MAA Elections : మా ఎన్నికల్లో ఎందుకింత రగడ ?

ఎలక్షన్స్‌.. ఎలక్షన్స్‌.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇదే హాట్ టాపిక్‌. అయితే.. అవేమో ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు సంబంధించిన ఎన్నికలు కావు.

MAA Elections : మా ఎన్నికల్లో ఎందుకింత రగడ ?

Maa Electrions

MAA Elections : ఎలక్షన్స్‌.. ఎలక్షన్స్‌.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇదే హాట్ టాపిక్‌. అయితే.. అవేమో ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు సంబంధించిన ఎన్నికలు కావు. సరే.. ఓ లక్షా, రెండు లక్షల మందికి సంబంధించినవా? అంటే అవీ కావు. కేవలం వెయ్యిలోపు ఓటర్లు ఉండే ఎన్నికలు. అటువంటి ఎన్నికల్లో.. ఎత్తులకు పై ఎత్తులు, కులాలు, రాజకీయాలు, క్యారక్టర్‌ అసాసిషేషన్‌లు ఇలా ఎన్నో వస్తున్నాయ్‌? అసలు మూవీ ఆర్టీస్ట్ ఎన్నికల్లో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయ్..?

అవును.. ఈసారి మా ఎన్నిక‌లు హోరా హోరీగా జ‌ర‌గ‌బోతున్నాయ్‌. ఒక్క ఓటు కూడా వృథా కాకూడ‌ద‌ని అటు మంచు విష్ణు, ఇటు ప్రకాష్‌రాజ్ గ‌ట్టి ప్రయ‌త్నాలే చేస్తున్నారు. ఊర్లో లేని వాళ్లని కూడా ర‌ప్పించి, వాళ్లతో ఓటింగ్ వేయించాలన్నది ఆలోచ‌న‌. అస‌లు ఇల్లు దాటి బ‌య‌టకు రాని వాళ్ల కోసం బ్యాలెట్ ఓట్ ఎలాగూ ఉంది.

అయితే `మా`లో పోలింగ్ శాతం ఎప్పుడూ 50 శాతం కూడా లేదు. మ‌హా అయితే 400 ఓట్లు పోల‌వుతాయంతే. స్టార్ హీరోలు పోలింగ్ వేసిన దాఖ‌లాలు చాలా త‌క్కువ‌. ఈసారి కూడా.. స్టార్ హీరోలు చాలా వ‌ర‌కూ `మా` ఎన్నిక‌ల‌కు, ఓటింగ్ కి దూరంగానే ఉండాల‌ని భావిస్తున్నట్టు సమాచారం. ఎన్టీఆర్‌, మ‌హేష్‌, ప‌వ‌న్, చ‌ర‌ణ్‌, ప్రభాస్ వీళ్లెవ‌రూ, ఎప్పుడూ త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకోలేదు. ఈసారి కూడా వీళ్లకు `మా` ఓటింగ్‌పై ఇష్టం లేన‌ట్టుగానే తెలుస్తోంది.

`మా`లో జ‌రుగుతున్న రాద్ధాంతం స్టార్ హీరోల‌కు న‌చ్చడం లేదు. అందుకే వాళ్లలో ఎవ‌రూ ఓటింగ్‌కి రావ‌డం లేద‌నేది బహిరంగ రహస్యం. పైగా.. దాదాపుగా స్టార్ హీరోలంతా షూటింగుల‌తో బిజీగా ఉంటున్నారు. కొంత‌మంది ఔట్ డోర్‌లో ఉన్నారు. వాళ్లంతా మా ఎన్నిక‌ల కోసం వ‌స్తార‌నుకోవ‌డం అత్యాశే. అది మాత్రమే కాదు పెద్ద పెద్ద హీరోలు మా రాజ‌కీయాల్ని ఎప్పుడూ పట్టించుకోలేదు.

