ATM Cultivation : ఏటీఎం విధానంలో.. 20 సెంట్లలో 30 రకాల పంటల సాగు

ATM Cultivation : ప్రకృతి వైపరీత్యాలు ఒక వైపు, దళారులు మరొకవైపు రైతులను దోచుకుంటున్నారు. ఈక్రమంలోనే వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకు అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి.

ATM Cultivation : ఏటీఎం విధానంలో.. 20 సెంట్లలో 30 రకాల పంటల సాగు

ATM Cultivation

Updated On : October 28, 2024 / 4:30 PM IST

ATM Cultivation : ఏడాది పొడవున కూరగాయల దిగుబడి.. ఫలితంగా నిత్యం కోతలు… రోజు డబ్బులే.. ఇదంతా ఏటిఎం మోడల్‌ సాగు విధానంలో రైతులకు వచ్చే ఆదాయం. ఈ విధానాన్నే పాటిస్తూ… పశ్చిమగోదావరి జిల్లాలో ఓ రైతు… 20 సెంట్ల భూమిలో 30 రకాల ఆకుకూరలు, కూరగాయలు , పూలు, పండిస్తున్నారు. వచ్చిన దిగుబడిని స్థానిక మార్కెట్ లో అమ్ముతూ..  మంచి లాభాలను పొందుతున్నారు.

వ్యవసాయంలో పెట్టుబడులు పెరిగిపోయాయి. రైతులు ఆరుగాలం కష్టపడినా అందుకు తగిన ఫలితం రావడం లేదు. దీంతో చాలా మంది రైతులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. మరోవైపు చిన్న కమతాల్లో పంటలు సాగు చేస్తున్న అన్నదాతలు  మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ప్రకృతి వైపరీత్యాలు ఒక వైపు, దళారులు మరొకవైపు రైతులను దోచుకుంటున్నారు. ఈక్రమంలోనే వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకు అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ విభాగం వారు ఏటీఎం మోడల్ సాగు విధానాన్ని తీసుకొచ్చారు.

చిన్న చిన్న కమతాలున్న రైతులు ఆకు కూరలు, కాయగూరలు, పండ్లు, పూల సాగు చేసి మంచి ఆదాయాన్ని ఆర్జించవచ్చని చెబుతూ.. ఈ పంట సాగు విధానం పట్ల పలువురికి అవగాహన కల్పిస్తున్నారు. ఇలా అవగాహన పొందిన ప్రకాశం జిల్లా, కొత్తపట్నం మండలం, రంగాయపాలెం గ్రామానికి చెందిన రైతు కాటా సురేంద్ర 20 సెంట్ల భూమిలో ఏటిఎం మోడల్ విధానంలో పలు రకాల ఆకుకూరలు, కూరగాయలు, పూలు, పండ్ల మొక్కలు నాటి వాటి నుండి ప్రతిరోజు దిగుబడిని తీస్తూ… మంచి లాభాలు గడిస్తున్నారు.

పంటలకు ఎలాంటి రసాయన మందులను వాడటం లేదు. కేవలం సొంతంగా తయారు చేసుకున్న ఎరువులు, కషాయాలనే వాడుతున్నారు. తద్వారా పెట్టుబడి చాలా వరకు తగ్గింది. వచ్చిన దిగుబడిని ప్రతి రోజు స్థానికంగా ఉండే సూపర్ మార్కెట్ లకు అమ్ముతూ.. మంచి లాభాలను గడిస్తున్నారు.

Read Also : Blackgram Varieties : అధిక దిగుబడినిచ్చే మినుము రకాలు