అండ‌మాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు అవకాశం

నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రంలోకి ప్రవేశించాయి. ఇవి ఈనెల 31 వరకు కేరళ తీరాన్ని తాకుతాయని ఐఎండీ అంచనా వేస్తుంది.

అండ‌మాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు అవకాశం

Southwest Monsoon

Southwest Monsoon : మండుటెండల్లో చల్లటి కబురు అందించింది భారత వాతావరణ విభాగం (ఐఎండీ). నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రంలోకి ప్రవేశించాయని, ఇవి ఈనెల 31 వరకు కేరళ తీరాన్ని తాకుతాయని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. వాతావరణం అనుకూలంగా ఉండటంతో ఇవి చురుగ్గా కదులుతూ దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవులు, మాల్ దీవులతోపాటు కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించాయి. రానున్న రెండురోజులు మరిన్ని ప్రాంతాలకు విస్తరించటానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ తెలిపింది.

Also Read : IMD: అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం: ఐఎండీ

నైరుతి రుతుపవనాలు ఈనెల 31నాటికి కేరళను తాకటానికి అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది. ఇంకా ముందుకూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఆ తరువాత రెండు మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. లానినో పరిస్థితులు భారత్ కు అనుకూలంగా ఉండటంతో ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నట్లు ఐఎండీ ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు.. దక్షిణ ఛత్తీస్ గఢ్ నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా సముద్ర మట్టానికి 3.1కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ద్రోణి బలహీన పడింది. ప్రస్తుతం రాష్ట్రంపైకి ఆగ్నేయ నైరుతి దిశలుగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రానున్న మూడు రోజులు కోస్తా ఆంధ్ర, రాయలసీమల్లో ఒకటిరెండు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలాఉంటే.. ఈనెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది మరింతగా బలపడి 24 నాటికి వాయుగుండంగా మారి అనంతరం తుఫాన్ గా మారనుందని ఐఎండీ అంచనా వేస్తుంది. ఈ కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Also Read : IMD Warns Of Heat Waves : ఏపీ, తెలంగాణకు పొంచి ఉన్న ముప్పు.. ఆ 2 నెలలు జాగ్రత్త అంటున్న ఐఎండీ

దేశంలోకి నైరుతి రుతుపవనాలు అడుగుపెట్టే విషయంలో ప్రతీయేటా సమయం మారుతుంది. గత 150 ఏళ్లుగా నైరుతి రాకలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 1918లో అత్యంత తొందరగా మే 11న నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. 1972లో ఆలస్యంగా జూన్ 18న నైరుతి రుతుపవనాలు వచ్చాయి. 2020లో జూన్ 1వ తేదీన, 2021లో జూన్ 3న, 2022లో మే 29న, గతేడాది (2023లో) జూన్ 8న రుతు పవనాలు దేశంలోకి ప్రవేశించాయి.