సులో ఐదేళ్ల బాలుడు బ్లాక్‌ టయోటా కారును రోడ్లపై నడపగా.. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అయ్యింది పాకిస్తాన్‌లోని అత్యంత రద్దీ రోడ్డుపై కారు నడుపుతున్న వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ బాలుడి తల్లిదండ్రులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ బాలుడు స్టీరింగ్‌ ఎదురుగా నిలబడి బిజీ రోడ్డుపై అతి వేగంగా కారు నడుపుతూ కనిపించగా.. కారులో పెద్దవారు ఎవరూ లేకపోవడంతో ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ వీడియో పోలీసుల కంటపడగా.. బాలుడి తల్లిదండ్రులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పాకిస్తాన్‌ పోలీసు ఉన్నతాధికారులు అదేశాలు జారీ చేశారు. చిన్నారితో పాటు.. ఇతరుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉన్నదని, తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ‘తల్లిదండ్రుల బాధ్యత రాహిత్యానికి ఇది నిదర్శనం’ తల్లిదండ్రులకు బాధ్యత లేదా? అని ప్రశ్నిస్తున్నారు.

Screenshot from video posted on Twitter by Talha.