Millet Outlets for Women
Millet Outlets For Women : మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా.. వారిని వ్యాపారవేత్తలుగా మలిచేందుకు తెలంగాణ ఆగ్రోస్ సంస్థ ముందుకొచ్చింది. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న చిరుధాన్యాల ఉత్పత్తుల వ్యాపారంలో మహిళలను భాగస్వాములను చేయాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా చిరుధాన్యాలతో పాటు వాటి ఉత్పత్తులను విక్రయించేందుకు త్వరలో ఔట్‌లెట్స్ ఏర్పాటు చేయించనున్నది.
READ ALSO : స్మార్ట్ సేద్యం.. యాప్ సాయంతో పంటలు… నూజివీడు త్రిపుల్ ఐటీ విద్యార్థుల ఘనత
సాగు సరళి మారుతోంది. పాతతరం పంటలకు మంచి డిమాండ్ రావటంతో వీటి సాగు తిరిగి ఊపందుకుంది. దీనికి తోడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇతోధికంగా ప్రోత్సహిస్తుండటంతో.. చిరుధాన్యాల సాగు విస్తీర్ణం ఏటికేడు పెరుగుతోంది. దీన్నే ఆసరాగ చేసుకొని తెలంగాణ ఆగ్రోస్ మహిళలను వ్యాపార వేత్తలుగా తీర్చిదిద్దేందుకు శ్రీకారం చుట్టింది.
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రైతుసేవా కేంద్రాలను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించిన ఆ సంస్థ… ఇటు మహిళకు చేయూతనిచ్చేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే అక్షయపాత్ర, హెచ్.డి.ఎఫ్.సి బ్యాంకుతో కలిసి ఔత్సాహిక మహిళలకు రాజేంద్రనగర్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ (ఐఐఎంఆర్)లో సంస్థ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది.
READ ALSO : Lady Finger Cultivation : 2 ఎకరాల్లో బెండసాగు.. 3 నెలల్లో రూ. 2 లక్షల ఆదాయం
మిల్లెట్ ఔట్‌లెట్ వ్యాపారానికి అవసరమైన చిరు ధాన్యాలను, వాటి ఉత్పత్తులను అక్షయపాత్ర ఫౌండేషన్ సరఫరా చేయనున్నది. షాప్ అద్దెకు తీసుకోలేని వారి కోసం ప్రత్యేకంగా కంటైనర్ షాప్‌లను కూడా రూపొందించి ఇచ్చేందుకు టీఎస్ ఆగ్రోస్, అక్షయపాత్ర మధ్య ఒప్పందం కుదురింది. మొత్తం 68 రకాల ఉత్పత్తులను అందుబాటులో ఉంచనుంది.
రైతుల నుంచి ప్రత్యేకంగా చిరు ధాన్యాలను కొనుగోలు చేసి వాటి నుంచి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సర్టిఫికెట్‌తో అత్యంత నాణ్యతగా ఆహార పదార్థాలను తయారు చేయనున్నది. మిల్లెట్ వ్యాపారంలోకి ప్రవేశించే మహిళలకు పెట్టుబడి ఇబ్బంది లేకుండా ఆగ్రోస్ చర్యలు తీసుకుంటుంది.
ఎలాంటి పూచీకత్తు ఇవ్వకుండానే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో రుణాలు ఇప్పించేలా ఏర్పాట్లు చేసింది. ఒక్కొక్కరికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలు అందించేందుకు బ్యాంకర్లు అంగీకరించారు.
తొలిదశలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 10 ఔట్‌లెట్లు, జిల్లా కేంద్రాల్లో ఒకటి రెండు చొప్పున, ఏర్పాటు చేయాలని ఆగ్రోస్, అక్షయపాత్ర యోచిస్తున్నాయి. త్వరలోనే ఔత్సాహిక మహిళల్ని ఎంపిక చేసి వారికి ఔట్‌లెట్స్‌ను కేటాయించనున్నారు.