Hanuma Vihari : కరోనా కష్టకాలంలో తెలుగు క్రికెటర్ పెద్దమనసు.. ప్రత్యేక టీమ్‌తో కోవిడ్ బాధితులకు సాయం

కరోనా కష్టకాలంలో తెలుగు క్రికెటర్ హనుమ విహారి తన పెద్దమనసు చాటుకున్నాడు. కరోనా బాధితులకు అండగా నిలిచాడు. కరోనా బాధితుల సహాయార్థం తన మిత్రులతో కలిసి నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసి దాని ద్వారా కరోనా బాధితులకు పడకలు, ఆక్సిజన్‌ సిలిండర్లను, ప్లాస్మాథెరపీ సేవల్ని అందజేస్తున్నాడు.

Hanuma Vihari : కరోనా కష్టకాలంలో తెలుగు క్రికెటర్ పెద్దమనసు.. ప్రత్యేక టీమ్‌తో కోవిడ్ బాధితులకు సాయం

Hanuma Vihari

Hanuma Vihari : కరోనా కష్టకాలంలో తెలుగు క్రికెటర్ హనుమ విహారి తన పెద్దమనసు చాటుకున్నాడు. కరోనా బాధితులకు అండగా నిలిచాడు. కరోనా బాధితుల సహాయార్థం తన మిత్రులతో కలిసి నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసి దాని ద్వారా కరోనా బాధితులకు పడకలు, ఆక్సిజన్‌ సిలిండర్లను, ప్లాస్మాథెరపీ సేవల్ని అందజేస్తున్నాడు.

ప్రస్తుతం కౌంటీ క్రికెట్‌ ఆడేందుకు ఇంగ్లండ్‌లో ఉన్నాడు భారత టెస్టు బ్యాట్స్‌మన్, ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్‌ హనుమ విహారి. అక్కడ ఉంటున్నా భారతీయుల అవస్థలను గమనిస్తూనే ఉన్నాడు. బెడ్ల కోసం, ఆక్సిజన్ కోసం, మందుల కోసం కరోనా రోగులు పడుతున్న అవస్థలను చూసి విహారి
చలించిపోయాడు. వారికి సాయం చేయాలని నిర్ణయించాడు. అంతే.. తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటకలో 100 మంది వలంటీర్లతో విహారి ఓ బృందాన్ని ఏర్పాటు చేశాడు. దీనికోసం తన మిత్రుల సహకారం కోరగా వారంతా కలిసివచ్చారు. ఈ బృందంలో విహారి భార్య ప్రీతి, సోదరి వైష్ణవి, ఆంధ్ర రంజీ సహచరులు కూడా ఉన్నారు. ఆ బృందం ద్వారా కరోనా రోగులకు సాయం చేస్తున్నాడు విహారి.

వీళ్లందర్ని గ్రూప్‌‌లుగా విభజించి పేషెంట్లకు అవసరమైన వాటిని అందజేస్తున్నాడు. ప్రస్తుతానికి విహారి.. కౌంటీ క్రికెట్‌‌ కోసం లండన్‌‌లో ఉన్నాడు. అక్కడి నుంచే నిత్యం వీళ్లతో ట్విటర్‌‌లో సంప్రదింపులు జరుపుతున్నాడు. ప్లాస్మా, ఆక్సిజన్‌‌ సిలిండర్‌‌, హాస్పిటల్​ బెడ్‌‌.. ఇలా ఏది కోరినా తన టీమ్‌‌ ద్వారా బాధితులకు అందజేస్తున్నాడు. గాయంతో బాధపడుతూ టెస్ట్‌‌ మ్యాచ్‌‌లో ఇండియాను గెలిపించిన దానికంటే.. ఇలా ప్రాణాలు కాపాడటం చాలా గొప్పగా ఉందని విహారి అన్నాడు.

‘నేను చేసింది గొప్ప దాతృత్వమో, సేవో కానే కాదు. అవసరమైన వారికి ఏదో నాకు తోచినంత సాయం మాత్రమే ఇది. మహమ్మారి ఉధృతిలో నా వంతు చేయూత అందించానంతే’ అని అన్నాడు. ఆసుపత్రిలో పడకల కోసం ఇంతటి క్లిష్టమైన పరిస్థితి వస్తుందని ఏనాడు ఊహించలేదని, ఇది
హృదయవిదారకమని విహారి విచారం వ్యక్తం చేశాడు. విపత్కర పరిస్థితిపై కలత చెందిన అతను తనవంతుగా చేయూత అందించాడు.

సోషల్ మీడియాలో లక్షా పదివేల ఫాలోవర్లు ఉన్న విహారి చేసిన ప్రయత్నానికి చాలామంది కలిసిరావడంతో ఈ ప్రక్రియ నిరంతరాయంగా సాగుతోంది. ముఖ్యంగా పరిస్థితి విషమించిన వారికి ప్లాస్మా దానం, ఆక్సిజన్‌ అవసరమైన వారికి ప్రాణవాయువు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగానని ఇక ముందు కూడా ఇలాంటి సాయమందించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని విహారి చెప్పాడు. ఇప్పటివరకు 11 టెస్టులాడిన విహారి 624 పరుగులు చేశాడు. వార్విక్‌షైర్‌ తరఫున ఆడేందుకు విహారి గత నెలలోనే ఇంగ్లండ్‌ చేరాడు. అక్కడే జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ కోసం జూన్‌ 3న అక్కడకు చేరుకునే భారత జట్టుతో విహారి కలిసే అవకాశముంది.