అదృష్టవంతుడు.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన జాలరి

అదృష్టవంతుడు.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన జాలరి

Fisherman Precious Orange Pearl: అదృష్ట దేవత ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో చెప్పలేము. కానీ, తట్టిందంటే మాత్రం.. రాత్రికి రాత్రే జీవితాలు మారిపోతాయ్. లక్షాధికారో, కరోడ్ పతో అయిపోతారు. థాయ్ లాండ్ కు చెందిన ఓ జాలరి విషయంలో ఇదే జరిగింది. అతడు ఓవర్ నైట్ లో కోటీశ్వరుడయ్యాడు.

అతడి పేరు హచాయ్. జాలరి. వయసు 37 ఏళ్లు. నిత్యం సముద్రంలోకి వెళ్లి చేపలు పట్టేవాడు. అదే అతడి జీవనాధారం. రోజూలాగే చేపల కోసం సముద్రంలోకి వెళ్లి వల వేశాడు హచాయ్. అయితే అతడికి వలకు ఒక్క చేప కూడా చిక్కలేదు. కానీ అందులో మూడు ఆల్చిప్పలు కనిపించాయి. వాటిని తీసుకొని తన సంచిలో వేసుకున్నాడు.

ఇంటికి వచ్చాక హచాయ్ తండ్రి సంచిలో చేపలు ఉన్నాయేమోనని చూశాడు. అందులో చేపలు లేవు. మూడు ఆల్చిప్పలు మాత్రం ఉన్నాయి. వాటిని శుభ్రం చేద్దామని ఆ ముసలాయన బయటకు తీశాడు. వాటిని తెరిచి చూసి ఆశ్చర్యపోయాడు. ఒక దాంట్లో ఆరెంజ్ కలర్ లో ఓ ముత్యం మెరుస్తూ కనిపించింది. ఆ పెద్దాయన వెంటనే తన కొడుకుని, అతడి భార్యని పిలిచాడు. సముద్రం, ముత్యాల గురించి బాగా తెలిసిన ఆ పెద్దాయన, మెరుస్తున్న ముత్యాన్ని చూపించి, దాని బరువు తూకం వేశాడు. అది సరిగ్గా 7.68 గ్రాములు ఉంది.

ఆ పెద్దాయనకు ఆ ముత్యం ఎంత విలువైనదో తెలుసు. అందుకే ఆనందంలో తేలిపోయాడు. తాము కోటీశ్వరులం అయిపోయామని ఇంట్లో వాళ్లకు చెప్పాడు. అయితే పెద్దాయన ఏం చెబుతున్నాడో వాళ్లకు అస్సలు అర్థం కాలేదు.

ఆ తర్వాతి రోజు అంతా కలిసి మార్కెట్‌కి వెళ్లారు. ముత్యం ధర ఎంతో వ్యాపారిని అడిగారు. అది ఆరెంజ్ మెలో ముత్యం (Orange Melo Pearl) అని, మెలో అనే జీవి ద్వారా ఆ ముత్యం తయారవుతుందని విరించాడు. అంతేకాదు సాధారణంగా ఒక ఆరెంజ్ మెలో ముత్యం ధర రూ.2.5 కోట్లు ఉంటుందని చెప్పాడు. హచాయ్ కి దొరికిన ముత్యం సైజు చాలా పెద్దగా ఉంది, అందువల్ల ధర ఇంకా ఎక్కువే ఉంటుందని చెప్పారు. అంతే, ఆ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. ఇది నిజమా? కలా? అని అంతా ఆశ్చర్యపోయారు.

దీనిపై హచాయ్ సంతోషం వ్యక్తం చేశాడు. తాను ఇంకా నమ్మలేకపోతున్నానని అన్నాడు. అంతా కలలా అనిపిస్తోందన్నాడు. ముత్యాన్ని అమ్మేసి వచ్చిన డబ్బుతో తన కుటుంబం అవసరాలు తీరుస్తారని చెప్పాడు. కాగా, డబ్బు చేతికి వచ్చినా… తాను ఎప్పట్లాగే తన జాలరి వృత్తిని కొనసాగిస్తానని తెలిపాడు.