Flowers Farming : మన్యంలో పూల సాగు

జమ్మూ, శ్రీనగర్, పూణే, బెంగళూరు వంటి ప్రాంతాల నుండి బంతి, చామంతి, చాందిని, ఎల్లోవైట్, అంత్రోనియం, దయాంతస్, కొలాక్స్, కిలండులా, ఫిటోనియా, జినియా, గజానియా వంటి వివిధ రకాల పూల మొక్కలను తీసుకొచ్చి ఇక్కడ సాగుచేస్తున్నారు.

Flowers Farming : మన్యంలో పూల సాగు

Flowers Farming

Flowers Farming : పచ్చదనం ప్రకృతి ప్రేమికులను పరవశింపచేస్తే.. విభిన్న రకాలైన పుష్పాలు మనస్సుని పులకరింపచేస్తాయి. ఆస్వాదించే మనసు ఉంటే.. ప్రకృతిలో ఎన్నో అందాలు కనిపిస్తాయి. ప్రకృతి ప్రేమికులైతే ఆహ్లాదకర వాతావరణంతో అల్లుకు పోతుంటారు.  అయితే ఇది అందరికీ సాధ్యం కాదు. అందుకే టూరిజంకు అనువైన అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఓ సంస్థ ప్రయోగాత్మకంగా పలు రకాలు పూలను సాగుచేస్తూ.. అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది.

READ ALSO : సెంటెడ్‌ క్యాండిల్స్‌తో ప్రయోజనాలెన్నో..

ఇలాంటి వాతావరణం అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతపల్లి మండలం, లంబసింగిలో దర్శనం ఇస్తోంది. క్రీసెంట్ అడ్వంచర్స్ సంస్థ వారు టూరిజాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో.. లబ్బంగి కొత్తవీదిలో స్థానిక రైతుల వద్ద 13 ఎకరాల వ్యవసాయ భూమిని లీజుకు తీసుకొని.. అందులో ప్రయోగాత్మకంగా 15 రకాల పూలసాగుచేపట్టారు. పలు రంగుల్లో ఉన్న ఈ పూలు ఇప్పుడు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

విశాఖ మన్యంలో ఉన్న భిన్నమైన వాతావరణం సంప్రదాయ పంటలతోపాటు సంప్రదాయేతర పంటల సాగుకు అనుకూలంగా ఉంటుంది. అందుకే వాణిజ్య సరళిలో పూల సాగుచేపట్టాలనే ఉద్దేశంతో జమ్మూ, శ్రీనగర్, పూణే, బెంగళూరు వంటి ప్రాంతాల నుండి బంతి, చామంతి, చాందిని, ఎల్లోవైట్, అంత్రోనియం, దయాంతస్, కొలాక్స్, కిలండులా, ఫిటోనియా, జినియా, గజానియా వంటి వివిధ రకాల పూల మొక్కలను తీసుకొచ్చి ఇక్కడ సాగుచేస్తున్నారు. ఇవి ప్రస్తుతం వికసించి అందంగా వివిధ రంగుల్లో పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.

READ ALSO : cultivation of rose flowers : గులాబి పూల సాగు చేపట్టి మంచి లాభాలను ఆర్జిస్తూ..!

కేవలం చలికాలంలో రెండుమూడు నెలలు మాత్రమే దూరప్రాంతాల నుండి పర్యాటకులు లంబసింగికి వస్తుంటారు. వారందరినీ ఏడాది పొడవునా రప్పించేందుకు అగ్రిటూరిజంను అభివృద్ధి చేస్తున్నట్లు ఆ క్రీసెంట్ అడ్వంచర్స్ సంస్థ ఎండి రెహ్మాన్ చెబుతున్నారు. ఇక్కడ పండిన పూలను నర్సీపట్నంతో పాటు వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. రానున్న రోజుల్లో పర్యటకుల కోసం వివిధ రకాల సాహస క్రీడలు ఏర్పాటు చేయబోతున్నారు.