ఫాస్టాగ్ లేదా ? తొందరపడండి..అర్ధరాత్రి నుంచే అమలు, మళ్లీ పొడిగిస్తారా ?

ఫాస్టాగ్ లేదా ? తొందరపడండి..అర్ధరాత్రి నుంచే అమలు, మళ్లీ పొడిగిస్తారా ?

FASTag mandatory from February 15 : ఫాస్టాగ్..ఇప్పుడు దీనిపైనే చర్చ నడుస్తోంది. ఎందుకంటే..ఫిబ్రవరి 15వ తేదీ నుంచి నగదు రహిత చెల్లింపు విధానం అమల్లోకి రానుంది. చివరి తేదీ అంటూ..ప్రకటిస్తున్న కేంద్రం గడువు పొడిగిస్తూ వస్తోంది. తొలుత ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి ఈ విధానాన్ని అమలు చేయాలని అనుకున్నారు. కానీ..ఈ గడువును పొడిగించాలని కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ చివరి నిమిషంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ గడువు 2021, ఫిబ్రవరి 14వ తేదీ ఆదివారం అర్ధరాత్రితో ముగియనుంది.

దీని ప్రకారం..ఫిబ్రవరి 15వ తేదీ సోమవారం నుంచి నగదు రహిత చెల్లింపు విధానం అమల్లోకి రానుంది. ఫాస్టాగ్ ఉన్నవారికే టోల్ గేట్ దాటే అవకాశం ఉంది. లేకపోతే ఇబ్బందులు తప్పవంటున్నారు. ఫాస్టాగ్ ఉంటేనే హైవేల‌పైకి ఎక్కాలి, లేదంటే రెట్టింపు టోల్ బాధుడు భరించాల్సి ఉంటుందంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ నుంచి వెళ్లే జాతీయ రహదారుల్లో ప్రాంతాల్లో 21 టోల్ ప్లాజాలున్నాయి. ఏడాదిన్నరగా ఫాస్టాగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఓ వరుసలో నగదు తీసుకుంటూ..వాహనాలను అనుమతినిస్తున్నారు. ఈ ఒక్క వరుసను కూడా నగదు రహితంగా మార్చేందుకు గడువును నిర్దేశిస్తూ..తిరిగి వాయిదా వేస్తూ వస్తోంది. ప్రస్తుతం ఈ గడువు ముగియబోతోంది. మరలా..పొడిగిస్తారా ? లేదా ? అనేది చూడాలి.

ఫాస్టాగ్‌ను టోల్ ప్లాజాల వద్ద లేదా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు.
వాహన రిజిస్ట్రేష‌న్ ప‌త్రాలను అందుబాటులో ఉండాలి.
ఫాస్టాగ్‌ ఖరీదు వాహనంపై ఆధార‌ప‌డి ఉంటుంది.
ఫాస్టాగ్‌ రీఛార్జ్‌ను ఆన్‌లైన్‌ లేదా టోల్‌ప్లాజాల వద్ద చేయించుకోవచ్చు.
‘ఫాస్టాగ్’ అకౌంట్/వ్యాలెట్ లో కనీస నిల్వ(మినిమమ్ అమౌంట్) ఉండాలన్న నిబంధనను జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఎత్తివేసింది.

ఫాస్టాగ్ ఎలా పని చేస్తుంది?
వాహనం విండ్‌స్క్రీన్‌పై అమర్చిన ఒక బార్ కోడ్ స్టిక్కర్.
  ఇందులో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ ద్వారా టోల్ ఫీజ్ ఆటోమేటిక్ చెల్లించవచ్చు.
  ఈ ఫాస్టాగ్ బ్యాంకు ఖాతా లేదా డిజిటల్ వాలెట్‌తో లింక్ చేయబడుతుంది.
  టోల్ చెల్లించడానికి వాహనం ఆపాల్సిన పని లేదు.

ఫాస్టాగ్ ఎక్కడ పొందొచ్చు?
  ఫాస్టాగ్ లను ఏదైనా బ్యాంకు లేదా ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
  దీనికోసం ఐసిఐసిఐ, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు సేవలు అందిస్తున్నాయి.
  టోల్ ప్లాజా, ఈ-కామర్స్ వెబ్‌సైట్ల ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు.
  అలాగే “మై ఫాస్టాగ్” యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  వీటితో పాటు ప్రముఖ డిజిటల్ చెల్లింపుల ప్లాట్ ఫామ్ లు గూగుల్ పే, అమెజాన్ పే, పేటీఎం వంటి యాప్‌లు కూడా ఫాస్టాగ్ ను అందిస్తున్నాయి.

ఫాస్టాగ్ ను ఎలా రీఛార్జ్ చేసుకోవాలి?
   ఫాస్టాగ్ డిజిటల్ వాలెట్ ను క్రెడిట్, డెబిట్ కార్డులు లేదా యూపీఐ, నెట్ బ్యాంకింగ్ వంటి సదుపాయాలతో రీచార్జ్ చేసుకోవచ్చు.
   పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే వంటి డిజిటల్ ప్లాట్ ఫార్మ్ ల ద్వారా కూడా ఫాస్టాగ్ వాలెట్ ను రీచార్జి చేసుకోవచ్చు.