Amazon Flipkart : అయ్యో అమెజాన్, పాపం ఫ్లిప్‌కార్ట్.. భారీ నష్టాల్లో ఈ-కామర్స్ దిగ్గజాలు.. ఎందుకిలా?

కొన్నేళ్లుగా ఈ సంస్థలు వరుస నష్టాలను చవిచూస్తున్నాయి. అమెజాన్ భారీ నష్టాల్లో ఉందని ఆ మధ్య బయటకు వస్తే, ఫ్లిప్ కార్ట్ పరిస్థితి కూడా అంతే అంటూ ఇప్పుడు లేటెస్ట్ రిపోర్టులు చెబుతున్నాయి.

Amazon Flipkart : అయ్యో అమెజాన్, పాపం ఫ్లిప్‌కార్ట్.. భారీ నష్టాల్లో ఈ-కామర్స్ దిగ్గజాలు.. ఎందుకిలా?

Amazon Flipkart : ఆన్ లైన్ షాపింగ్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది అమెజాన్, ఫ్లిప్ కార్ట్. రకరకాల ఆఫర్లు, పండుగ డిస్కౌంట్ సేల్స్ తో లాభాల బాటలో ఈ సంస్థలు దూసుకుపోతున్నాయని అందరూ అనుకుంటాం. కానీ, వాస్తవ పరిస్థితి మరోలా ఉంది. కొన్నేళ్లుగా ఈ సంస్థలు వరుస నష్టాలను చవిచూస్తున్నాయి. అమెజాన్ భారీ నష్టాల్లో ఉందని ఆ మధ్య బయటకు వస్తే, ఫ్లిప్ కార్ట్ పరిస్థితి కూడా అంతే అంటూ ఇప్పుడు లేటెస్ట్ రిపోర్టులు చెబుతున్నాయి.

ఇండియాలో ఎక్కువ మంది ఆన్ లైన్ లో ఆర్డర్స్ చేసేది ఫ్లిప్ కార్ట్ లనే. సాధారణ రోజుల్లోనే ఫ్లిప్ కార్ట్ లో లక్షల్లో ఆర్డర్లు ఉంటాయి. ఇక పండుగ సమయాల్లో చెప్పనక్కర్లేదు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఫ్లిప్ కార్ట్ ఆదాయం పెరిగినా, దాంతో పాటు నష్టాలూ పెరిగాయి. 2021-22లో ఫ్లిప్ట్ కార్ట్ ఆదాయం రూ.10వేల 659 కోట్లు. అదే సమయంలో నష్టాలు రూ.4వేల 362 కోట్లకు చేరాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.7వేల 804 కోట్లుగా ఉంది. అంటే రాబడి 33శాతం పెరిగితే, నష్టాలు ఏకంగా 51శాతం పెరిగాయి. ఏడాదిలో సంస్థ మొత్తం ఖర్చులు రూ.15వేల కోట్లు దాటిపోయాయి. ఆదాయం పెరుగుదల కంటే నష్టాల పెరుగుదలే ఎక్కువగా ఉంది.

ఫ్లిప్ కార్ట్ అనుబంధ సంస్థ మింత్రా సైతం నష్టాల బాటలోనే ఉందని లెక్కలు చెబుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మింత్రా రాబడి 45శాతం పెరిగి రూ.3వేల 501కోట్లకు చేరింది. అదే సమయంలో నష్టం రూ.598 కోట్లను తాకింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే నష్టం దాదాపు రూ.168 కోట్లు పెరిగింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఫ్లిప్ కార్ట్ పోటీదారు అమెజాన్ పరిస్థితి కూడా అంత ఆశాజనకంగా ఏమీ లేదు. రాబడి 32.5శాతం పెరిగింది. ఇక నష్టం కూడా రూ.3వేల 650 కోట్లుగా రికార్డ్ అయ్యింది. అయితే, అంతకుముందు ఏడాదితో పోలిస్తే అమెజాన్ కు నష్టాలు తగ్గడం కాస్త ఊరటే.

నిర్వహణ ఖర్చులు పెరిగిపోవడమే ఈ కామర్స్ సంస్థలకు నష్టాలు తెచ్చి పెడుతున్నాయని అంటున్నారు ఆర్థిక నిపుణులు. రవాణ, మార్కెటింగ్, లీగల్ ఖర్చులు పెరగడం ఫ్లిప్ కార్ట్ ను దెబ్బతీశాయి. రవాణపై 46శాతం అధికంగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది ఫ్లిప్ కార్ట్. ఇక వ్యాపార ప్రకటనలు, ప్రమోషనల్ ఖర్చులు రెట్టింపయ్యాయి. ఉద్యోగుల ప్రయోజనాల కోసం కూడా కంపెనీ భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇవన్నీ కలిపి ఫ్లిప్ కార్ట్ ను నష్టాల్లోకి నెట్టాయి.
మొదట్లో అమెజాన్ తో పోలిస్తే పోటీలో కాస్త వెనుకబడ్డ ఫ్లిప్ కార్ట్ ఆ తర్వాత పుంజుకుంది. అయినా నష్టాలు మాత్రం తగ్గలేదు. తన బ్రాండ్ విలువను పెంచుకోవడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోంది. ఈ బిగ్ బిలియన్ సేల్స్ లో ఫ్లిప్ కార్ట్ పోర్టల్ కు 100 కోట్ల విజిట్స్ వచ్చాయి. గతేడాదితో పోలిస్తే ఇది 30శాతం అధికం.

ఒక పక్క నష్టాలు వస్తున్నా వాటిని వేరే మార్గాల్లో భర్తీ చేసే ప్రయత్నం చేస్తోంది ఫ్లిప్ కార్ట్. గత రెండేళ్లలోపలు సంస్థలను టేకోవర్ చేసింది. ట్రావెల్ పోర్టల్ క్లియర్ ట్రిప్, ఈ-ఫార్మసీ స్టార్టప్ ఏఎన్ఎస్-ఈ కామర్స్ లను కొనుగోలు చేసింది. నింజాకార్ట్, షాడో ఫాక్స్ స్టార్టప్స్ లో పెట్టుబడి పెట్టింది. అయితే ఒక్క అమెజాన్ నుంచే కాకుండా రిలయన్స్ జియో మార్ట్, టాటాగ్రూప్, మీషో వంటి సంస్థల నుంచి ఈ మధ్య కాలంలో ఫ్లిప్ కార్ట్ కు పోటీ పెరిగింది. ఇది ఒక విధంగా ఫ్లిప్ కార్ట్ కు ఇబ్బంది కలిగిస్తోంది.