Turakapalem Deaths: గుంటూరు జిల్లా తురకపాలెంలో వరుస మరణాలపై ఏమాత్రం ఇంకా స్పష్టత రాలేదు. అంతుచిక్కని మరణాలు తురకపాలెం గ్రామస్తులను కలవరపెడుతున్నాయి. తురకపాలెంలో ప్రత్యేక వైద్య బృందాలతో అందరికీ వైద్య పరీక్షలు చేయిస్తున్నారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. మరోవైపు ఇప్పటికే ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు.
సోమవారం లోపు తురకపాలెం ఘటనపై పూర్తి స్థాయి నివేదిక కావాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో వైద్య శాఖ అధికారులు సైతం మరోసారి ఇంటింటి సర్వే చేపట్టారు. ప్రతి ఇంటి నుంచి బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేస్తున్నారు అధికారులు. అంతేకాకుండా తురకపాలెంలోని చెరువులో నీటి శాంపిల్స్ ను సేకరించారు.
తురకపాలెంలో రెండు నెలల వ్యవధిలో 38 మంది వరకు చనిపోయారు. దీంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. గ్రామస్తులు ఎందుకు చనిపోతున్నారో ఎవరికీ అంతు చిక్కడం లేదు. మరణాల వెనక మిస్టరీ ఆందోళనకు గురి చేస్తోంది. ప్రభుత్వం ఈ మరణాలపై సీరియస్ గా దృష్టి సారించింది. మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయో తెలుసుకునే పనిలో పడింది. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు రంగంలోకి దిగారు.
అటు ముఖ్యమంత్రి చంద్రబాబు తురకపాలెం మరణాలపై ఆరాతీశారు. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మరణాలపై సోమవారం లోగా తుది నివేదిక ఇవ్వాలని అధికారులతో చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గ్రామంలో శిబిరాలు ఏర్పాటు చేశారు. గ్రామస్తులందరికీ వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటికే ఇళ్లకు వెళ్లి బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. మెలిన్ అనే బ్యాక్టీరియా కారణంగా ఈ మరణాలు సంభవిస్తున్నాయని వైద్య అధికారులు తెలిపారు.
బొడ్రాయి కారణంగా ఈ మరణాలు సంభవిస్తున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, అది మూఢ నమ్మకమేనని, దాని వల్ల మరణాలు సంభవించడం లేదని అధికారులు స్పష్టం చేసినా.. గ్రామస్తుల్లో ఆందోళన మాత్రం తొలగడం లేదు. స్థానికులకు వైద్య పరీక్షలు నిర్వహించిన అధికారులు.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని భరోసా కల్పించే ప్రయత్నం చేశారు.