Krishnamma Review : ‘కృష్ణమ్మ’ మూవీ రివ్యూ.. సత్యదేవ్ మరోసారి తన నటనతో అదరగొట్టేసాడుగా..

సత్యదేవ్ తాజాగా కృష్ణమ్మ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.

Krishnamma Review : ‘కృష్ణమ్మ’ మూవీ రివ్యూ.. సత్యదేవ్ మరోసారి తన నటనతో అదరగొట్టేసాడుగా..

Saty Dev Krishnamma Movie Review and Rating

Krishnamma Movie Review : టాలీవుడ్ లో ఎలాంటి పాత్ర అయినా చేయగలిగే నటుల్లో సత్యదేవ్(Satya Dev) ఒకరు. ఇప్పటికే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, హీరోగా పలు సినిమాలతో మెప్పించిన సత్యదేవ్ తాజాగా కృష్ణమ్మ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ కొమ్మలపాటి నిర్మాణంలో వి.వి.గోపాలకృష్ణ దర్శకత్వంలో ఈ కృష్ణమ్మ తెరకెక్కింది. అథిరా రాజ్, అర్చన, మీసాల లక్ష్మణ్, నందగోపాల్, కృష్ణ తేజ, రఘు కుంచె.. పలువురు ముఖ్య పాత్రలతో రివెంజ్ స్టోరీ నేపథ్యంలో రా అండ్ రస్టిక్ గా తెరకెక్కిన కృష్ణమ్మ సినిమా నేడు మే 10న గ్రాండ్ గా రిలీజ్ అయింది.

కథ విషయానికొస్తే.. భద్ర(సత్యదేవ్), కోటి(లక్ష్మణ్ మీసాల), శివ(కృష్ణతేజ) ముగ్గురు అనాధలుగా పెరుగుతారు. చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్. విజయవాడ వించిపేటలో ఉంటారు. వించిపేట మనుషులు ఎవరో కేసులను డబ్బులు తీసుకొని మీదేసుకొని జైలుకు వెళ్లొస్తుంటారు. వించిపేట దాసన్న దగ్గర గంజాయి తీసుకురావడం లాంటి కొన్ని క్రిమినల్ పనులు చేసి భద్ర, కోటి బతుకుతుంటే శివ మాత్రం ఓ ప్రింటింగ్ షాప్ పెట్టుకుంటాడు. వీళ్ళు ముగ్గురు ఎప్పటికైనా ఒక ఫ్యామిలీతో ఉండాలని అనుకుంటారు. అలాంటి వీళ్ళ లైఫ్ లోకి మీనా(అథిరా రాజ్) వస్తుంది. శివ, మీనా ప్రేమలో పడటం, భద్రకి రాఖీ కట్టి అన్నయ్యగా ఫ్యామిలీలోకి తీసుకోవడం.. ఇలా హ్యాపీగా లైఫ్ సాగిపోతున్న టైంలో మీనాకు ఓ కష్టం వస్తుంది. అదే టైంలో భద్ర, శివ, కోటిలను ఓ కేసులో అరెస్ట్ చేస్తారు. అసలు మీనాకు వచ్చిన కష్టం ఏంటి? ఈ ముగ్గురు ఫ్రెండ్స్ ని ఏ కేసులో అరెస్ట్ చేసారు? వీళ్ళు అనుకున్నట్టు ఫ్యామిలీగా బతికారా? అనుకోకుండా కేసులో ఇరుక్కుంటే భద్ర ఏం చేసాడు అనేది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Aarambham Review : ‘ఆరంభం’ మూవీ రివ్యూ.. సైన్స్ ప్రయోగం కథకి ఎమోషన్స్ జోడించి..

సినిమా విశ్లేషణ.. చేయని నేరానికి శిక్ష పడటం ఆ తర్వాత వచ్చి రివెంజ్ తీర్చుకోవడం లాంటి సినిమాలు ఎన్నో ఏళ్లుగా చాలా వస్తూనే ఉన్నాయి. కథ పరంగా కృష్ణమ్మ చాలా పాత కథ. కాకపోతే దానికి ముగ్గురు అనాథలను స్నేహితులుగా తీసుకొని స్నేహం, ఫ్యామిలీ ఎమోషన్స్ ని బాగా పండించారు. ఫస్ట్ హాఫ్ కొంచెం సాగతీతగా ఉంటుంది. ఇంటర్వెల్ కి ఓ ట్విస్ట్ ఉంటుంది అని లీడ్ ఇచ్చి వదిలేస్తారు. ఇంటర్వెల్ బ్యాంగ్ అయినా ఇంకొంచెం బాగా రాసుకుంటే బాగుండేది. సెకండ్ హాఫ్ మాత్రం కథ ఫాస్ట్ ఫాస్ట్ గా సాగుతుంది. సినిమాలో ఫ్రెండ్షిప్, అనాధలు అనే ఎమోషన్ మాత్రం బాగా పండించగలిగారు. చాలా వరకు ట్విస్ట్, క్లైమాక్స్ అన్ని ఊహించేస్తాం. ఇటీవల రా & రస్టిక్ అని చెప్పి గడ్డాలు పెంచుకోవడం, స్లమ్ లో బతకడం, గొడవలు, నరుక్కోవడాలు అని లుక్స్ మీద ఫోకస్ చేసినంతగా కథపై ఫోకస్ చెయ్యట్లేదు. కృష్ణమ్మలో కూడా ఇదే జరిగింది.

నటీనటుల పర్ఫార్మన్స్.. సత్యదేవ్ ఇప్పటికే నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాలో వించిపేట భద్రగా మరోసారి అదరగొట్టేసాడు అని చెప్పొచ్చు. ఇక ఫ్రెండ్స్ గా లక్ష్మణ్ మీసాల, కృష్ణ తేజ బాగానే చేసారు. మలయాళీ అమ్మాయి అయినా అథిరా రాజ్ తెలుగమ్మాయిలా మెప్పించింది. అర్చన అయ్యర్ కాసేపు కనిపించి అలరిస్తుంది. పోలీసాఫీసర్స్ గా నందగోపాల్, రఘు కుంచె, మిగిలిన నటీనటులు అంతా ఓకే అనిపించారు.

సాంకేతిక అంశాలు.. ఈ సినిమా చాలా వరకు విజయవాడ, చుట్టుపక్కల ప్రాంతాల్లోనే షూట్ చేయడంతో ఆ లొకేషన్స్ ని చాలా రియలిస్టిక్ గా చూపించారు. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. కాలభైరవ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ఇచ్చారు. పాటలు మాత్రం పర్వాలేదు అనిపిస్తాయి. ఇక కథ, కథనం అన్ని పాతవే అయినా ఫ్రెండ్షిప్ ఎమోషన్ ని మాత్రం చక్కగా పండించారు . దర్శకుడిగా మాత్రం గోపాల కృష్ణ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. నిర్మాణ పరంగా సినిమా క్వాలిటీ చూస్తుంటే ఖర్చు బాగానే పెట్టారు అని తెలుస్తుంది.

మొత్తంగా ‘కృష్ణమ్మ’ ఫ్రెండ్షిప్, ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన ఓ మాములు రివెంజ్ స్టోరీ. ఈ సినిమాకు రేటింగ్ 2.75 ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే..