Supreme court : దర్యాప్తు సంస్థలు స్వతంత్ర వ్యవస్థలా.? ప్రభుత్వాల చేతుల్లో కీలుబొమ్మలా? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ఈ దేశంలో ఏం జరుగుతోంది? దర్యాప్తు సంస్థలు స్వతంత్ర వ్యవస్థలా.? సర్కారోళ్ల కీలుబొమ్మలా? ఈ రాజ్యంలో.. రాజ్యాంగ సంస్థల పాత్ర ఇంతేనా? స్వతంత్ర సంస్థల పనితీరుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Supreme court : దర్యాప్తు సంస్థలు స్వతంత్ర వ్యవస్థలా.? ప్రభుత్వాల చేతుల్లో కీలుబొమ్మలా? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Supreme Court Warning on the Functioning of India's Self-Investigating Agencies

supreme court : ఇన్‌కమ్ ట్యాక్స్ రైడ్, ఈడీ దాడులు. వీటి వెనుక ఎటువంటి ఉద్దేశాలుంటాయో అర్థం కాదు. సడన్‌గా.. సీబీఐ ఎందుకు ఎంటరవుతుందో అంతుబట్టదు. చివరికి సీఈసీపైనా.. ఊహించనంత పొలిటికల్ ఇంపాక్ట్ కనిపిస్తుంది. అసలు.. ఈ దేశంలో ఏం జరుగుతోంది? దర్యాప్తు సంస్థలు స్వతంత్ర వ్యవస్థలా.? సర్కారోళ్ల కీలుబొమ్మలా? ఈ రాజ్యంలో.. రాజ్యాంగ సంస్థల పాత్ర ఇంతేనా? స్వతంత్ర సంస్థల పనితీరుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వాటిపై రాజకీయ పార్టీల (అధికారంలో ఉన్న పార్టీలు) ప్రభావం ఉంటే వ్యవస్థ ఎలా ఉంటుందో అనే అంశంపై అత్యంత కీలక వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా కేంద్ర ఎన్నికల సంఘం పనితీరు..కొలీజియం లాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై..వచ్చిన పిటీషన్లపై విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.

కానీ.. రాజ్యాంగ సంస్థలే స్వతంత్రంగా పనిచేయలేకపోతున్నాయ్. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ అంటే.. ఈ దేశ ప్రధానమంత్రిపై ఆరోపణలొచ్చినా చర్యలు తీసుకొనేలా ఉండాలని.. అలాంటి పరిస్థితి రావాలంటే.. నియామక ప్రక్రియలో.. కేంద్ర కేబినెట్‌ని మించిన వ్యవస్థ భాగస్వామ్యంగా ఉండాలని.. ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానమే అభిప్రాయపడింది. ఎన్నికల కమిషనర్‌ బలహీనంగా ఉంటే.. వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

భారత సుప్రీంకోర్ట్ నుంచి వచ్చిన ఈ హెచ్చరిక.. ఈ దేశంలో ఉన్న పరిస్థితులు, దర్యాప్తు సంస్థలు, రాజ్యాంగ సంస్థల పనితీరుకు అద్దం పడుతోంది. కొన్నేళ్ల తర్వాత ప్రభుత్వాలు మారుతున్నా.. వాటితో పాటు పాలకులు మారుతున్నా.. ప్రభుత్వ వ్యవస్థల పనితీరు మాత్రం అలాగే ఉంటోంది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. రాజ్యాంగ వ్యవస్థలు, దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా పనిచేయలేకపోతున్నాయ్. ఈ పరిస్థితులే.. అనేక ప్రశ్నలకు దారితీస్తున్నాయ్.

చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్ల నియామకానికి.. కొలీజియం లాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై.. కొన్నాళ్లుగా జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌, జస్టిస్‌ అజయ్‌ రస్తోగీ, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌, జస్టిస్‌ సి.టి.రవికుమార్‌తో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ కొనసాగిస్తోంది. ఈ సమయంలోనే.. కీలక కామెంట్స్ చేసింది. దేశంలో ఉన్న వ్యవస్థల స్వతంత్రత గురించి ధర్మాసనంలోని న్యాయమూర్తులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

రాజకీయ ప్రభావం నుంచి.. సీఈసీని తప్పించాలన్నారు. స్వతంత్రంగా ఉంటూ.. సొంత వ్యక్తిత్వంతో పనిచేయాలని సూచించారు. అందుకే.. నియామక ప్రక్రియలో కేంద్ర కేబినెట్ కంటే మరింత పెద్ద స్వతంత్ర వ్యవస్థ ఉండాలని భావిస్తున్నట్లు.. సుప్రీం ధర్మాసనం తన అభిప్రాయాన్ని తెలియజేసింది. పారదర్శకత కోస మార్గాలను అన్వేషిస్తున్నామని.. వ్యవస్థను మార్చాలని గతంలోనూ చాలా కమిటీలు చెప్పాయని.. రాజకీయ పార్టీలు కూడా గొంతులు చించుకున్నాయని.. ధర్మాసనం తెలిపింది.

సుప్రీం ధర్మాసనం ఈ విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి తాజాగా జరిగిన కేంద్ర ఎన్నికల కమిషనర్ నియామకమే కారణం. సీఈసీగా బాధ్యతలు స్వీకరించిన అరుణ్ గోయల్ నియామకంపై.. సుప్రీం కీలక ప్రశ్నలు సంధించింది. ఆయన నియామకానికి సంబంధించిన ఫైళ్లను.. మెరుపువేగంతో ఆమోదించడంపై సుప్రీం ధర్మాసనం పెదవి విరిచింది. 24 గంటలైనా గడవకముందే.. మొత్తం నియామక ప్రక్రియ ఎలా పూర్తి చేశారని రాజ్యాంగ ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అంత వేగంగా.. అరుణ్ గోయల్‌ని ఎలా నియమించారో తెలపాలని కేంద్రాన్ని కోరింది. అయితే.. ఇప్పటివరకు ఎన్నికల కమిషనర్లుగా ఎంపిక చేసిన వారంతా రిటైర్ అయిన వాళ్లే. కానీ.. అరుణ్ గోయల్ ప్రభుత్వంలో కార్యదర్శిగా ఉన్నారు.

