ఏపీలో రైతులకు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులు అందించాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ‘ఈ–పంట’తో లింక్ చేస్తూ రైతుల క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులు ఉండాలని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు వారికి డెబిట్ కార్డు ద్వారా అందించాలని సూచించారు. ఈ ఖరీఫ్ నాటికి రాష్ట్రంలో రైతులకు 56 లక్షల క్రెడిట్ కార్డులు, 56 లక్షల డెబిట్ కార్డులను రెడీ చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆయన ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు పురోగతిపై కూడా ఆయన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రైతు భరోసా కేంద్రాల్లో ఏర్పాటు చేసే కియోస్క్‌లను జగన్ పరిశీలించారు.
క్రెడిట్, డెబిట్ కార్డులతో రైతులకు ప్రయోజనం కలుగుతుంది. రైతులెవరికీ డబ్బు చేతికి రాదనే భయం ఉండకూడదన్నారు. సంబంధిత బ్యాంక్‌కు వెళ్లి కార్డు చూపిస్తే చాలు.. బ్యాంకులు డబ్బులను రైతుల చేతికిచ్చేలా ఉండాలని సీఎం అన్నారు. ఈ క్రాప్ నుంచే లింక్ చేస్తూ క్రెడిట్ కార్డు ఉండాలి. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు డెబిట్ కార్డు ద్వారా రైతులకు అందాలని చెప్పారు. కొత్తగా క్రెడిట్ కార్డులతో పాటు కొత్త అకౌంట్లు తెరవాలని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11,158 రైతు భరోసా కేంద్రాలు (RBK) ఏర్పాటు కానున్నాయి. 10,592 భవనాలను గుర్తించామని అధికారులు తెలిపారు. జూన్ 1 నాటికి అన్నీ రెడీ అవుతాయని చెప్పారు. సేకరణ, మార్కెట్ ఇంటెలిజెన్స్, గ్రేడింగ్, ప్యాకింగ్ కూడా ఆర్‌బీకేకు లింక్ చేసేలా మౌలిక సదుపాయాలు కల్పించాలని సీఎం తెలిపారు. ఆర్‌బీకే ఆండ్రాయిడ్ యాప్ వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. యాప్‌లో సర్వీసెస్ కాల్ సెంటర్ కూడా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆక్వా రైతులకు నాణ్యమైన ఫీడ్, సీడ్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆక్వా రైతులకు కూడా కాల్‌సెంటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి చోటా ఆక్వా టెస్టింగ్ సౌకర్యాలు కల్పించాలనని జగన్ సూచించారు. విత్తనాల నాణ్యత, భూసార పరీక్ష కిట్లను సిద్ధం చేయాలని ఆదేశించారు. విత్తనాలు మంచి నాణ్యతతో ఉండాలని, కాలపరిమితి ముగిసినవి విక్రయించకుండా చూడాలన్నారు. నాణ్యమైన విత్తనాలు రైతులకు సరఫరా చేయాలన్నారు. విత్తన తయారీదారుల వద్ద క్వాలిటీ టెస్టింగ్ జరగాలని సీఎం ఆదేశించారు. పారదర్శకంగా విత్తనాల కంపెనీల నుంచి కొనుగోళ్లు జరగాలన్నారు.