తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో కరోనా కలకలం రేగింది. ఐదేళ్ల బధిర బాలుడు కరోనా బారినపడ్డాడు. వెంటనే ఆ చిన్నారిని చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. బధిరులకు గుంటూరులో శస్త్రచికిత్స చేస్తున్న విషయం తెలుసుకున్న బాలుడి కుటుంబ సభ్యులు చిన్నారిని అక్కడికి తీసుకెళ్లి ఆపరేషన్ చేయించారు. రెండు రోజుల క్రితం(ఏప్రిల్ 14,2020) బాలుడు, కుటుంబసభ్యులు స్వగ్రామానికి చేరుకున్నారు. ఏపీలో అత్యధిక కేసులు నమోదవుతున్న గుంటూరు నుంచి బాలుడు వచ్చాడన్న స్థానికుల సమాచారంతో గ్రామానికి చేరుకున్న వైద్యాధికారులు అతడి నుంచి రక్త నమూనాలు సేకరించి పరీక్షించారు. చిన్నారికి కరోనా సోకినట్టు రిపోర్టుల్లో స్పష్టమైంది. దీంతో బాలుడిని వెంటనే హైదరాబాద్ తరలించారు.
బాలుడితో పాటు తాతకు కూడా వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే తాతకు నెగిటివ్ అని రాగా, బాలుడికి మాత్రం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గుంటూరులో ఆపరేషన్ చేయించుకుని వచ్చిన ఐదేళ్ల బాలుడికి కరోనా సోకడం స్థానికంగా కలకలం రేపుతోంది. పిల్లాడి తల్లిదండ్రులు, స్థానికులు భయాందోళన చెందుతున్నారు. పిల్లాడి క్షేమం గురించి తల్లిదండ్రులు వర్రీ అవుతున్నారు.
తెలంగాణలో 650, ఏపీలో 514 కరోనా కేసులు:
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. తెలంగాణ, ఏపీలో రోజూ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 650 మంది కరోనా బారినపడ్డారు. యాక్టివ్ కేసులు 514. ఇప్పటివరకు కరోనాతో 18మంది చనిపోయారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 118మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలోనూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 525మంది కరోనా బారిన పడ్డారు. ఏపీలో అత్యధికంగా గుంటూరు జిల్లాలో 122 కేసులు నమోదయ్యాయి. ఏపీలో ఇప్పటివరకు 14మంది కరోనాతో చనిపోయారు. 20మంది కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
ప్రపంచవ్యాప్తంగా 20.82లక్షలు, దేశంలో 12వేల 300 కరోనా కేసులు:
దేశంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 12వేల 300కి చేరింది. దేశవ్యాప్తంగా 424మంది మృత్యువాతపడ్డారు. దేశంలో ఇప్పటివరకు 1,357 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే కరోనా బాధితుల సంఖ్య 20లక్షల 82వేలకు చేరింది. ప్రపంచవ్యాప్తంగా లక్షా 34వేల మంది కరోనాకు బలయ్యారు. ప్రపంచవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 14లక్షల 30వేలు. అన్ని దేశాల్లో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 5.8లక్షలు.
అమెరికాలో 6.44లక్షలకు చేరిన కరోనా కేసులు, 28వేల 383 మరణాలు:
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 6లక్షల 44వేలకు చేరింది. నిన్న(ఏప్రిల్ 15,2020) కొత్తగా 27వేల 413 కేసులు నమోదయ్యాయి. అమెరికాలో ఇప్పటివరకు కరోనాతో 28వేల 383మంది చనిపోయారు. అమెరికాలో నిన్న ఒక్కరోజే 2వేల 336మంది మరణించారు. న్యూయార్క్ నగరంలో గత 24 గంటల్లో 752మంది మృత్యువాతపడ్డారు.
Also Read | వారివల్లే మళ్లీ కరోనా కేసులు.. ఒకరిని పట్టించినా రూ.54వేలు ఇస్తాం!