Kerala Rains : కేరళను ముంచెత్తిన వర్షం..14మంది మృతి

కేరళలో కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల ధాటికి మొత్తం 14 మంది దాక చనిపోయారు.

Kerala Rains : కేరళను ముంచెత్తిన వర్షం..14మంది మృతి

Kerala

Kerala Rains Updates : కేరళలో కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల ధాటికి మొత్తం 14 మంది దాక చనిపోయారు. కొట్టాయం, ఇడుక్కిలలో కొండచరియలు విరిగిపడగా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది గల్లంతయ్యారు. రహదారులన్నీ వరదనీటితో నిండిపోయాయి. వాహనాలు నీటిలో చిక్కుకోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. వాతావరణ శాఖ ఐదు జిల్లాల్లో రెడ్ అలర్ట్‌ జారీ చేసింది. మరో ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. రెండు జిల్లాల్లో ఎల్లో అలర్ట్‌ ప్రకటించింది. రహదారులన్నీ పూర్తిగా నీటిమునగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఒకటి వరద నీటిలో చిక్కుకుపోయింది. అయితే, ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. కొండ చరియలు విరిగిపడటం, రహదారులు జలమయం కావడంతో సహాయక చర్యలు కష్టంగా మారాయి. దీంతో కేరళ ప్రభుత్వం ఐఏఎఫ్ సహకారం కోరింది. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌ రంగంలోకి దిగాయి. సదరన్‌ ఎయిర్‌ కమాండ్‌ ఆధ్వర్యంలోని పలు హెలికాఫ్టర్లను అందుబాటులో ఉంచారు. మరోవైపు, వరద ప్రభావిత ప్రాంతాల్లో సైన్యం బలగాలను మోహరించింది. ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌డుతున్నాయి.

కొట్టాయం గ్రామీణ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈ ప్రాంతంలో దాదాపు 12మంది గల్లంతైనట్టు సమాచారం. అటు ఇడుక్కి ప్రాంతంలో కారులో ప్రయాణిస్తోన్న ఓ మహిళ వరద నీటిలో కొట్టుకుపోయి మరణించినట్లు సమాచారం.
మరోవైపు.. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా పరిస్ధితి సీరియస్ గా ఉందని….24 గంటలు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ హెచ్చరించారు. భారీ వర్షాల కారణంగా నిన్న తెరిచిన శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలో దర్శనాలను ఈరోజు రేపు తాత్కాలికంగా నిలిపివేశారు. శబరిమలకొండకు వచ్చే మార్గాల్లో కొండచరియలు విరిగి పడటంతో భక్తులు శబరిమలకు రావద్దని ట్రావెన్ కోర్ దేవస్ధానం బోర్డు భక్తులకు విజ్ఞప్తి చేసింది.