పంచకుల మంచి పని : ప్లాస్టిక్ ఇస్తే పాల ప్యాకెట్లు ఫ్రీ

  • Published By: veegamteam ,Published On : December 26, 2019 / 05:50 AM IST
పంచకుల మంచి పని : ప్లాస్టిక్ ఇస్తే పాల ప్యాకెట్లు ఫ్రీ

10 ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లు ఇస్తే ఓ పాల ప్యాకెట్ ను ఫ్రీగా ఇస్తున్నారు. అయ్యో..వాటర్ బాటిళ్ల కొనీ నీళ్లు తాగి..కూల్ డ్రింక్స్ కొని తాగి పడేస్తున్నాం..అదెక్కడో తెలిస్తే చక్కగా తాగేసిన బాటిల్స్ పట్టికెళ్లి ప్రతీ రోజు అవసరమైన పాల ప్యాకెట్స్ తెచ్చుకోవచ్చు అనుకుంటున్నారు కదూ. అది ఎక్కడంటే హర్యానాలో. 
 
హర్యానాలోని పంచకుల పట్టణంలో పంచకుల మునిసిపల్ కార్పొరేషన్‌ ప్లాస్టిక్‌ను నియంత్రించేందుకు ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. ప్లాస్టిక్ బాటిల్స్ తెస్తే..పాల ప్యాకెట్ ఫ్రీ అనే ఆఫర్ పెట్టింది. ప్లాస్టిక్ వ్యర్థాలకు బదులుగా పాల ప్యాకెట్లను అందించే స్టోర్ లను ‘ వేస్ట్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రాం’ పేరుతో  ఏర్పాటు చేసింది. భారత ప్రభుత్వ ‘స్వచ్ఛ భారత్ అభియాన్’కు అనుగుణంగా, పంచకుల నగరాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చటానికి పంచకుల సిటీ అంతటా ఈ  ‘వేస్ట్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రాం’ను ఏర్పాటు చేసింది. 

దీనిపై పంచకుల అడ్మినిస్ట్రేషన్ ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ జర్నైల్ సింగ్ మాట్లాడుతూ.. ‘స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రోగ్రాం కింద ఇప్పటికే పంచకులలో ప్లాస్టిక్‌ను నిషేధించామనీ..మరింతగా దీన్ని విస్తరించేందుకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 1 kg ప్లాస్టిక్ లేదా 10 ప్లాస్టిక్ బాటిళ్లు ఇస్తే వారికి 1 పాల ప్యాకెట్ ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. పంచకుల పట్టణంలో పలు ప్రాంతాల్లో ఇటువంటి స్టోర్ లను చేశాం. ఇప్పటివరకు మేము ఐదు టన్నుల ప్లాస్టిక్ సేకరించాం. నగరవాసులు కూడా ఈ పథకానికి చాలా బాగా స్పందిస్తున్నారని తెలిపారు. నవంబర్ 1న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామనీ దాదాపు రెండు నెలల్లో ఐదు టన్నుల ప్లాస్టిక్ ను సేకరించామని తెలిపారు.