గోల్డ్‌లో పెట్టుబడులు పెడుతున్నారా..? హడలెత్తిపోయే షాకింగ్ విషయాలు.. ఇన్వెస్టర్లకు సెబీ వార్నింగ్
Digital Gold ఇటీవల కాలంలో అనేక ప్రైవేట్ కంపెనీలు మొబైల్ యాప్ లు, వెబ్ సైట్ల ద్వారా డిజిటల్ బంగారాన్ని అమ్మడం ప్రారంభించాయి. డిజిటల్ గోల్డ్ ..
Digital Gold
Digital Gold : బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం 10గ్రాముల 24 క్యారట్ల గోల్డ్ రేటు రూ.1.22 లక్షల వద్ద కొనసాగుతోంది. రాబోయే రోజుల్లో గోల్డ్ రేటు మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో బంగారంపై పెట్టుబడులకోసం చాలా మంది ఇటీవల కాలంలో డిజిటల్ గోల్డ్ వైపు మళ్లుతున్నారు. డిజిటల్ గోల్ద్ లేదా ఈ-గోల్డ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇంటి నుంచే కొనుగోలుకు అవకాశాలు ఉండడంతో ఈ తరహా కొనుగోళ్లకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు.
భౌతిక బంగారంలో పెట్టుబడికి ప్రత్యామ్నాయంగా డిజిటల్ గోల్డ్ ఇటీవల కాలంలో భారీగా ప్రాచుర్యం పొందింది. ఈ క్రమంలో ఎన్నో పథకాలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. వెబ్ సైట్లు, యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. చెల్లింపుల సేవలను అందిస్తున్న సంస్థలూ వీటిని తీసుకొచ్చాయి. తక్కువ మొత్తంతోనూ బంగారంలో ముదుపు చేసేందుకు ఇవి అవకాశం ఇస్తుండటంతో ఎంతో మంది పెట్టుబడులు పెడుతున్నారు. అయితే, ఇలాంటి వారికి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (Securities and Exchange Board of India) హెచ్చరికలు జారీ చేసింది.
Also Read : Baba Vanga : 2026లో బంగారం ధర భారీగా పెరుగుతుందా..? బాబా వంగా జోస్యం.. వెలుగులోకి షాకింగ్ విషయాలు
ఇటీవల కాలంలో అనేక ప్రైవేట్ కంపెనీలు మొబైల్ యాప్ లు, వెబ్ సైట్ల ద్వారా డిజిటల్ బంగారాన్ని అమ్మడం ప్రారంభించాయి. డిజిటల్ గోల్డ్ పేరుతో ఆన్‌లైన్‌లో బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశాన్ని వినియోగదారులకు అందిస్తున్నాయి. దీనికితోడు పోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్ లు కూడా ఈ కంపెనీలతో భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. దీని కారణంగా వినియోగదారులు తమ మొబైల్ నుండి కొన్ని రూపాయలకు బంగారాన్ని కొనుగోలు చేయొచ్చు. క్యారట్‌లేన్ వెబ్‌సైట్ ప్రకారం.. డిజిటల్ గోల్డ్ అనేది మీరు ఆన్‌లైన్‌లో బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు, దానిని ట్రాక్ చేయవచ్చు, మీ కోరిక ప్రకారం ఆభరణాలు లేదా బంగారు నాణేలుగా రీడీమ్ చేసుకోవచ్చు. అయితే, డిజిటల్ గోల్డ్ తో జాగ్రత్త అంటూ సెబీ హెచ్చరికలు జారీ చేసింది.
డిజిటల్ గోల్డ్ పథకాలు అత్యంత నష్టభయంతో కూడుకున్నవి. ఇవేవీ తమ నియంత్రణ పరిధిలోకి రావని, అందువల్ల పెట్టుబడిదారులకు ఎలాంటి రక్షణ ఉండదని సెబీ స్పష్టం చేసింది. డిజిటల్ గోల్డ్ ఉత్పత్తులు సెబీ నియంత్రణ పరిధిలోకి రావు. ప్రస్తుత చట్టాల ప్రకారం.. అవి సెక్యూరిటీలు గానీ, కమోడిటీ డెరివేటివ్‌లు కావు కాబట్టి వాటికి సెబీ నియంత్రణ వర్తించదు. ఒకవేళ ఆ సంస్థ లేదా యాప్‌ను మూసేసినా, దివాలా తీసినా పెట్టుబడిదారుల సొమ్ముకు నష్టం వాటిల్లుతుందని సెబీ హెచ్చరికలు జారీ చేసింది.
బంగారంలో పెట్టుబడికోసం సెబీ ఆమోదించిన కొన్ని సురక్షిత మార్గాలను సూచించింది. మ్యూచువల్ ఫండ్లు అందించే గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లు (గోల్డ్ ఈటీఎఫ్), గోల్డ్ ఫండ్లు, ఈ-గోల్డ్ రశీదులు (ఈజీఆర్), ఎక్స్చేంజ్ ట్రేడెడ్ డెరివేటివ్స్ లాంటి వాటిల్లోనే పెట్టుబడి పెట్టాలని సెబీ పేర్కొంది. వీటిలోనూ సెబీ వద్ద నమోదైన మధ్యవర్తుల ద్వారా మాత్రమే ముదుపు చేయాలని సూచించింది.
డిజిటల్ గోల్డ్ లేదా ఈ-గోల్డ్ పేరుమీద వచ్చిన సంస్థలు, యాప్‌లకు సెబీ రిజిస్ట్రేషన్ ఉందా అనేది ముందుగా తనిఖీ చేసుకోవాలి. గోల్డ్ ఈటీఎఫ్‌లు, ఈజీఆర్‌లను డీమ్యాట్ ఖాతా ద్వారానే కొనుగోలు చేయాలని సెబీ సూచించింది. ఆన్‌లైన్‌లో ఆకర్షణీయమైన ఆఫర్లను చూసి వెంటనే పెట్టుబడులు పెట్టొద్దని, నష్టం గురించి అంచనా వేయాలని సెబీ సూచించింది.
ఒకవేళ ఇప్పటికే ఇలాంటి పథకాల్లో పెట్టుబడి చేస్తే అప్రమత్తత అవసరం అని, పెద్దగా పేరులేని సంస్థల్లో పెట్టుబడులు పెట్టి ఉంటే.. వాటిని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయడం మంచిదని సెబీ సూచించింది. ఈ మొత్తాన్ని సెబీ నియంత్రణ పరిధిలోని మ్యూచువల్ ఫండ్ సంస్థలు అందించే గోల్డ్ ఫండ్లు లేదా గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ ఈటీఎఫ్ ఎఫ్ఓఎఫ్‌లోకి మళ్లించడం శ్రేయస్కరమని సెబీ సూచించింది.
