Indian Defence : ఆయుధాలు@మేడిన్ ఇండియా..రక్షణ రంగం బలోపేతం దిశగా భారత్ అడుగులు..

భారత రక్షణ రంగం బలోపేతానికి ఇతర దేశాలపై ఆధారపడకుండా ప్రత్యర్ధుల కంటే దీటైన ఆయుధాల రూపకల్పన చేస్తోంది. అగ్రరాజ్యాలకు పోటీగా భారత్‌ తన ఆయుధ శక్తిని పెంచుకుంటోంది. భూమి, ఆకాశం, సముద్రం.. ఎక్కడైనా, ఎప్పుడైనా, దేనికైనా సై అంటోంది.

Indian Defence : ఆయుధాలు@మేడిన్ ఇండియా..రక్షణ రంగం బలోపేతం దిశగా భారత్ అడుగులు..

Indian Defense Sector (1)

Indian Defence : ఎవరో ఏదో ఇస్తారు.. అని ఎదురు చూడకుండా.. మన ఆయుధాన్ని మనమే తయారు చేసుకుందాం.. ఒకరి నుంచి కొనడం కాదు.. మనమే మరొకరి అమ్మే స్థాయికి ఎదుగుదాం.. ఇదీ ఇప్పుడు భారత ప్రభుత్వ నినాదం. రక్షణ రంగం బలోపేతానికి ఇతర దేశాలపై ఆధారపడకుండా ప్రత్యర్ధుల కంటే దీటైన ఆయుధాల రూపకల్పన చేస్తోంది. అగ్రరాజ్యాలకు పోటీగా భారత్‌ తన ఆయుధ శక్తిని పెంచుకుంటోంది. భూమి, ఆకాశం, సముద్రం.. ఎక్కడైనా, ఎప్పుడైనా, దేనికైనా సై అంటోంది. గగన వీధుల్లో గర్జించే యుద్ధ విమానాలు, సముద్రంలో సత్తా చాటే సబ్‌మెరైన్‌లు, సరిహద్దుల్లో సైరన్‌ మోగించే యుద్ధ ట్యాంకులు.. ఇలా అత్యాధునిక, అత్యంత శక్తిమంతమైన మరిన్ని ఆయుధాలు మన అమ్ములపొదిలోకి రాబోతున్నాయి. సరిహద్దుల్లో ఇక ఏ దేశం తోక జాడించినా ఈ అస్త్రాలు వారి గుండెల్ని చీల్చడం ఖాయం.

ఒక చెంపమీద కొడితే రెండు చెంపలు వాయించే కాలమిది. అందుకే మనం మారాల్సిన సమయం వచ్చింది. చుట్టూ శత్రువులు పెరుగుతున్న సమయంలో దేనికైనా రెడీ అనేలా ఉండాలి. ఇప్పుడు భారత్‌ అలానే మారుతోంది. మారుతున్న పరిణామాలకు తగ్గట్లుగా, ఎలాంటి ఉపధ్రవం ఎదురైనా… ధీటుగా ఎదుర్కొనే విధంగా… శత్రువుల వెన్నులో వణుకు పుట్టించేలా ఆయుధ శక్తిని బలోపేతం చేస్తోంది. మనపై దాడులు చేయడం కాదు… అసలు భారత దేశం పేరు వింటేనే శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా కసరత్తు చేస్తోంది.

Also read : Gulf Contries-Bharath : గల్ఫ్‌లో భారత వస్తువులపై నిషేధం విధిస్తే ఏమవుతుంది?

స్వాతంత్ర్యం తర్వాత మన రక్షణ రంగానికి భారీగా నిధులు కేటాయించిన సంఘటనలు తక్కువనే చెప్పాలి. కానీ మోదీ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత డిఫెన్స్‌పై ఫోకస్‌ పెట్టింది. బోర్డర్‌లో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆయుధ శక్తిని బలోపేతం చేసింది. భారీగా ఆయుధాల కొనుగోళ్లతో పాటు సొంతంగా ఆయుధాల తయారీని ప్రోత్సహించింది. త్రివిధ దళాలకు మంచి బూస్టప్‌ ఇచ్చింది. ఇప్పుడు మన త్రివిధ దళాలను మరింత బలోపేతం చేస్తోంది. స్వదేశీ పరిజ్ఞానంతో అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తోంది. చైనా, పాక్‌ ఉమ్మడిగా దాడి చేసినా ఎదుర్కొనేంత కాన్ఫిడెన్స్‌ కలిగిస్తోంది.

రక్షణ రంగంలో తాము తోపు అని విర్రవీగుతున్న చైనాకు.. దీటుగా జవాబిచ్చేందుకు భారత్ రెడీ అయింది. రక్షణారంగంలో ఆత్మనిర్భర్‌ భారత్‌’కు పెద్దపీట వేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం.. భారత రక్షణ వ్యవస్థను మరింత స్ట్రాంగ్‌గా మార్చబోతోంది. ఇప్పటి వరకు రక్షణ రంగం కోసం భారత్.. రష్యా పైనో.. మరో దేశంపైనో ఆధారపడింది. అయితే.. ఇక నుంచి స్వయం సమృద్ధి దిశగా రక్షణరంగం అడుగులు వేయబోతోంది. దేశ రక్షణ రంగంలో ముందడుగు వేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ పరిశ్రమల నుంచి రూ.76వేల 390కోట్ల విలువైన మిలిటరీ పరికరాలను కొనుగోలు చేయాలని కేంద్ర రక్షణశాఖ నిర్ణయించింది. దేశీయ పరిశ్రమల నుంచి మిలటరీ పరికరాల కొనుగోలు ప్రతిపాదనలను, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ నేతృత్వంలోని డిఫెన్స్‌ అక్విజిషన్‌ కౌన్సిల్‌.. డీఏసీ ఆమోదించింది.

