Interfaith Marriages: భారత్ లో మతాంతర వివాహాలను వ్యతిరేకించేవారే ఎక్కువ

భారత్ లో మతాంతర వివాహాలను వ్యతిరేకించేవారే ఎక్కువగా ఉన్నారని ఓ సర్వేలో తేలింది. భారత్ లో ప్రతీ ముగ్గురిలో ఇద్దరు మతాంతర వివాహాలను వ్యతిరేకించేవారే ఉన్నారని తాజా సర్వేలో వెల్లడించింది.

Interfaith Marriages: భారత్ లో మతాంతర వివాహాలను వ్యతిరేకించేవారే ఎక్కువ

Interfaith Marriages (2)

‘Interfaith Marriages : భారత్ లో కులాలు..మతాలు పట్టింపులు కాస్త ఎక్కువనే చెప్పాలి. ముఖ్యంగా వివాహాల విషయంలో మరీ ఎక్కువ. కానీ ఇటీవల కాలంలో మతాంతర వివాహాలు చేసుకున్నవారిపై దాడులు జరుగుతున్నాయని వార్తలు వింటున్నాం. చూస్తున్నాం. దీనికి కారణం మతాంతర వివాహాలంటే ఇష్టం లేకపోవటమే అని అనుకోవాలి.ఎందుకంటే భారత్ లో మతాంతర వివాహాలను వ్యతిరేకించేవారే ఎక్కువగా ఉన్నారని ఓ సర్వేలో తేలింది. భారత్ లోని ప్రతీ ముగ్గురిలో ఇద్దరు మతాంతర వివాహాలను వ్యతిరేకించేవారే ఉన్నారని ప్యూ రీసెర్చ్ సెంటర్ తన తాజా సర్వేలో వెల్లడించింది.

‘రిలిజియన్ ఇన్ ఇండియా: టాలరెన్స్ అండ్ సెగ్రిగేషన్’ పేరిట సర్వే చేసిన ప్యూ..మొత్తం 29,999 మందిని ప్రత్యక్షంగా కలిసి వారి అభిప్రాయాలను సేకరిచింది. మొత్తం 26 రాష్ట్రాల్లో తమ ప్రతినిధులు పర్యటించారని ప్యూ వెల్లడించింది.
అమ్మాయిలలో జరిగే మతాంతర వివాహాలు ఆపాలని 67 శాతం మంది తెలుపగా..అబ్బాయిలు మతాంతర వివాహాలు చేసుకోవడాన్ని నిషేధించాలని 65 శాతం మంది వారి అభిప్రాయాలను వెల్లడించారు.

ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 67 శాతం మంది హిందువులు..80 శాతం ముస్లింలు, 59 శాతం మంది సిక్కులు, 66 శాతం మంది జైనులు ఉన్నారు. వారు తమ మతాలకు చెందిన అమ్మాయిలు ఇతర మతాల యువకులను వివాహం చేసుకోవడానికి ఇష్టపడటంలేదు. పైగా ఇటువంటి వివాహాలను నిషేధించాలని వారంతా ఏకాభిప్రాయాన్ని వెల్లడించారు. అదే సమయంలో హిందువుల్లో 65 శాతంమంది, ముస్లింల్లో 76 శాతంమంది, సిక్కుల్లో 58 శాతంమంది, జైనుల్లో 59 శాతం మంది పురుషులు మతాంతర వివాహాలు చేసుకోవడానికి వ్యతిరేకమని చెప్పారు.

ఇక క్రిస్టియన్లు, బౌద్ధుల్లో అభిప్రాయాలు వేరుగా ఉన్నాయి. క్రిస్టియన్లలో 37 శాతం మంది, బౌద్ధుల్లో 46 శాతం మంది మాత్రమే తమ అమ్మాయిలు ఇతర మతాల వారిని వివాహం చేసుకోవటానికి వ్యతిరేకమని..అటువంటి వివాహాలను ఆపాలని అన్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో అతి కొద్ది మంది మాత్రమే తాము మతాంతర వివాహాలకు అనుకూలమని తెలిపారై. వీరిలో యువత తాము మతాంతర వివాహాలు చేసుకోవాలనుకుంటున్నామని తెలపటం విశేషం.

ఈ సర్వేలో భాగంగా కులాంతర వివాహాల గురించి కూడా అభిప్రాయాలు సేకరించగా, మతాంతర, కులాంతర వివాహాలపై అభిప్రాయాల మధ్య పెద్దగా తేడా ఏమీ కనిపించకపోవటం గమనించాల్సిన విషయం. 62 శాతం మంది పురుషులు, 64 శాతం మంది స్త్రీలు కులాంతర వివాహాలను ఆపాలని తమ అభిప్రాయాలను వ్యక్తంచేశారు.