వాళ్లకంత స‌మ‌యం, ఆస‌క్తి రెండూ లేవు. `మా`లో ఎవ‌రుంటార‌య్యా? యాక్టివ్‌గా ఉండే వాళ్లెంతమంది అయ్యా? అని అడిగితే.. అర‌కొర అవ‌కాశాలున్నవాళ్లు, అవ‌కాశాల్లేక ఖాళీగా ఉన్నవాళ్లు మాత్రమే. ఓటింగ్ వేసేది కూడా సాదా సీదా సినీ న‌టీన‌టులు. అంతే. ఈసారీ అందులో పెద్దగా మార్పు లేక‌పోవొచ్చు.

అలా ఓటింగ్ అంతా తిప్పికొడితే సుమారు 4 వందల నుంచి 4 వందల 50 ఓట్లు పడతాయ్‌. అటువంటి ఆ మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఎన్నికలు రోజు రోజుకు హీట్‌ పెంచేస్తున్నాయి. బరిలో ఉన్న ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు ప్యానెళ్ల మధ్య ఢీ అంటే ఢీ అన్నట్లు పోటీ కొనసాగుతోంది. సాధారణంగా ఎన్నికలన్నాక ఓటేయండని రిక్వెస్ట్ చేస్తారు. బతిమాలుకుంటారు. కొన్ని సందర్భాల్లో తాగుడు, తాయిలాలు కూడా ఉంటాయి.

కానీ మా ఎన్నికల్లో కొత్త సంస్కృతి మొదలైంది. అదే బ్లాక్‌మెయిలింగ్‌ పాలిటిక్స్‌. ఎన్నిలకు ఇంకా మూడు రోజులే ఉండటంతో.. ఇప్పుడు ఎన్నికల పర్వంలో బెదిరింపులు సైతం మొదలయ్యాయి. మంచు విష్ణు ప్యానెల్‌ నుంచి వైస్‌ ప్రెసిడెంట్‌గా పోటీలో ఉన్న నటుడు పృధ్వీరాజ్‌ పలువురిపై బెదిరింపులకు దిగుతున్నారు. ఒక మా సభ్యుడిని ఫోన్‌లోనే బెదిరించారు పృథ్వి. ప్రకాశ్‌రాజ్‌కు ఎందుకు సపోర్టు చేస్తున్నారంటూ.. అవతలి వ్యక్తిపై మండిపడ్డారు పృథ్వీరాజ్‌.

ఈ ఫోన్‌ ఆడియోలు బయటకు రావడంతో.. పృథ్వీరాజ్‌ బెదిరింపు వ్యవహారం వెలుగుచూసింది. దీంతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీ అవాక్కయ్యే పరిస్థితి వచ్చింది. ఎప్పుడూ ఎన్నికలు జరిగాయో? లేదో కూడా తెలియకుండా ఆప్రశాంతంగా జరిగే ఎన్నికలు ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలను మించిపోయాయ్‌. అది మాత్రమే కాదు ఎన్నికల బరిలో నిలిచిన నేతలు ఎలాగైతే విమర్శలు చేసుకుంటారో? మా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న వారు కూడా అదే స్థాయిలో ఆరోపణలు చేస్తూ ఉండడం చర్చనీయాంశంగా మారింది. ప్రతి రోజూ ఎవరో ఒకరు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లోని కొన్ని మైనస్ పాయింట్స్‌ను కూడా బహిరంగంగానే చెప్పేస్తున్నారు. అయితే.. ఈ ఎన్నికలలో ఓటుకు నోటు కూడా కొనసాగుతోంది అంటూ ట్విస్ట్‌ కామెంట్ చేశారు నాగబాబు.

