Aarambham Review : ‘ఆరంభం’ మూవీ రివ్యూ.. సైన్స్ ప్రయోగం కథకి ఎమోషన్స్ జోడించి..

'ఆరంభం' సినిమా జీవితంలో ఓ తోడు ఉండాలి అనే ఎమోషన్ అంశాన్ని సున్నితంగా చెప్తూనే ఓ సైన్స్ ప్రయోగాన్ని సస్పెన్స్ గా చూపించారు.

Aarambham Review : ‘ఆరంభం’ మూవీ రివ్యూ.. సైన్స్ ప్రయోగం కథకి ఎమోషన్స్ జోడించి..

Mohan Bhagath Suspense Emotional Aarambham Movie Review and Rating

Aarambham Review : మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘ఆరంభం’. ఏవీటీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అభిషేక్ వీటీ నిర్మాణంలో కొత్త దర్శకుడు అజయ్ నాగ్ వి దర్శకత్వంలో ఆరంభం తెరకెక్కింది. ట్రైలర్, సాంగ్స్ తో ఈ సినిమాపై ఆసక్తి కలిగించారు మూవీ టీమ్. నేడు మే 10న ఆరంభం మూవీ థియేటర్స్ లో విడుదలయింది.

కథ విషయానికొస్తే.. కాలాఘటి జైలులో మిగిల్(మోహన్ భగత్) మర్డర్ కేసు మీద రెండున్నరేళ్లుగా ఉంటాడు. రేపు ఉదయం అతన్ని ఉరి తీస్తారు అనగా జైలు నుంచి మాయమవుతాడు. అతని సెల్ కి వేసిన తాళాలు వేసినట్టే ఉంటాయి, గోడలు అలాగే ఉంటాయి అసలు బయటకి రావడానికి ఆస్కారమే లేని జైలు నుంచి ఎలా మాయమయ్యాడు అని పోలీసులు తలలు పట్టుకుంటారు. దీని గురించి కనిపెట్టడానికి ఓ డిటెక్టివ్ ని(రవీంద్ర విజయ్) పిలుస్తారు. మిగిల్ కి చెందిన ఓ బుక్ ఆ జైలు సెల్ లో దొరుకుతుంది. ఆ బుక్ లో.. మిగిల్ చిన్నప్పటినుంచి ఓ సర్(భూషణ్) దగ్గర పెరిగాడని, ఆ సర్ ఏదో డెజావు ఎక్స్‌పరిమెంట్ చేస్తున్నాడని, తన లైఫ్ గురించి ఉంటుంది. మరి ఆ సర్ ఎవరు? ఆయన కథేంటి? ఆ డెజావు ఎక్స్‌పరిమెంట్ ఏంటి? మిగిల్ ఎవర్ని, ఎందుకు మర్డర్ చేసాడు? జైలు నుంచి ఎలా తప్పించుకున్నాడు అనేది తెరపై చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ.. ఆరంభం సినిమా ఓ కన్నడ నవల ఆధారంగా తెరకెక్కింది. సినిమా స్క్రీన్ ప్లే కొత్తగా రాసుకున్నారు. మొత్తం ఒక కథలా కాకుండా కొన్ని అధ్యాయాలుగా సినిమాని తెరకెక్కించారు. కథ విషయంలో కొన్ని సీన్స్ లో మాత్రం కన్ఫ్యూజ్ అవ్వక తప్పదు. సినిమా కొద్దిగా స్లోగానే సాగుతుంది. అమ్మ సెంటిమెంట్ మాత్రం బాగా వార్కౌట్ అవుతుంది. అలాగే డెజావు సైన్స్ ఎక్స్‌పరిమెంట్స్ ఆసక్తిగానే సాగుతాయి. సెకండ్ హాఫ్ లో వచ్చే ఓ ట్విస్ట్ మాత్రం ఆసక్తిగా అనిపిస్తుంది. సీక్వెల్ కి ఛాన్స్ ఉండేలా క్లైమాక్స్ లో ఓ లీడ్ ఇచ్చారు. మరి సీక్వెల్ ఉంటుందా లేదా చూడాలి.

Also Read : Prabhas – Kannappa : మంచు విష్ణు కోసం ప్రభాస్.. ‘కన్నప్ప’ షూట్‌లో అడుగుపెట్టిన రాజా సాబ్..

నటీనటులు పర్ఫార్మెన్స్ .. కేరాఫ్ కంచెర్ల పాలెంలో గడ్డం క్యారెక్టర్ తో మెప్పించిన మోహన్ భగత్ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ ఆరంభం సినిమాలో మెయిన్ లీడ్ తో కనిపించి తన మెథడ్ యాక్టింగ్ తో మెప్పించాడు. సుప్రీతా సత్యనారాయణ ఫిమేల్ లీడ్ లో ఓకే అనిపించింది. తల్లి పాత్రలో సురభి ప్రభావతి అదరగొట్టేసింది అని చెప్పొచ్చు. సైంటిస్ట్ గా భూషణ్ చాలా బాగా నటించారు. లక్ష్మణ్ మీసాల, రవీంద్ర విజయ్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పించారు.

సాంకేతిక అంశాలు.. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా ప్లస్ అయ్యాయి. ఎక్కడో కొండలు, కోణాలు ఉన్న ఓ చిన్న గ్రామంలో షూటింగ్ చేశారు. ఆ పచ్చదనం విజువల్స్ చాలా బాగా చూపించారు. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోతుంది. పాటలు మాత్రం ఒకసారి వినడానికి బాగుంటాయి. సైన్స్ ఎక్స్ పరిమెంట్స్ కి సంబంధించిన ఆర్ట్ వర్క్ మాత్రం బాగా డిజైన్ చేసుకున్నారు. కథ ఆసక్తిగా ఉండి కథనం కూడా సరికొత్తగా ట్రై చేసారు. కథనంలో అక్కడక్కడా కొంచెం బోర్ కొట్టినా చాలా సన్నివేశాల్లో సస్పెన్స్ చూపించారు. దర్శకుడిగా కొత్త దర్శకుడు అజయ్ నాగ్ మాత్రం వంద శాతం సక్సెస్ అయ్యాడు అని చెప్పొచ్చు. నిర్మాణ పరంగా కూడా సినిమాకు తగ్గట్టు క్వాలిటీ కోసం బాగానే ఖర్చుపెట్టినట్టు తెలుస్తుంది.

మొత్తంగా ‘ఆరంభం’ సినిమా జీవితంలో ఓ తోడు ఉండాలి అనే ఎమోషన్ అంశాన్ని సున్నితంగా చెప్తూనే ఓ సైన్స్ ప్రయోగాన్ని సస్పెన్స్ గా చూపించి మెప్పించారు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు. ఇలాంటి కంటెంట్ సినిమాలు ఓ సెక్షన్ ఆడియన్స్ కి నచ్చినా కమర్షియల్ గా ఏ మాత్రం వర్కౌట్ అవుతాయో చూడాలి.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.