స్మార్ట్ సేద్యం.. యాప్ సాయంతో పంటలు… నూజివీడు త్రిపుల్ ఐటీ విద్యార్థుల ఘనత

జాతీయ స్థాయిలో విజయమే లక్ష్యంగా నూజివీడు ట్రిపుల్‌ ఐటీ ఈసీఈ విద్యార్థులు ఒ.నాగరమ్య, ఒ.సాయిలహరి, సుధీర్‌ (ఏఆర్‌కేఏ టీం) తమ ప్రాజెక్టుతో దూసుకుపోతున్నారు.

స్మార్ట్ సేద్యం.. యాప్ సాయంతో పంటలు… నూజివీడు త్రిపుల్ ఐటీ విద్యార్థుల ఘనత

Agriculture With Help Of App

Agriculture With Help Of App : జాతీయ స్థాయిలో విజయమే లక్ష్యంగా నూజివీడు ట్రిపుల్‌ ఐటీ ఈసీఈ విద్యార్థులు ఒ.నాగరమ్య, ఒ.సాయిలహరి, సుధీర్‌ (ఏఆర్‌కేఏ టీం) తమ ప్రాజెక్టుతో దూసుకుపోతున్నారు. నాగరమ్య, లహరి కవల పిల్లలు. మైటీ, మై గవర్నమెంట్‌, డిజిటల్‌ ఇండియా సంయుక్తంగా గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా… మినిస్ట్రీ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఆధ్వర్యంలో ‘స్వదేశీ మైక్రో ప్రొసెస్‌ ఛాలెంజ్‌’’ పోటీలను జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నారు. పోటీకి దేశం నలుమూలల నుంచి వేలాది జట్లు తమ ప్రాజెక్టులతో పాల్గొనగా.. క్వార్టర్‌ ఫైనల్స్‌కు 6,640 జట్లు అర్హత సాధించాయి.

విజేతలకు రూ.24లక్షల నగదు బహుమతి:
మార్చి 10న వెలువడిన ఫలితాల్లో 100 ప్రాజెక్టులు సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. అందులో నూజివీడు ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల ప్రాజెక్టు ‘‘స్మార్ట్‌ ఇరిగేషన్‌ బేస్డ్‌ ఆన్‌ క్రాప్స్‌’’ ఒకటి. సెమీఫైనల్స్‌కు చేరిన వారికి రూ.లక్ష చొప్పున నగదు బహుమతి అందించారు. మే 10న నిర్వహించే ఫైనల్స్‌లో తొలుత 25 ప్రాజెక్టులను, అందులో నుంచి 10 ఉత్తమ ప్రాజెక్టులను ఎంపిక చేస్తారు. ఆ పదింటిలో 1, 2, 3 స్థానాలు సాధించిన వారికి రూ.24 లక్షల చొప్పున, మిగిలిన ఏడుగురికి రూ.20 లక్షల చొప్పున నగదు బహుమతి అందజేస్తారు. మిగిలిన 15 మంది ఫైనలిస్టులకు ప్రోత్సాహం కింద రూ.4 లక్షల వంతున ఇస్తారు.

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అనేక ఆటోమెటిక్‌ సాగునీటి పరికరాల్లో లోపాలను ఏఆర్‌కేఏ జట్టు సభ్యులు గుర్తించారు. ఆ లోపాలను సవరిస్తూ ప్రాజెక్టు తయారు చేశారు. ఒక్కో పంటకు పలు దశల్లో ఒక్కో విధమైన ఎరువు, నీరు అవసరం ఉంటుంది. ఆ అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రొటోటైప్‌ సాంకేతికతను వృద్ధి చేశారు. అందుకు మొబైల్‌ యాప్‌ని రూపొందించారు. అందులో పంట రకం, విస్తీర్ణం, నాటు వేసిన తేదీ వివరాలను పొందుపరుస్తారు. ఆ సమాచారం మేరకు యాప్‌ ఆటోమెటిక్‌గా నీరు విడుదల చేయడానికి మోటార్ ను ఆన్‌, ఆఫ్‌ చేస్తుంది. ఈ ప్రాజెక్టు కోసం జట్టు సభ్యులు 10 సెంట్ల భూమిలో వరి సాగు చేస్తున్నారు. నేలలో పోషకాల స్థాయి తెలుసుకునేందుకు ఎన్‌పీకే సెన్సార్‌ని ఉపయోగించారు. అది ఎరువు గురించి యాప్‌ ద్వారా రైతుకు తెలియజేస్తుంది. దీని కోసం ఐఐటీ మద్రాస్‌ రూపొందించిన ఎఫ్‌పీజీఏ బోర్డుని విద్యార్థులు వినియోగించారు.

తాము ఫైనల్స్‌కు చేరడమే కాకుండా ఉత్తమ పది జట్లలో స్థానం సాధిస్తామని నాగరమ్య, సాయి లహరి, సుధీర్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2020లో జాతీయ స్థాయిలో నిర్వహించిన సంకల్ప్‌ హాకథాన్‌ పోటీల్లో రమ్య లహరి ద్వితీయ స్థానం, ఐఐటీ ముంబై నిర్వహించిన అంతర్జాతీయ టెక్‌ఫెస్ట్‌లో సుధీర్‌ ద్వితీయ స్థానం సాధించాడు. ప్రాజెక్టు గైడ్ లుగా ఈసీఈ సహాయాచార్యులు పి.శ్యాం, ఎస్‌కే ఇర్ఫాన్‌ అలీ వ్యవహరిస్తున్నారు.