ప్రముఖ సినీ నిర్మాత వీఎంసీ దొరస్వామి రాజు కన్నుమూత

ప్రముఖ సినీ నిర్మాత వీఎంసీ దొరస్వామి రాజు కన్నుమూత

tollywood senior producer V. Doraswamy raju passes away : ప్రముఖ తెలుగు సినీ నిర్మాత,డిస్ట్రిబ్యూటర్, మాజీ ఎమ్మెల్యే వి. దొరస్వామిరాజు కన్ను మూశారు. వయో భారంతో ఏర్పడిని అనారోగ్య సమస్యలతో ఆయన ఇబ్బందులు పడుతున్నారు. గత కొద్ది రోజులుగా హైదరాబాద్ బంజారా హిల్స్ కేర్ ఆస్ప్రత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం మరింత క్షీణించటంతో జనవరి 18, సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు.

దొరస్వామిరాజు చిత్ర నిర్మాతగానే కాకుండా రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేశారు. 1994లో చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి, ఆర్.చెంగారెడ్డి వంటి ఉద్దండ నాయకునిపై భారీ మెజారిటీతో గెలుపొందారు.  అలాగే టిటిడి బోర్డు సభ్యునిగా, ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులుగా ఎన్నో పదవులనుఅలంకరించారు. పంపిణీదారుల మండలి అధ్యక్షులు, ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఆయన పని చేశారు.

టాలీవుడ్ లో విజయవంతమైన చిత్రాల నిర్మాతగా, పంపిణీదారుడిగా ఎగ్జిగిబిటర్ గా దొరస్వామి రాజు పేరుపోందారు. ఆయన పలు బ్లాక్ బస్టర్ సినిమాలు మరియు అవార్డు సినిమాలు వాటితో పాటు టెలి సినిమాలు, టెలి సీరియల్స్, తమిళ డబ్బింగ్ మరియు హిందీ డబ్బింగ్ చిత్రాలను నిర్మించారు.


దొరస్వామి రాజు 1978 లో విఎంసీ (విజయ మల్లీశ్వరి కంబైన్స్) పేరుతో డిస్ట్రిబ్యూషన్‌ సంస్థను స్వర్గీయ విశ్వవిఖ్యాత ఎన్టీ రామారావు చేతుల మీదుగా ప్రారంభించారు.  తన బ్యానర్ లో దొరస్వామిరాజు   పలు హిట్‌ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసి సీడెడ్‌లో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌గా పేరు పొందారు. తొలిసా వీఎంసీ లో  తొలిసారిగా ఎన్టీఆర్‌ హీరోగా నటించిన సింహబలుడు సినిమాను పంపిణీ చేశారు.

డ్రైవర్‌ రాముడు, వేటగాడు, యుగంధర్‌, గజదొంగ, ప్రేమాభిషేకం, కొండవీటి సింహం, జస్టిస్‌ చౌదరి సినిమాలను వీఎంసీ సంస్థ ద్వారా విడుదల చేశారు. వీఎంసీ బ్యానర్ లో నిర్మాతగా సీతారామయ్యగారి మనవరాలు, ప్రెసిడెంట్‌గారి పెళ్ల్లాం, కిరాయిదాదా, అన్నమయ్య, సింహాద్రి, వెంగమాంబ, భలే పెళ్లాం వంటి సినిమాలను ఆయన నిర్మించారు.

ఆయన భౌతిక కాయం ప్రస్తుతం కేర్ ఆస్పత్రిలో ఉంది. సినీ ప్రముఖుల సందర్శనార్ధం రేపు ఉదయం 7 గంటలకు ఆస్పత్రినుంచి ఫిలించాంబర్ కు తరలిస్తారు. మద్యాహ్నం 2 గంటల వరకు అక్కడ ఉంచి అంనతరం మహా ప్రస్ధానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.