CII Summit
CII Summit : ఏపీలోని కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్న భాగస్వామ్య పెట్టుబడుల సదస్సు కోసం విశాఖపట్టణం ముస్తాబైంది. సీఐఐ – ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ఈనెల 14, 15 తేదీల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ మైదానంలో జరగనుంది. ఈ సదస్సుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 40 దేశాల నుంచి 3వేల మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అతిథుల కోసం నగరంలోని 26హోటళ్లలో 1200 గదులు సిద్ధం చేశారు.
సదస్సు సందర్భంగా 2200 మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. నిఘా కోసం 15 డ్రోన్లు, 155 సీసీ కెమెరాలు అమర్చారు. సభా ప్రాంగణంతోపాటు స్టార్ హోటళ్లలో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. సదస్సు జరిగే ప్రాంగణంలో ప్రత్యేక కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేయడంతోపాటు.. అస్త్రం యాప్‌తో ట్రాఫిక్ పర్యవేక్షణ చేస్తున్నారు. బుధవారం సాయంత్రం విశాఖ చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌లు సదస్సు ముగింపు వరకూ విశాఖలోనే బస చేయనున్నారు. భారీగా పెట్టుబడులు, ఉద్యోగాలే లక్ష్యంగా ఈ సదస్సు జరగనుంది. ఏయూ గ్రౌండ్స్ వేదికకా జరగనున్న ఈ సీఐఐ సదస్సు ద్వారా 9.76 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 410 ఎంవోయూలు చేసుకోనున్నారు. తద్వారా 7,48,427 మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి.
సదస్సు నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం రాత్రి విశాఖపట్టణం చేరుకున్నారు. మంత్రి నారా లోకేశ్ కూడా విశాఖకు చేరుకున్నారు. ఈనెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు కొనసాగనుండగా.. నాలుగు రోజుల పాటు సీఎం చంద్రబాబు విశాఖలోనే బస చేస్తారు. అయితే, పార్టనర్షిప్ సమ్మిట్‌కు ముందుగా ఇవాళ దేశంలోని ప్రముఖ కంపెనీల చైర్మన్లు, సీఈఓలు, విదేశీ రాయబారులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భేటీ కానున్నారు. సాయంత్రం చంద్రబాబు సమక్షంలో వివిధ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూలు చేసుకోనుంది.
సీఎం చంద్రబాబు షెడ్యూల్ ఇదే..
♦ గురువారం భాగస్వామ్య సదస్సుకు తరలివస్తున్న జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో వరుస భేటీలు ఉంటాయి.
♦ ఉదయం 10 గంటలకు నోవోటెల్ హోటల్ లో ఇండియా -యూరప్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశానికి సీఎం చంద్రబాబు నాయుడు హాజరవుతారు.
♦ పార్టనర్స్ ఇన్ ప్రోగ్రెస్ ఇండియా – యూరోప్ కోపరేషన్ ఫర్ సస్టెయినబుల్ గ్రోత్ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం ఉంటుంది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో గ్రీన్ షిఫ్ట్, సస్టైనబుల్ ఇన్నోవేషన్, యూరోపియన్ పెట్టుబడులపై పారిశ్రామిక ప్రతినిధులతో సీఎం చంద్రబాబు చర్చలు జరుపుతారు.
♦ మధ్యాహ్నం తైవాన్, ఇటలీ, స్వీడన్, నెదర్లాండ్స్ ప్రతినిధులతో చంద్రబాబు భేటీ కానున్నారు.
♦ ఎస్పీపీ పంప్స్ లిమిటెడ్ ఎండీ అలోక్ కిర్లోస్కర్, రెన్యూ పవర్ చైర్మన్ సుమిత్ సిన్హా, యాక్షన్ టెసా గ్రూప్ చైర్మన్ ఎన్ కె అగర్వాల్ తోనూ సీఎం చంద్రబాబు భేటీ అవుతారు.
♦ మురుగప్ప గ్రూప్ చైర్మన్ అరుణ్ అలగప్పన్, కోరమాండల్ ఇంటర్నేషనల్ ఎండీ శంకర్ సుబ్రహ్మణియన్, జూల్ గ్రూప్, హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ చైర్మన్ రాహుల్ ముంజాల్ సీఎం సమావేశాలు ఉంటాయి.
♦ సాయంత్రం వైజాగ్ ఎకనమిక్ రీజియన్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఆ తరువాత సీఐఐ నేషనల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశానికి హాజరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు.