Falling Rupee : రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు RBI తీసుకునే చర్యలేమిటి..?

ఇప్పటికిప్పుడు రూపాయి పతనాన్ని కంట్రోల్ చేయడం కుదిరే పరిస్థితులు కనిపించడం లేదు. సామాన్యుడి బతుకులు నిజంగా భారంగా మారబోతున్నాయా... ఈ పరిస్థితి నుంచి బయటపడే మార్గం ఏంటి.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలాంటి చర్యలు తీసుకుంటోంది ?

Falling Rupee : రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు RBI తీసుకునే చర్యలేమిటి..?

How Does Rbi Defend Falling Rupee (1)

Falling Rupee : ఇప్పటికిప్పుడు రూపాయి పతనాన్ని కంట్రోల్ చేయడం కుదిరే పరిస్థితులు కనిపించడం లేదు. మరి రాబోయే రోజుల్లో ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి మార్పులు కనిపించబోతున్నాయ్. సామాన్యుడి బతుకులు నిజంగా భారంగా మారబోతున్నాయా… ఈ పరిస్థితి నుంచి బయటపడే మార్గం ఏంటి.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలాంటి చర్యలు తీసుకుంటోంది ?

డాలర్‌తో మారకం విలువ భారీగా పడిపోతుండడంతో.. సామాన్యుడిపై రూపాయి పిడుగులా పడే అవకాశాలు కనిపిస్తున్నాయ్. ఇప్పటికే కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్యుడిని… కరెన్సీ మరింత కుంగదీయనుంది. రూపాయి వేగంగా పతనం కావడంతో దేశంలో ధరలు ఎగసి వినియోగదారులపై పెనుభారం పడుతుంది. దిగుమతులకు డాలర్లలో చెల్లించాలి. దీంతో ముడిచమురు, బంగారం, వంటనూనెలు, పప్పు దినుసుల ధరలు అమాంతం పెరగడం ఖాయం. నిజానికి అమెరికాలో కూడా పరిస్థితి బాగోలేకపోయినా.. డాలర్ బలంగానే ఉంది. ఐతే భారత్‌ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. కొన్నాళ్లుగా పెరుగుతున్న దిగుమతులతో విదేశీ మారక నిల్వలు తగ్గుతూ వస్తున్నాయ్. ఇదే ఇప్పుడు తీవ్ర పరిణామాలకు దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయ్.

రూపాయి విలువ పతనంతో.. ఎగుమతిదారులకు అధిక ఆదాయం లభించినప్పటికీ… దిగుమతులు భారంగా మారడంతో పాటు ప్రభుత్వం దగ్గర విదేశీ మారక నిల్వలు వేగంగా తరిగిపోయే ప్రమాదం ఉంటుంది. కరెంట్‌ ఖాతా లోటు నియంత్రణ లక్ష్యం అదుపు తప్పే ప్రమాదం ఉంటుంది. దిగుమతి ఆధారిత వస్తువుల ధరలు పెరిగితే ప్రభుత్వానికి ద్రవ్యోల్బణాన్ని లక్ష్యం మేరకు నియంత్రించడం మరింత సవాల్‌గా మారే చాన్స్ ఉంది. ధరల కట్టడికి భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్లను అధికంగా పెంచాల్సి రావచ్చు. దీంతో రుణాలు మరింత భారం అయ్యే చాన్స్ ఉంది. వ్యవస్థలో నిధుల లభ్యత తగ్గితే… కొనుగోలు శక్తి కూడా తగ్గుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రూపాయి విలువను నిలబెట్టడానికి ఆర్బీఐ చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది.

ఇప్పటికే అధిక ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలతో ప్రస్తుతం దేశంలో సామాన్యుల జీవనం భారంగా మారింది. దీనికి రూపాయి పతనం కూడా జతకావడం ఆందోళన కలిగిస్తోంది.
యుద్ధం కారణంగా వాల్డ్‌వైడ్‌గా కమొడిటీ ధరలు పెరిగాయ్. అదే సమయంలో అమెరికా ఫెడరల్‌ రిజర్వ్ రేట్ల పెంపు కూడా చేపట్టింది. దీంతో భారత్‌లాంటి వర్ధమాన దేశాల నుంచి పెట్టుబడులు భారీ ఎత్తున తరలిపోతున్నాయ్. ఇది కూడా రూపాయి పతనానికి కారణం అయింది. దీంతో రూపాయి క్షీణతకు అడ్డుకట్ట వేసేందుకు ఆర్బీఐ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. విదేశీ మారక నిల్వల నుంచి ఇన్నాళ్లు కేంద్రం గణనీయంగా ఖర్చు చేసింది. ఇంటర్నేషనల్‌ మార్కెట్‌లో డాలర్లను అమ్మడంతో… నిల్వలు 50 బిలియన్‌ డాలర్ల మేర తగ్గిపోయాయ్. ఇలాంటి పరిస్థితుల్లో విదేశీ మూలధనాన్ని ఆకర్షించేందుకూ ఆర్బీఐ చర్యలు తీసుకుంటోంది.

విదేశాల్లో సంపాదించిన మొత్తాన్ని దేశీయ బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసుకునేందుకు వీలుగా… ఫారిన్‌ కరెన్సీ నాన్‌ డిపాజిట్‌ రెసిడెంట్‌ ఖాతాలు తెరిచేందుకు అవకాశం ఉంటుంది. వీటిలో ఆయా దేశాల కరెన్సీని నేరుగా డిపాజిట్‌ చేయొచ్చు. దేశంలో విదేశీ మారక నిల్వలను పెంచే దిశగా… ఈ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచేందుకు ఆర్‌బీఐ అనుమతించింది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌.. ఇప్పటికే వడ్డీరేట్లను సవరించాయ్. ఇక అటు ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌లో రూపాయికి ఆదరణ వచ్చేలా.. ఎగుమతులు, దిగుమతుల లావాదేవీలు రూపాయల్లో జరిగేందుకు వీలుగా అదనపు ఏర్పాట్లు చేయాలని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. ఈ వ్యవస్థను ప్రారంభించేందుకు బ్యాంకులు, ఆర్‌బీఐకి చెందిన విదేశీ మారకపు ఎక్స్ఛేంజీ విభాగం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

రూపాయి పతనాన్ని అడ్డుకోవాలంటే.. దిగుమతి బిల్లు తగ్గించుకోవాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. భారత్‌ ఎక్కువగా చమురు, బంగారం దిగుమతి చేసుకుంటోంది. వీటిలో దేన్నీ తగ్గించుకునే పరిస్థితి లేదు. చమురు ప్రభావం డైరక్టుగా సామాన్యుడి జీవితంపై ఉంటుంది. బంగారం తగ్గించుకుంటే… నిల్వలు తగ్గిపోతాయి. అది కూడా ఆర్థిక ఆరోగ్యానికి మంచిది కాదు. దీంతో వాణిజ్య లోటును ఎదుర్కోవడానికి ప్రత్యేకమైన విధానం తీసుకురావాల్సిన అవసరం ఉంది. విదేశీ నిల్వలు పెరిగేలా.. ఎగుమతులు రూపాయల్లోనే జరిగేలా చర్యలు తీసుకోవాలి. ఈ చర్యలు ఎంత వేగంగా తీసుకుంటారన్న దాని మీద ఆర్థిక వ్యవస్థ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది..