Pakistan: పాక్ యూనివర్సిటీలో ఆత్మాహుతి దాడి.. నలుగురు మృతి

పాకిస్తాన్‌లోని కరాచీ యూనివర్సిటీలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు చైనీయులు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

Pakistan: పాక్ యూనివర్సిటీలో ఆత్మాహుతి దాడి.. నలుగురు మృతి

Pakistan

Pakistan: పాకిస్తాన్‌లోని కరాచీ యూనివర్సిటీలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు చైనీయులు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ పేలుడులో మరో చైనీయుడు గాయపడ్డట్లు సమాచారం. మంగళవారం ఉదయం కరాచీ యూనివర్సిటీ పరిధిలోని కన్‌ఫ్యూషియస్ ఇన్‌స్టిట్యూట్ దగ్గర ఒక వ్యాన్‌లో పేలుడు జరిగింది. ఈ ఇన్‌స్టిట్యూట్ స్థానికులకు చైనా భాష నేర్పేందుకు ఏర్పాటైంది. కాగా, ఈ పేలుడుకు తామే కారణమని ‘బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ)’ అనే తీవ్రవాద సంస్థ ప్రకటించుకుంది. షరీ బలూచ్ (బ్రమ్ష్) అనే మహిళ ఆత్మాహుతి దాడికి పాల్పడిందని తెలిపింది. ఈ తీవ్రవాద సంస్థ నుంచి ఒక మహిళ ఆత్మాహుతికి పాల్పడటం ఇదే మొదటిసారి.

Pakistan: ఇమ్రాన్ విదేశీ కుట్ర ఆరోపణలు.. పాక్ ఏం చెప్పింది

మహిళ ఆత్మాహుతి దాడితో తమ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైనట్లు బీఎల్ఏ ప్రకటించింది. బీఎల్ఏ బలూచిస్తాన్‌కు స్వయంప్రతిపత్తి కోరుతూ ఏర్పాటైన సంస్థ. తమకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని లేదా తమ వనరుల్లో అధిక వాటానైనా ఇవ్వాలని ఆ సంస్థ డిమాండ్ చేస్తోంది. కాగా, పాకిస్తాన్‌లో చైనీయులను లక్ష్యంగా చేసుకుని ఇటీవల దాడులు పెరిగిపోతున్నాయి. తాజా దాడి కూడా చైనీయులే లక్ష్యంగా జరిగింది. చైనీయులు తమ దేశంలోకి వచ్చి వనరులను కొల్లగొట్టడంతోపాటు, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్ని దక్కించుకుంటున్నారని పాకిస్తానీలు భావిస్తున్నారు. మరోవైపు చైనీయులు కూడా పాకిస్తానీలతో దురుసుగా ప్రవర్తిస్తున్నారు. దీంతో తమ దేశంలో ఉంటున్న చైనీయులపై పాకిస్తానీల్లో అసహనం పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలోనే వాళ్లపై దాడులు పెరిగిపోతున్నాయి. దీనిపై చైనా కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది.