AP Govt : ఏపీలో ఆ రైతులకు రూ. 25,000.. వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటన

AP Govt : ఏపీ ప్రభుత్వం రైతులకు కీలక అప్డేట్ ఇచ్చింది. మొంథా తుపాను కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు పరిహారంను..

AP Govt : ఏపీలో ఆ రైతులకు రూ. 25,000.. వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటన

AP Govt

Updated On : November 9, 2025 / 9:57 AM IST

AP Govt : ఏపీ ప్రభుత్వం రైతులకు కీలక అప్డేట్ ఇచ్చింది. ఇటీవల రాష్ట్రంలో మొంథా తుపాను ప్రభావంతో రైతులు సాగుచేసిన పంటలు దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాల్లో పంటలు పూర్తిగా దెబ్బతినగా.. పలు ప్రాంతాల్లో స్వల్పంగా రైతులు సాగుచేసిన పంటలకు నష్టం వాటిల్లింది. అయితే, మొంథా తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది.

మొంథా తుపాను కారణంగా వాటిల్లిన నష్టాన్ని పంటల వారీగా వివరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. సుమారు రూ.5,245 కోట్ల మేర నష్టం నమోదైనట్లు అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వం సాయం కోసం నివేదిక కూడా పంపింది. అదే సమయంలో పంట నష్టపోయిన రైతులకు ప్రతి హెక్టారుకు రూ.25వేలు చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.

Also Read: Digital Gold : డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడులు పెడుతున్నారా..? హడలెత్తిపోయే షాకింగ్ విషయాలు.. ఇన్వెస్టర్లకు సెబీ వార్నింగ్

తుపాను వల్ల పంటలు కోల్పోయిన రైతులకు నష్టపరిహారాన్ని హెక్టారుకు రూ.17వేల నుంచి రూ.25వేలకు పెంచుతున్నట్లు మంత్రి తెలిపారు. అరటి పంటలకు అదనంగా రూ.10వేలు కలిపి అందించనున్నట్లు వెల్లడించారు. దెబ్బతిన్న కొబ్బరి చెట్లకు రూ.1500 చొప్పున పరిహారం ఇస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టంపై ఈనెల 11 నాటికి 100శాతం అంచనాలు సిద్ధమవుతాయని చెప్పారు. రైతులకు సకాలంలో ఇన్‌ఫుట్ సబ్సిడీ అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.

మొంథా తుపాను కారణంగా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పంట, ఆస్తి నష్టాలు జరిగాయి. ఇప్పటికే నష్టానికి సంబంధించిన నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. నష్టపరిహారం కోసం కేంద్ర ప్రభుత్వానికి విన్నవించింది. ఈ క్రమంలో తుపాను ప్రభావిత జిల్లాల్లో క్షేత్ర స్థాయిలో జరిగిన నష్టాలను అంచనా వేయడానికి కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ పౌసుమి బసు నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం సోమ, మంగళవారాల్లో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు.

సోమవారం టీం వన్ బాపట్ల జిల్లాలో, టీం టూ కృష్ణా, ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. మంగళవారం టీం వన్ ప్రకాశం జిల్లాలో, టీం టూ కోనసీమ జిల్లాలో పర్యటించి నష్టాల్ని స్వయంగా పరిశీలించడంతోపాటు తుపాను బాధితులతో నేరుగా మాట్లాడనున్నారు.