సైకోను పట్టించిన చీటీ ముక్క.. 16మంది మహిళల హత్య

సైకోను పట్టించిన చీటీ ముక్క.. 16మంది మహిళల హత్య

arrested

Psycho: ఒంటరిగా కనిపించిన 16మంది మహిళలను అతి దారుణంగా హత్య చేసిన సైకోను పోలీసులు పట్టుకున్నారు. చివరిగా హత్య చేసిన మహిళ కొంగుకు ఉన్న చీటీ ఆధారంగా గాలించి అరెస్టు చేయగలిగారు. సిటీ మొత్తం జల్లెడ పట్టి నేరస్థుడి ఆచూకీ తెలుసుకున్నారు. మాటలతో ఏమార్చి ఏదో ఆశపుట్టించి ఒంటరి ప్రదేశాలకు తీసుకెళ్లడమే అతని టార్గెట్.

జనవరి మొదటి వారంలో సిటీ శివార్లలోని అంకుషాపూర్ దగ్గర్లో సగం కాలిన మహిళ డెడ్ బాడీ కనిపించింది. పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. మొహం మీద పెట్రోల్ పోసి తగులబెట్టేయడంతో ఆమె ఆచూకీ కనిపెట్టడం కుదరలేదు. చివరకు ఒక్క ఆధారం దొరికింది. మహిళ కొంగుకు ఉన్న చీటీనే అతడిని పట్టించింది.

చీటీ విప్పి చూసేసరికి అందులో ఫోన్ నెంబర్ కనిపించింది. దొరికిన ఆధారంతో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. నేరేడ్‌మెట్‌కు చెందిన వ్యక్తిదని తెలుసుకున్నారు. అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. హత్యతో తనకెలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పాడు. కాకపోతే.. ఆమె పేరు వెంకటమ్మ (50) అని, జూబ్లీహిల్స్‌లోని వెంకటగిరిలో నివాసముంటుందని తెలిపాడు.

చంపిందెవరు..?
రాచకొండ పోలీసులు జూబ్లీహిల్స్‌ పోలీసులను సంప్రదించారు. జనవరి 1న వెంకటమ్మ మిస్ అయినట్లు జూబ్లీహిల్స్‌ ఠాణాలో కేసు ఫైల్ అయింది. అదే రోజు మధ్యాహ్నం బేగంపేటలో ఆమె ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అయినట్లు తెలిసింది. వివిధ ప్రాంతాల్లో సీసీ ఫుటేజీలను పరిశీలించి ఒకచోట ఆమె, మరో వ్యక్తితో కలిసి ఆటో ఎక్కినట్లు గుర్తించారు. ఆ ఫోటోను మృతురాలి కుటుంబ సభ్యులకు చూపించారు. అతన్ని ఎప్పుడూ చూడలేదని వారు స్పష్టం చేశారు.
మల్కాజిగిరికి చెందిన వ్యక్తి కూడా అతడెవరో తనకు తెలియదని చెప్పాడు. దీంతో ఈ కేసు మళ్లీ మొదటికొచ్చింది. ఆ వ్యక్తి ఫొటోతో రాచకొండ పోలీసులు నగరమంతా గాలించారు.

చేపల వ్యాపారి
ఓ చేపల వ్యాపారి కేసు సాల్వ్ చేయగలిగాడు. గతంలో బోరబండలో చూసినట్లుగా చెప్పాడు. రాచకొండ పోలీసుల సెర్చింగ్ మొదలైంది. ఎట్టకేలకు.. నిందితుడిని అదుపులోకి తీసుకుని ఎంక్వైరీ చేశారు. నిందితుడు చెప్పిన విషయాలకు పోలీసులే అవాక్ అయ్యారు. వెంకటమ్మ ఒక్కరినే కాకుండా.. కల్లు కాంపౌండ్లు, మద్యం దుకాణాలు, ఇతరత్రా ప్రదేశాల్లో ఒంటరిగా కనిపించిన మహిళలను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.

పోలీసులు క్షేత్రస్థాయిలో వాస్తవాలను కన్ఫామ్ చేసుకుని.. 16 మందిని హత్య చేసినట్లు తేల్చారు. విచారణ పూర్తయితే మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. డబ్బు కోసం చంపాడా లేక మరేదైనా కారణమా అని విచారిస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో కేసు వివరాలను అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.