Haryana: చెట్లకు రూ.2500 పెన్షన్.. ఎక్కడో తెలుసా?

Haryana: చెట్లకు రూ.2500 పెన్షన్.. ఎక్కడో తెలుసా?

Haryana

Haryana: ఇప్పటి వరకు వృద్ధులకు పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వాలను చూశాం.. నిరుద్యోగులకు పెన్షన్ ప్రకటించిన ప్రభుత్వాలను చూశాం.. వికలాంగులు, వితంతువులు.. అన్నటికి మించి ఏటికి ఏడాది పెన్షన్ అందించే విధానంలో కూడా వయసును తగ్గిస్తూ ప్రభుత్వాలు ప్రకటనలు చేస్తుంటే.. హరియాణా ప్రభుత్వం మాత్రం చెట్లకు పెన్షన్ ప్రకటించింది.

రాష్ట్రంలో 75 ఏళ్లు, ఆపై వయసున్న వృక్షాలను గుర్తించి వాటికి ‘ప్రాణ వాయు దేవత పింఛను పథకం’ పేరుతో ఏటా రూ.2,500 చొప్పున పింఛన్లు మంజూరు చేయాలనీ హరియాణా ప్రభుత్వం నిర్ణయించింది. జీవిత కాలమంతా మానవాళికి చేస్తున్న సేవలకు ప్రతిగా వృక్షాలకు ‘వారసత్వ హోదా’ కల్పించి పెన్షన్ ఇవ్వనుంది. పింఛను మొత్తాన్ని ప్రతియేటా పెంచుకుంటూ వెళ్తామని కూడా మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది.

ప్రస్తుతం హరియాణాలో 75 ఏళ్లు దాటిన వృక్షాలు 2,500 వరకు ఉండవచ్చని ఆ రాష్ట్ర అటవీశాఖ అంచనా వేస్తుండగా వృక్ష దేవతల గుర్తింపు, పరిరక్షణలకు అనుసరించాల్సిన విధివిధానాలను, నిబంధనలను అటవీశాఖ సిద్ధం చేస్తోంది. ఆక్సిజన్‌ వనాల ఏర్పాటు యోచనలోనూ హరియాణా ప్రభుత్వం ఉంది. 100 ఎకరాల చొప్పున స్థలాలను ఎంపిక చేసి అక్కడ వివిధ రకాల మొక్కలను పెంచి ఆయా వనాలకు సుగంధ వనం, ధ్యాన వనం, ఆరోగ్య వనం వంటి పేర్లను పెట్టాలని నిర్ణయించుకుంది.