Taiwan Light Pink Guava Farming
Pink Guava Farming : ఒకప్పుడవి రాళ్లు నిండిన బీడు పొలాలు… ఇప్పుడు అవి సిరులు కురిపిస్తున్న పండ్ల తోటలు. అప్పుడు పంటల సాగుచేపడితే.. సకాలంలో వానలు లేక జీవం కోల్పోయిన భూముల్లో పంటలు పండలేదు.. దీంతో పెట్టిన పెట్టుబడులు రాక అప్పుల పాలయ్యారు రైతులు. కానీ ఇప్పుడు ఉన్న కొద్దిపాటి నీటిని ఒడిసిపట్టి.. బంగారు పంటలు పండిస్తున్నారు ప్రకాశం జిల్లాకు చెందిన ఓ రైతు. మరి ఆయన పండిస్తున్న పంట ఏంటీ.. ఏటా ఎంత ఆదాయం పొందుతున్నారో మనమూ తెలుసుకుందామా..?
Read Also : Kharbuja Cultivation : వేసవిలో మంచి డిమాండ్.. కష్టాలు తీర్చుతున్న కర్బుజా సాగు
ప్రకాశం జిల్లా అనగానే అతితక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లా. తీవ్ర కరువు కాటకాలతో వ్యవసాయం నష్టాల బాటన కొనసాగుతుంటుంది. అందుకే ఇక్కడి నుండి చాలా వలస పోతుంటారు. అయితే గత రెండు సంవత్సరాల నుంచి ఉద్యానవన పంటలతో సిరులు కురిపిస్తున్నారు పుల్లల చెరువు మండలం, రాచకొండ గ్రామానికి చెందిన రైతు నారు బంగారు రెడ్డి. ఇదిగో ఇక్కడ చూడండీ… ఈ జామతోట విస్తీర్ణం మొత్తం 20 ఎకరాలు . రెండేళ్ల క్రితం నాటిన ఈ మొక్కల నుండి రెండో సంవత్సరం దిగుబడులను తీస్తున్నారు రైతు బంగారు రెడ్డి.
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఈ ప్రాంతంలో కంది, మిరప లాంటి పంటలను పండించి చేతులు కాల్చుకున్నారు. ఆ తరువాత ఉన్న కొద్ది పాటి నీటిని నిల్వచేసుకునేందుకు 4 ఎకరాల్లో ఫాంపాండ్ ఏర్పాటు చేసుకొని అక్కడి నుండి మొక్కలకు డ్రిప్ ద్వారా నీటి తడులను అందిస్తున్నారు. అంతే కాదు సమయానుకూలంగా ఎరువులు, సూక్ష్మపోషకాలను ఫర్టిగేషన్ ద్వారా అందించడంతో తోట ఆరోగ్యంగా పెరిగి నాణ్యమైన దిగుబడులు వస్తున్నాయి.
రైతు బంగారురెడ్డి అందరిలా కాకుండా మార్కెట్ చూసుకోనే పంట దిగుబడి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. తోటలో వచ్చే చీడపీడలను గమనిస్తూ.. వాటిని సమగ్రంగా నివారిస్తున్నారు. అంతే కాదు వచ్చిన దిగుబడిని హైదరాబాద్, చెన్నై, కెరళ మార్కెట్ కు తరలిస్తూ.. అధిక ఆధాయం పొందుతున్నారు.
అత్యంత కరువు పీడిత ప్రాంతంగా ఉన్న ఈ ప్రాంతంలో ఎలాంటి సాగునీటి వనరులు లేవు. ఇక్కడి రైతులు వర్షాధార పంటలనే సాగు చేయాలి. ఈ ప్రాంతంలో వరి సాగుకు అవకాశమే లేదు. అలాంటి పరిస్థితుల్లో పండ్లతోటలను సాగుచేస్తూ.. సిరులు పండిస్తూ.. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు రైతు బంగారురెడ్డి.
Read Also : Vegetable Farming : వేసవిలో కూరగాయల సాగులో మెళకువలు