ప్రకాష్ రాజ్ కు మద్దతుగా ఉన్నటువంటి నాగబాబు ఇటీవల నిర్వహించిన మీటింగ్లో ప్రత్యర్థిగా ఉన్న వారిపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడుతూ.. ఆయన లోకల్ నాన్ లోకల్ విభేదాలు చూపించడం ఏ మాత్రం కరెక్ట్ కాదని అన్నారు. ఆయన ఒక భాషకు చెందిన వారు కాదని ఏకంగా ఇండియన్ యాక్టర్ అని వివరణ ఇచ్చారు. ప్రకాష్ రాజ్ ను తెలుగు వాడు కాదని విమర్శించే వాళ్లు సినిమాల కోసం ఆయనను ఎందుకు కావాలని అంటారని ప్రశ్నించారు. నాగబాబు ఒక్కసారిగా మీడియా ముందుకు వచ్చి ఓటుకు నోటు అంటూ కామెంట్స్‌ చేయడంతో మెగా ఫ్యామిలీ డైరెక్ట్‌గా ఎన్నికల ఇష్యూలో రంగంలోకి దిగిందా? అనే టాక్‌ కూడా ఫిల్మ్‌ నగర్‌లో నడుస్తోంది.

అయితే.. బాలకృష్ణ మంచు విష్ణుకు సపోర్టు ఇవ్వడంతో.. ఇప్పుడు ఈ వ్యవహారం మళ్లీ మెగాస్టార్‌కు ప్రత్యర్థిగానే వెళుతున్నట్లు అర్థమవుతోంది. నాగబాబు ఎంట్రీతో మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా ఫ్యామిలీ సభ్యులందరూ కూడా ప్రకాష్ రాజ్‌కు మద్దతు ఇస్తున్నారనే దానిపై క్లారిటీ వచ్చేసింది. ఇలా ఒకరి తర్వాత మరొకరు ఆరోపణలు చేసుకుంటూ ఎన్నికల వాతావరణాన్ని మరింత వేడిగా మార్చేస్తున్నారు. లోకల్ నాన్ లోకల్ అనే పదం నుంచి మొదలైన ఈ ఆరోపణలు ఇప్పుడు వ్యక్తిగత విషయాల పై నిందలు వేసుకునే వరకు వచ్చింది. అయితే.. ప్యానెల్ లో ఉన్న సభ్యులు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉండడం అందరినీ షాక్ కు గురి చేస్తోంది.

మామూలుగా జనానికి మా ఎలక్షన్స్‌అవసరమే లేదు.. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలతో అటెన్షన్ మొత్తం చేంజ్ అయింది. ఏదో సాధారణ ఎన్నికల్లా బెట్టింగ్‌లు, బ్లాక్‌మెయిలింగ్‌కి దిగుతున్నారంటే.. మా ఎన్నికలు ఏ స్థాయికి వెళ్లిపోయాయో అర్థమవుతుంది. తెరవెనుక రాజకీయ పార్టీలు, కులాలు, పరువు తీసుకునే కార్యక్రమాలు కూడా వచ్చేస్తున్నాయట. అసలు ఎందుకు ఇవన్ని వస్తున్నాయ్‌?
Also Read :Mahesh Babu : సూపర్‌స్టార్ స్టైలిష్ స్వెటర్ కాస్ట్ ఎంతంటే!

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌.. ఇప్పుడు టాలీవుడ్‌ దృష్టి అంతా దీనిపైనే ఉంది. ఇప్పుడు చర్చంతా ప్రకాశ్‌రాజ్‌, విష్ణుల చుట్టే జరుగుతోంది. వీరిలో ఎవరు గెలుస్తారు? ఎవరి టీమ్‌కు సభ్యులు మద్దతుగా నిలుస్తారనేది ఆసక్తిగా మారింది. వాస్తవానికి పెద్ద హీరోలు… మెగా ఫ్యామిలీ.. మద్దతుతో ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ గెలుపు తథ్యమని అంతా అంచనాలు వేస్తున్నా.. ఎన్నికల్లో ప్రభావం చూపించే వర్గం తనవైపే ఉందనే ధీమా మంచు విష్ణులో కనిపిస్తోంది. దీనికి సంబంధించిన లెక్కలు వేసుకొనే పనిలో ఇరు వర్గాలు నిమగ్నమైపోయాయి.

