Desh Ki Neta KCR: దేశ వ్యాప్తంగా కేసీఆర్ ఫ్లెక్సీలు.. జోరుగా గులాబీ బాస్ పుట్టినరోజు సంబరాలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్ డే వేడుకలు.. గల్లీ నుంచి ఢిల్లీ వరకూ జోరుగా జరుగుతున్నాయి.

Desh Ki Neta KCR: దేశ వ్యాప్తంగా కేసీఆర్ ఫ్లెక్సీలు.. జోరుగా గులాబీ బాస్ పుట్టినరోజు సంబరాలు

Kcr Fans

Desh Ki Neta KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్ డే వేడుకలు.. గల్లీ నుంచి ఢిల్లీ వరకూ జోరుగా జరుగుతున్నాయి. బీజేపీ ఇలాకా అయిన గుజరాత్ తో పాటు.. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నియోజకవర్గంలోనూ.. కేసీఆర్ కటౌట్లు, ఫ్లెక్సీలు జోరుగా దర్శనమిస్తున్నాయి. దేశ్ కీ నేతా.. కేసీఆర్ అంటూ ఇంగ్లిష్ లో, హిందీలో జరుగుతున్న ఈ ప్రచారాలు.. అక్కడి ప్రజల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

వారణాసికి చెందిన మృత్యుంజయ మిశ్రా అనే యువకుడు తెలంగాణ ఉద్యమ సమయంలో.. హైదరాబాద్ లో చదువుకుని… తర్వాత వారణాసిలో స్థిరపడ్డాడు. అప్పటినుంచి కేసీఆర్ పై ఉన్న అభిమానాన్ని.. ఇవాళ ఈ ప్రచారంతో నిరూపించుకున్నాడు. ఇటీవల కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఆసక్తి ప్రదర్శించిన సందర్భం కూడా ఇందుకు తోడైంది. ఇది చివరికి.. వారణాసివ్యాప్తంగా కేసీఆర్ ఫ్లెక్సీలు వెలిసి.. జాతీయ స్థాయి చర్చ జరిగేందుకు అవకాశాన్ని కల్పించింది.

ఇక ఢిల్లీ వంతు. దేశ రాజధానిలో ఉన్న తెలంగాణ భవన్ తో పాటు.. కేసీఆర్ నివాసం దగ్గర కూడా.. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో కటౌట్లు, ఫ్లెక్సీలతో సందడి కనిపిస్తోంది. జాతీయ రాజకీయాల్లో కాలు మోపాలన్న కేసీఆర్ దూకుడుకు మరింత ఊతం కల్పించేలా.. ఈ ప్రచారం అందరినీ ఆకర్షిస్తోంది. అనాథాశ్రమంలో కేక్ కట్ చేశారు. పిల్లలకు పుస్తకాలు పంచారు.

ఒడిశాలోనూ కేసీఆర్ పుట్టినరోజు సంబరాలు అంబరాన్ని తాకుతున్నట్టుగా జరుగుతున్నాయి. పూరీలోని సముద్ర తీరం వద్ద సైకత శిల్పి పద్మశ్రీ సుదర్శన్ పట్నాయక్ రూపొందించిన కేసీఆర్ సైకత శిల్పం.. అదుర్స్ అనిపించేలా ఉంది. సిద్దిపేటకు చెందిన వంగా రాజేశ్వర్ రెడ్డి సమన్వయంతో సుదర్శన్ పట్నాయక్.. ఈ సైకత శిల్పం రూపొందించారు.

ఈ క్రమంలో.. కేసీఆర్ ఫ్యాన్స్ క్లబ్ పేరుతో వెలుస్తున్న ఫ్లెక్సీలు, దేశ్ కీ నేతా కేసీఆర్ (Desh Ki Neta KCR) అంటూ వినిపిస్తున్న నినాదాలు.. జాతీయ స్థాయిలో చర్చనీయాంశమవుతున్నాయి. ఢిల్లీలో అయితే.. ఏకంగా 70 నియోజకవర్గాల్లో జరుగుతన్న ఈ సంబరాల హడావుడి.. జాతీయ రాజకీయాలను, అక్కడి పార్టీల నేతలను మాత్రం ఆలోచనలో పడేస్తున్నాయని అంతా భావిస్తున్నారు. ముందు ముందు ఈ హడావుడి ఎక్కడి వరకూ వెళ్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

మరోవైపు.. టీఆర్ఎస్ నేతలు కూడా తమ అధినేత పుట్టిన రోజు సందర్భంగా జాతీయ మీడియాలో చేస్తున్న హడావుడి.. ఆసక్తికరంగా మారింది. నేషనల్ న్యూస్ పేపర్లలో ఫుల్ పేజ్ యాడ్లు, భారీ ప్రకటనలు, విజనరీ లీడర్ అంటూ కేసీఆర్ కు ఫుల్ లెంగ్త్ హైప్ ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే.. ప్రధాని మోదీపై విరుచుకుపడుతున్న కేసీఆర్ కు.. తమిళనాడు సీఎం స్టాలిన్, బంగాల్ సీఎం మమత నుంచి మద్దతు లభించింది. త్వరలోనే మహారాష్ట్ర సీఎంతోనూ కేసీఆర్ లంచ్ మీటింగ్ చేయనున్నారు. ఇలా.. తెలంగాణ గల్లీ నుంచి ఢిల్లీ వరకూ వాయిస్ రైజ్ చేస్తున్న కేసీఆర్ కు.. ఆయన బర్త్ డే కూడా.. కలిసి వచ్చేలా ప్లాన్ చేయడంలో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు సక్సెస్ అవుతున్నారు.