ఆయన.. గత శుక్రవారం (నవంబర్ 18,2022) వీఆర్ఎస్ తీసుకున్న తర్వాతి రోజే.. సీఈసీగా నియమిస్తూ.. ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సోమవారం (నవంబర్21,2022) నుంచే ఆయన విధులు నిర్వహించడం మొదలుపెట్టారు. దీంతో.. ఎలాంటి ప్రక్రియ అనుసరిస్తున్నారో.. ఏ రూల్స్ పాటిస్తున్నారో.. ఎవరికీ అర్థం కావడం లేదు. నిజానికి.. వాలంటరీ రిటైర్మెంట్‌కు 3 నెలల ముందు నోటీసు ఇవ్వాలి కదా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఎన్నికల సంఘం స్వతంత్రంగా, తటస్థంగా ఉండాలన్న సుప్రీం వ్యాఖ్యలతో.. రాజకీయ వర్గాల్లోనూ కొత్త చర్చ మొదలైంది. కొన్ని సమయాల్లో ఎలక్షన్ కమిషన్.. పక్షపాతంగా వ్యవహరిస్తోందన్న అనుమానాలు కలుగుతున్నాయని ప్రతిపక్ష పార్టీల తెలిపాయి. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.

నిజానికి.. ఎన్నికల కమిషన్ అనేది.. ఏ ప్రభుత్వానికి కొమ్ముకాయకుండా.. స్వతంత్రంగా వ్యవహరించాలి. ఎన్నికల కమిషనర్లు కూడా.. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను కల్పించాలి. కానీ.. కొన్నేళ్లుగా దేశంలో జరుగుతున్న పరిణామాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఎన్డీయే అయినా, యూపీఏ అయినా.. అధికారంలో ఉన్న పార్టీకే మేలు చేసేలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వాలు కోరిన విధంగా, అధికార పార్టీకి అనుకూలంగా.. ఎన్నికల షెడ్యూల్స్, నోటిఫికేషన్లు ఇవ్వడం, ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో.. అధికారులను మార్చడం లాంటివి జరుగుతున్నాయనే విమర్శలున్నాయి. ఇక.. ఎన్నికల కమిషనర్లు కూడా పూర్తి స్థాయిలో ఆరేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న దాఖలాలు ఈ మధ్యకాలంలో అయితే కనిపించలేదు. వాళ్లను కూడా ప్రభుత్వాలు తరచుగా మార్చేస్తూ.. తమకు నచ్చిన వారిని ఎంపిక చేసుకుంటూ.. తమ అవసరాలకు తగ్గట్లుగా వాడుకుంటున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయ్.

దేశంలో ఇప్పడున్న పరిస్థితుల్లో.. సీఈసీగా ఉత్తమమైన వ్యక్తి ఉండాలి. నిజానికి.. ఒక ఎన్నికల కమిషనర్ ఎలా ఉండాలో.. టీఎన్ శేషన్ పదవీకాలాన్ని చూస్తే అర్థమవుతుంది. 1990 నుంచి 1996 వరకు పూర్తి స్థాయిలో ఆయన సీఈసీగా పనిచేశారు. తన పదవీకాలంలో ఆయన ఎవరినీ విడిచిపెట్టలేదు. రాజీవ్ గాంధీ హత్య తర్వాత.. అప్పటి ప్రభుత్వాన్ని అడగకుండానే లోక్ సభ ఎన్నికలను వాయిదా వేశారు. నకిలీ ఓటర్లను అరికట్టేందుకు.. ఫోటోతో కూడా ఓటర్ ఐడీ ప్రతిపాదన తెచ్చింది కూడా శేషనే. ఇందుకు ప్రభుత్వం ఆలస్యం చేస్తే.. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని రూల్ 37ను వినియోగిస్తానని కూడా శేషన్ తేల్చిచెప్పారు. 1995 బీహార్ ఎన్నికల్లో.. పోలింగ్ తేదీలను మార్చి దశలవారీగా ఎన్నికలు నిర్వహించాలని.. సంచలన నిర్ణయం తీసుకున్నారు.

గోడల మీద ఇష్టారీతిన రాసే ఎన్నికల ప్రకటనలను నిషేధించింది కూడా శేషనే. ఆయన పర్యవేక్షణలో భద్రతా వ్యవస్థ పటిష్టంగా ఉండడమే కాక.. పరిపాలనా సన్నాహాలు కూడా కచ్చితంగా ఉండేవి. ఇలా.. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా.. స్వేచ్ఛగా పనిచేసేది. టీఎన్ శేషన్ లాంటి వ్యక్తి.. వ్యవస్థకు ఎంతో అవసరమని.. సుప్రీంకోర్టు సైతం వ్యాఖ్యానించిందంటే.. ఆయన పనితీరు, అప్పటి పరిస్థితులు ఎలా ఉండేవో అర్థం చేసుకోవచ్చు. కానీ.. రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన ఓ వ్యవస్థ.. ఇలా ప్రభుత్వం చేతిలో.. అధికారంలో ఉన్న పార్టీ చేతిలో కీలుబొమ్మలా మారి.. పనిచేయడంపై.. విభిన్నమైన వాదనలు, అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ పద్ధతి.. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో సరైనది కాదని చెబుతున్నారు.