కంగారూల గడ్డపై చరిత్ర లిఖించిన రహానె సేన

కంగారూల గడ్డపై చరిత్ర లిఖించిన రహానె సేన

TEAM INDIA:టీమిండియా.. ఆసీస్ ను చిత్తుగా ఓడించింది. ఆస్ట్రేలియా పర్యటనలో చివరిదైన టెస్టుసిరీస్ లో చివరి మ్యాచ్ ను మూడు వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ ను కైవసం చేసుకుంది. ఆతిథ్య జట్టు నిర్థేశించిన 328 పరుగుల లక్ష్యాన్ని అనూహ్య రీతిలో భారత్‌ ఛేదించింది. రిషభ్‌ పంత్‌ పట్టిన పంతానికి.. పుజారా డిఫెన్స్‌ తోడవడంతో ఆసీస్‌ గడ్డపై విజయం టీమిండియా సాధించింది. నాలుగు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ను భారత్‌ 2-1తో కైవసం చేసుకుని గబ్బా మైదానంలో కంగారూలను గడగడలాడించింది.

ఆసీస్‌ గడ్డపై భారత్‌ చరిత్ర లిఖించింది. విరాట్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్‌, శిఖర్ దావన్‌, బుమ్రా, అశ్విన్ లాంటి కీలక ఆటగాళ్లు దూరమైనా పటిష్టమైన ఆసీస్‌ జట్టును దెబ్బ తీసి ఔరా అనిపించింది. 32 ఏళ్లుగా గబ్బా మైదానంలో ఓటమి ఎరుగని కంగారూ జట్టుకు ఓటమి రుచి చూపించింది.

నాలుగు పరుగుల ఓవర్‌ నైట్‌ స్కోర్‌తో చివరి రోజు ఆటను ప్రారంభించిన భారత్‌కు రోహిత్‌ శర్మ ఔట్‌ ద్వారా ఎదురుదెబ్బ తగిలినా నిలదొక్కుకుంది. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన పుజారా, మరో ఓపెనర్‌ శుభమన్‌ గిల్‌తో ఇన్సింగ్స్‌కు బలమైన పునాదులు వేశారు. గిల్‌ 91 పరుగుల వద్ద అవుట్‌ అవగా.. తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. పుజారా సైతం బాధ్యతగా ఆడి 56 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ నెలకొల్పాడు.

కెప్టెన్‌ రహానే 24 పరుగులతో కాసేపటికే పెవిలియన్‌ బాట పట్టగా.. యువ సంచలనం రిషబ్ పంత్‌ క్రీజులో పాతుకుపోయాడు. 134 బంతుల్లో 89 పరుగులు చేసి కీలక విజయాన్ని అందించాడు. చివరిలో వాషింగ్టన్‌ సుందర్‌ 25 మెరుపు ఇన్సింగ్స్‌తో మ్యాచ్‌ను ముగించాడు.