ఈసారి ”మా” ఎన్నికలు కులం కంపు కూడా కొడుతోంది. అందుకే రెండు వర్గాలుగా ‘మా’లోని సభ్యులు విడిపోవడానికి కూడా ఇదే ప్రధాన కారణం. ఇండస్ట్రీలో ఓ కులానికి చెందిన వాళ్లు ఓ వైపు.. మరో కులానికి చెందిన వాళ్లు ఇంకోవైపు.. ఉన్నారనే టాక్‌ సినిమా ఇండస్ట్రీలో మోత మోగేలా వినిపిస్తోంది. మరోవైపు.. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ఏపీ, తెలంగాణ ప్రాంతాల ప్రస్తావన కూడా వస్తోంది. తెలంగాణ బిడ్డలనే గెలిపించాలని కోరారు నటుడు సీవీఎల్ నరసింహారావు. విష్ణు ప్యానెల్‌లో ఉన్న బాబు మోహన్, ప్రకాశ్ రాజ్ ప్యానెల్ లో ఉన్న ఉత్తేజ్‌ని గెలిపించాలన్నారాయన.

అలా మొదలైన పోటీతత్వంతో రాజకీయ పార్టీలను కూడా రంగంలోకి దించేస్తున్నారు. ఇండస్ట్రీలో ఉన్న పట్టును చూపించుకోవడానికి మంచు విష్ణు నేరుగా ఏపీ సీఎం జగన్‌, తెలంగాణ మంత్రి కేటీఆర్‌ల పేర్లను ప్రస్తావించారు కూడా. దీంతో ఒక్కసారిగా ఉడికిపోయిన ప్రకాశ్‌ రాజ్‌.. అసలు వాళ్లు ఎందుకు వస్తారంటూ ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు.

తెలుగు ఇండస్ట్రీలో ఉండే రెండు కులాలు ఈ ఎన్నికల ద్వారా.. తమ పట్టుకోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఆ రెండు కులాలకు చెందిన వాళ్లు.. రెండు కులాలుగా విడిపోయినట్టు తెలుస్తోంది. మరోవైపు.. రాజకీయ నాయకులకు ఏమాత్రం తక్కువ కాని విధంగా నటీనటులు.. ప్రత్యర్ధులపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. తనను ఓడించమని హేమ ప్రచారం చేస్తోందని కరాటే కళ్యాణి ఫైర్‌ అయ్యారు. హేమ గెలవడానికి ప్రచారం చేసుకోవచ్చు.. కానీ తనను ఓడించమని అందరికీ చెప్పడమేంటని ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా హేమపై ఆమె వ్యక్తిగత విమర్శలకు దిగారు.

నరేశ్, కరాటే కల్యాణిలపై ‘మా’ ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు ఆమె లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. తనపై నరేశ్ , కల్యాణి అసభ్య వ్యాఖ్యలు చేశారని, అసభ్య వ్యాఖ్యలతో కూడిన వీడియోలను యూ ట్యూబ్ చానల్స్ నుంచి తొలగించేలా చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మొత్తమ్మీద.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు.. ఇది కేవలం ఓ సంస్థకు అధ్యక్షుడ్ని ఎన్నుకొనే ప్రక్రియ కాదు. దీని వెనక చాలా పెద్ద కథే దాగుంది. ఇంకా చెప్పాలంటే అసోసియేషన్ బిల్డింగ్ అనే అంశంతో పాటు.. మేనిఫెస్టోలో చెబుతున్న అంశాలేవీ కారణం కాదు. కేవలం ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరాటమే ఈ ”మా” ఎన్నికలు. సంక్షేమం కోసమే ఈ సమరం అనేది పైపైన పూత మాత్రమే. ఎందుకంటే.. అసోసియేషన్ బంగారు బాతు కాదు. ఇందులో పదవి చేపడితే డబ్బులు సంపాదించుకోవచ్చనే ప్రచారం కేవలం అపోహ మాత్రమే. దీంతో.. రెగ్యులర్ ఎలక్షన్స్ మాదిరిగా ‘మా’ ఎన్నికల మీద కూడా సర్వత్రా ఆసక్తి నెలకొని ఉండడం, ఎవరు గెలుస్తారా అని సినీ జనాలు లెక్కలేసుకోవడం ప్రస్తుతం ప్రేక్షకులకి దక్కుతున్న వినోదం.