Turakapalem Death Mystery: 4 నెలల్లో 40 మంది మృతి.. గుంటూరు జిల్లా తురకపాలెంలో భయం భయం.. అసలేం జరుగుతోంది?

తురకపాలెంలో ప్రజలు ఎందుకు ఇలా చనిపోతున్నారు? గ్రామంలో మరణాల మిస్టరీ వీడేనా..

Turakapalem Death Mystery: వరుస మరుణాలతో గుంటూరు జిల్లా తురకపాలెంలో మరణ మృదంగం మోగుతోంది. అంతు చిక్కని మరణాలతో గ్రామస్తులు వణికిపోతున్నారు. 4 నెలల వ్యవధిలో 40 మంది గ్రామస్తులు ప్రాణాలు కోల్పోవడం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. జ్వరం, దగ్గు, ఆయాసంతో ఆసుపత్రుల్లో చేరిన వారు తిరిగి ఇంటికి రావడం లేదు. చికిత్స పొందుతూ మృత్యుఒడిలోకి చేరుతున్నారు. ఓ ఇంట్లో అంత్యక్రియలు పూర్తయ్యేలోపే మరొకరు చనిపోతున్నారు. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ఎస్సీ కాలనీలో ఎక్కువగా మరణాలు..!

మరణాల సంఖ్య గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఎక్కువగా నమోదు కావడం మూఢనమ్మకాలకు దారితీస్తోంది. తురకపాలెం గ్రామానికి ఇటీవల నలువైపుల ఏర్పాటు చేసిన బొడ్రాయే ఈ మరణాలకు కారణమని స్థానికులు చెబుతున్నారు. మూడు వైపుల బొడ్రాయిలు సరిగ్గా ఉన్నాయి. ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసిన బొడ్రాయి వంగి ఉండటంతో మరణాలు సంభవిస్తున్నాయని తెలిపారు.

అంతుచిక్కని మరణాలకు బొడ్రాయే కారణమా?

ఊరికి మధ్యలో ఉన్న బొడ్రాయికి సంబంధించి మార్పులు చేయడంతో పాటు ఊరి పొలిమేరలో నిర్వహించిన పూజలు, దుష్టశక్తుల వల్లే పల్లెలో అందరూ చనిపోతున్నారన్న మూఢనమ్మకం ప్రబలింది. గ్రామానికి అరిష్టం జరక్కుండా ఏర్పాటు చేసే బొడ్రాయిని ఎలా పడితే అలా కాకుండా నియమ నిష్టలతో ఏర్పాటు చేయాల్సి ఉంటుందని స్థానికులు అంటున్నారు. వంగిపోయిన బొడ్రాయిని సరి చేయాల్సిన అవసరం ఉందని కొందరు నమ్ముతున్నారు.

స్తానిక ఎమ్మెల్యే రామాంజనేయులు ఆదేశాలతో వైద్య ఆరోగ్య శాఖ రంగంలోకి దిగింది. తురకపాలెంలో సంభవిస్తున్న మరణాలపై వైద్య బృందం ఇంటింటి సర్వే నిర్వహిస్తోంది. ఎస్సీ కాలనీలో పారిశుధ్య లోపం, క్వారీ కాలుష్యం, కలుషిత భూగర్భ జలాలు అనారోగ్యానికి దారితీస్తున్నాయని వైద్య బృందం గుర్తించింది. మృతుల కుటుంబాలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వారికి సంబంధించిన రక్త పరీక్ష నమూనాలను సేకరించారు.

మెలియాయిడోసిస్ బ్యాక్టీరియా కారణంగా మరణాలు సంభవిస్తున్నట్లు వైద్యులు భావిస్తున్నారు. వైద్య పరీక్షల్లో విస్తుపోయే విషయాలు తెలిశాయి. 80శాతం మంది పురుషుల్లో రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు బయటపడ్డాయి. కొందరిలో కిడ్నీల పనితీరు మందగించినట్లు గుర్తించారు.

మరికొందరికి చిన్న గాయాలు ఇన్ ఫెక్షన్ కు గురై పుండుగా మారి ప్రాణాంతకంగా మారుతున్నాయి. గ్రామంలో సంభవిస్తున్న మరణాలతో భయపడిపోతున్న స్థానికుల్లో ధైర్యం నింపుతోంది వైద్య బృందం. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, లోతైన అధ్యయనం చేస్తున్నామని ప్రజలకు అవసరమైన వైద్య చికిత్స అందిస్తామని వైద్య అధికారులు స్పష్టం చేశారు.

Also Read: సంపూర్ణ చంద్ర గ్రహణం.. ఏం చేయాలి? అస్సలు చేయకూడని పనులు ఏంటి?