Also read : GULF Contries serious on India :బీజేపీ నేతల వ్యాఖ్యలతో ప్రమాదంలో భారత ఆర్ధిక వ్యవస్థ..ఆంక్షల దిశగా 15 ముస్లిం దేశాలు

నౌకాదళాన్ని మరింత పటిష్ఠం చేసేందుకు రూ.36,000 కోట్ల అంచనాతో చిన్నపాటి యుద్ధనౌకలైన నెక్ట్స్‌ జనరేషన్‌ కార్వెట్టీస్‌ను కొనుగోలు చేయనుంది. ఇవి అత్యాధునిక నిర్మాణ సాంకేతికతతోపాటు భారత నౌకాదళ డిజైన్లపై ఆధారపడి ఉంటాయి. ఈ ఎన్‌జీసీలతో సర్వైవల్స్‌ మిషన్స్‌, ఎస్కార్ట్‌ ఆపరేషన్స్‌, డిటెర్రెన్స్‌, సర్ఫేజ్‌ ఏక్షన్‌ గ్రూపు ఆపరేషన్స్‌, సెర్చ్‌, అటాక్‌ లతో పాటు సముద్రతీరగస్తీని సైతం నిర్వహించగల సత్తా మరింత పెరుగుతుంది. ఓడల నిర్మాణానికి కొత్త టెక్నాలజీని ఉపయోగించనుంది. హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ ద్వారా డార్నియర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌, సు-30 ఎంకెఐ ఏరో ఇంజిన్‌లు రూపొందనున్నాయి. ముఖ్యంగా ఏరో ఇంజిన్ మెటీరియల్‌లో స్వదేశీకరణకు ప్రధానం దక్కబోతోంది.

ఇండియన్‌ ఆర్మీ కోసం రఫ్‌ టెర్రియన్‌ ఫోర్క్‌ లిఫ్ట్‌ ట్రక్స్‌, బ్రిడ్జ్‌ లేయింగ్‌ ట్యాంక్స్‌, వీల్డ్‌ ఆర్మౌర్డ్‌ ఫైటింగ్‌ వెహికల్స్‌, యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ క్షిపణుల యుద్ధ వాహనాలు, ఆయుధాలను గుర్తించే రాడార్లు, ఇతర వ్యవస్థలను భారత ఆర్మీ చేతికి రానున్నాయి. వీటిని దేశీయ సంస్థలే రూపకల్పన చేయనున్నాయి. వాటిని రక్షణశాఖే కొనుగోలు చేయనుంది. ఈ కొనుగోళ్లతో దేశీయ రక్షణ తయారీ రంగం మరింత బలోపేతమవుతుంది. రక్షణ రంగంలో డిజిటల్‌ మార్పులపై ప్రభుత్వం దృష్టి పెట్టిన నేపథ్యంలో డిజిటల్‌ కోస్ట్‌ గార్డ్ ప్రాజెక్టును సైతం అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇవి నేవి అంబులపొదిలో చేరితే దేశవ్యాప్తంగా కోస్ట్‌ గార్డ్‌ ఉపరితల, గగనతల ఆపరేషన్లు, రవాణా, ఆర్థిక, మానవ వనరుల విభాగాలన్నింటి మధ్య అత్యున్నత భద్రతతో కూడిన ఒక డిజిటల్‌ నెటవర్క్‌ ఏర్పాటవుతుంది.

Also read : VK. Sasikala : ఏమీ కలిసి రావటంలేదట..అందుకే..పేరు మార్చుకోనున్న శశికళ..

ఇప్పటికే భారత స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన కీలక ఆయుధాలు తమకు తిరుగులేదని నిరూపించుకున్నాయి. బ్రహ్మోస్‌తో పాటు అగ్ని4 క్షిపణి కూడా రావడంతో భారత రక్షణ రంగానికి మరింత బలం చేకూరింది. అగ్ని క్షిపణుల సిరీస్‌లో అగ్ని4 మిసైల్ నాలుగోది. ఒడిశా తీరంలో అగ్ని4 బాలిస్టిక్ మిసైల్‌ను భారత రక్షణ శాఖ విజయవంతంగా ప్రయోగించింది. ఈ క్షిపణి 4000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ఈ మిసైల్ న్యూక్లియర్ బాంబ్‌ను సైతం తీసుకెళ్లగలదు. డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన ఈ మిసైల్‌ను ఇంతకు ముందు అగ్ని 2 ప్రైమ్‌గా పిలిచేవారు. గతేడాది భారత దేశం న్యూక్లియర్ సామర్థ్య గల అగ్ని ప్రైమ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఈ మిసైల్ 1000 నుంచి 2000 కిలోమీటర్ల టార్గెట్‌ను ధ్వంసం చేసే సామర్థ్యం గలది. సరికొత్త సాంకేతికత, సామర్థ్యాలను వినియోగించుకుని భారత్ మరిన్ని వ్యూహాత్మక క్షిపణులను అభివృద్ధి చేస్తూ క్షిపణి వ్యవస్థకు పటిష్ట పునాది వేస్తోంది.