ఢిల్లీ డిప్యూటీ సీఎం ఇంటిపై బీజేపీ గూండాల దాడి వెనుక అమిత్ షా హస్తం…ఆప్

  • Published By: venkaiahnaidu ,Published On : December 10, 2020 / 07:51 PM IST
ఢిల్లీ డిప్యూటీ సీఎం ఇంటిపై బీజేపీ గూండాల దాడి వెనుక అమిత్ షా హస్తం…ఆప్

AAP alleges BJP attacked Manish Sisodia’s house ఆమ్ ఆద్మీ-బీజేపీ మధ్య మాటల తూటాలు పేలాయి. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. గురువారం ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంటిపై బీజేపీ గూండాలు దాడికి పాల్పడ్డారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఢిల్లీ పోలీసుల సహకారంతో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇంటిపై బీజేపీ గూండాలు దాడికి పాల్పడ్డారని ఆప్ ఆరొపించింది.



మనీష్ సిసోడియా ఇంటిపై బీజేపీ గూండాలు దాడికి పాల్పడుతుంటే పోలీసులు వారికి సహకరించారని ఇవాళ ఉదయం మీడియా సమావేశంలో ఆప్ ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ అన్నారు. అంతేకాకుండా పోలీసులు మనీష్ ఇంటి చుట్టూ ఉన్న బారికేడ్లను కూడా తొలగించారని సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. అమిత్​ షా.. తన పార్టీ గూండాలను ఉపయోగించి ఆప్​ నేతలు, వారి కుటుంబాలపై దాడి చేయిస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రిని చంపడానికి అమిత్​ షా తన పోలీసులతో సిద్ధమైనట్లు కనిపిస్తోందని అన్నారు.



కాగా,ఇవాళ ఉదయం ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంటి ముందు బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఆప్ ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేస్తున్న మేయర్ సహా ఇతర కార్పొరేటర్లను చంపేందుకు కుట్ర చేశారన్న ఆరోపణలతో మనీష్ సిసోడియా ఇంటి ముందు కాషాయ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో మనీష్ సిసోడియా ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని ఆప్ ఆరోపించింది



మనీశ్ సిసోడియా ఇంటిపై సిసోడియా ఇంటిపై వ్యవస్థపూర్వకంగా పక్కా ప్రణాళికతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆప్ అధినేత,ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. మనీష్ ఇంట్లో లేని సమయంలో పోలీసుల సమక్షంలో గూండాలు ఇంటిలోకి ప్రవేశించారని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలోని బీజేపీ రోజురోజుకూ ఎందుకు అంత నిరాశ చెందుతుంది అంటూ ట్వీట్​ చేశారు కేజ్రీవాల్​.



అయితే, ఢిల్లీ రాజకీయ చరిత్రలో ఇవాళ జరిగిన ఘటన ఓ “బ్లాక్ డే” అని ఆప్ లీడర్ అతిషి మర్లేనా అన్నారు. మనీష్ సిసోడియా ఇంట్లో లేని సమయంలో ఆయన కుటంబసభ్యులపై దాడి చేసేందుకు కేంద్రహోంమంత్రి అమిత్ షా తన పార్టీ గూండాలను ఉపయోగిస్తున్నట్లు అతిషి ఆరోపించారు.



అయితే, ఆప్ ఆరోపణలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. తాము శాంతియుతంగా నిరసన తెలిపామని ఢిల్లీ బీజేపీ ఉపాధ్యక్షుడు అశోక్​ గోయల్ తెలిపారు.​​ మేయర్​ సహా ఇతర కార్పొరేటర్లను చంపేందుకు అధికార పార్టీనే కుట్ర పన్నిందని, దానిని తప్పుదోవ పట్టించడానికే ఆప్​ ఈ ఆరోపణలు చేస్తుంద అశోక్​ గోయల్​​ ఆరోపించారు

కాగా, ఆప్ ఆరోపణలను ఢిల్లీ పోలీసులు కూడా ఖండించారు. మనీష్ ఇంటిపై దాడి ఘటనకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కేసుకి సంబంధించి ఇప్పటివరకు ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.